హాలీవుడ్‌లో AI విప్లవానికి నెట్‌ఫ్లిక్స్ శ్రీకారం!
ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ హాలీవుడ్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇంట్రెస్టింగ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది.;
ప్రపంచంలోని ప్రముఖ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లలో ఒకటైన నెట్‌ఫ్లిక్స్ హాలీవుడ్ మార్కెట్‌లో తన ఆధిపత్యాన్ని మరింత బలోపేతం చేయడానికి ఇంట్రెస్టింగ్ ప్లాన్‌తో ముందుకు సాగుతోంది. సాంప్రదాయ స్టూడియోలను కొనుగోలు చేయడం లాంటి మార్గాలను ఎంచుకోవడం బదులుగా, కొత్త టెక్నాలజీపై దృష్టి సారిస్తూ AI ఆధారిత ఫిల్మ్ టెక్నాలజీ రంగంలో అడుగుపెడుతోంది. ఈ క్రమంలో, ప్రముఖ నటుడు మరియు డైరెక్టర్ బెన్ అఫ్లెక్స్ స్థాపించిన AI ఆధారిత ఫిల్మ్ టెక్నాలజీ కంపెనీ ఇంటర్‌పాజిటివ్ ను నెట్‌ఫ్లిక్స్ కొనుగోలు చేసినట్లు సమాచారం.
పోస్ట్ ప్రొడక్షన్ పైనే ఇంటర్‌పాజిటివ్ దృష్టి
ఈ డీల్ హాలీవుడ్‌లో పెద్ద టెక్నికల్ మార్పుకు నాంది పలికే అవకాశముందని ఇండస్ట్రీ వర్గాలు భావిస్తున్నాయి. ఇంటర్‌పాజిటివ్ డెవలప్ చేసిన టెక్నాలజీ మెయిన్ గా పోస్ట్ ప్రొడక్షన్‌పై దృష్టి సారిస్తుంది. సాధారణంగా సినిమా లేదా వెబ్ సిరీస్ షూటింగ్ పూర్తయ్యాక ఎడిటింగ్, విజువల్ ఎఫెక్ట్స్, లైటింగ్ అడ్జస్ట్‌మెంట్స్ లాంటి పనులు ఎంతోమంది టీమ్స్ నెలల తరబడి చేయాల్సి ఉంటుంది. అలాంటిది ఈ AI ఆధారిత టెక్నాలజీ వల్ల ఈ ప్రక్రియలో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది.
తక్కువ ఖర్చుతో పూర్తయ్యే ఛాన్స్
ఈ వ్యవస్థ ప్రత్యేకంగా షూటింగ్ సమయంలో తీసిన రా ఫుటేజ్‌ను విశ్లేషించి దానిపై AI మోడళ్లను ఉపయోగిస్తుంది. అవసరమైతే సీన్స్‌కు కొత్త లైటింగ్‌ను యాడ్ చేయడం, ఫ్రేమ్స్‌ను రీ అడ్జస్ట్ చేయడం, కెమెరా యాంగిల్స్ ను మార్చడం మాత్రమే కాకుండా అదనపు విజువల్ ఎఫెక్ట్స్‌ను కూడా క్రియేట్ చేయగలదు. ప్రస్తుతం ఈ వర్క్స్ కోసం పెద్ద ఎడిటింగ్ టీమ్‌లు, వీఎఫ్ఎక్స్ ఆర్టిస్టులు మరియు లైటింగ్ టెక్నీషియన్స్ అవసరమవుతున్నారు. కానీ AI టూల్స్ వినియోగంతో ఈ ప్రక్రియ వేగంగా, తక్కువ ఖర్చుతో పూర్తి కావచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.
ప్రొడక్షన్ టైమ్ తగ్గే అవకాశాలు
సినీ నిర్మాణంలోనే పోస్ట్ ప్రొడక్షన్ అనేది అత్యంత ఖర్చుతో కూడుకున్న దశగా పరిగణించబడుతుంది. కొన్నిసార్లు వందలాది మంది నిపుణులు నెలల తరబడి పనిచేయాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో AI ఆధారిత పరిష్కారాలు విస్తృతంగా ఉపయోగంలోకి వస్తే, సినిమాల నిర్మాణ విధానమే మారిపోవచ్చని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రాజెక్టుల బడ్జెట్‌లు తగ్గడం మాత్రమే కాకుండా నిర్మాణ సమయం కూడా గణనీయంగా తగ్గే అవకాశముంది.
ఈ కొనుగోలు సమయం కూడా ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది. త్వరలో జరగబోయే SAG-AFTRA చర్చల్లో సినిమా మరియు టెలివిజన్ రంగాల్లో AI వినియోగం కీలక అంశంగా మారనుంది. ఇప్పటికే AI టెక్నాలజీ వల్ల క్రియేటివ్ రంగ ఉద్యోగాలపై ప్రభావం పడుతుందనే ఆందోళనలు హాలీవుడ్‌లో తీవ్ర చర్చలకు దారి తీస్తున్నాయి. ఈ నేపథ్యంలో నెట్‌ఫ్లిక్స్ తీసుకున్న ఈ నిర్ణయం ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీలో రాబోయే టెక్నికల్ మార్పులకు ముందస్తు సంకేతంగా భావిస్తున్నారు. ఫ్యూచర్ లో AI ఆధారిత ఫిల్మ్ మేకింగ్ సాధారణంగా మారే అవకాశం ఉండగా, ఈ మార్పులో నెట్‌ఫ్లిక్స్ కీలక పాత్ర పోషించే అవకాశముందని పరిశ్రమ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.