అగ్ర హీరో అగ్ర దర్శకుడితో పెట్టుకుంటే అంతేగా
ఎఫ్ 3 లో `అంతేగా అంతేగా..` అంటూ బోలెడంత ఫన్ క్రియేట్ చేసాడు వెంకీ మామ. ఆ తర్వాత చాలా మీమ్స్ లో `అంతేగా` బాగా పాపులరైంది.;
ఎఫ్ 3 లో `అంతేగా అంతేగా..` అంటూ బోలెడంత ఫన్ క్రియేట్ చేసాడు వెంకీ మామ. ఆ తర్వాత చాలా మీమ్స్ లో `అంతేగా` బాగా పాపులరైంది. `అంతేగా..` అంటూ యూత్ క్రేజీగా అనుకరించేవారు. ఇప్పుడు అగ్ర నిర్మాత కే.ఎల్ నారాయణకు కూడా ఇదే వర్తిస్తుందని గుసగుస వినిపిస్తోంది. 15 ఏళ్లుగా ఎదురు చూపులు చూసిన ఆయనను చూసి అగ్ర హీరో, అగ్ర దర్శకుడితో పెట్టుకుంటే `అంతేగా` అని కామెంట్ చేస్తున్నారు కొందరు పరిశ్రమ వ్యక్తులు.
దాదాపు 15 ఏళ్ల క్రితం.. కరోనా క్రైసిస్ లాంటి విపత్తులు లేని కాలంలో.. అంతా సవ్యంగానే ఉన్న రోజుల్లో అగ్ర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళితో సినిమా చేయాలనుకున్నారు కేఎల్ నారాయణ. అప్పట్లో చాలా మీడియాలు ప్రతిసారీ మహేష్ తో కేఎల్ నారాయణ సినిమా మొదలవుతోంది అంటే రాజమౌళి ప్రాజెక్టు ఇదేనా? అంటూ కథనాలు వండి వార్చాయి. అప్పటికే మహేష్ బాబు రైజింగ్ హీరోగా దూసుకెళుతూ కూడా కేఎల్ నారాయణకు కాల్షీట్లు కేటాయిస్తానని చెప్పారు. అప్పట్లో ఆయన అడ్వాన్సులు కూడా ఇచ్చారని ప్రచారమైంది.
కానీ ఈ ప్రాజెక్ట్ చేయడం కోసం ఆయన ఏకంగా 15 సంవత్సరాలు ఎదురు చూడాల్సి వచ్చింది. అగ్ర హీరోగా మహేష్ వరస చిత్రాలతో బిజీ అయిపోయారు. అదే సమయంలో రాజమౌళి అపజయం ఎరుగని దర్శకుడిగా వరుసగా విజయాలను సొంతం చేసుకున్నారు. స్టూడెంట్ నంబర్ 1 (2001), సింహాద్రి (2003), సై (2004), ఛత్రపతి (2005), విక్రమార్కుడు, యమదొంగ, మగధీర, మర్యాద రామన్న(2010) లాంటి వరుస హిట్ సినిమాలను తెరకెక్కించారు. మగధీరతో అప్పటికే ఇండస్ట్రీ హిట్ ఇచ్చిన దర్శకుడిగాను రాజమౌళి పేరు మార్మోగిపోయింది. అందువల్ల ఇండస్ట్రీ బెస్ట్ డైరెక్టర్ తో కేఎల్ నారాయణ ప్రాజెక్ట్ సెట్ అయిందన్న ప్రచారం చాలా వేడెక్కిపోయింది. కానీ అది పట్టాలెక్కడానికి మాత్రం ఏకంగా పదిహేనేళ్లు పట్టింది.
అయితే కేఎల్ నారాయణ ఇన్ని సంవత్సరాలు చాలా ఓపిగ్గా ఎదురు చూసారు. ఆయన వారణాసి టైటిల్ లాంచ్ ఈవెంట్లో రాజమౌళి గురించి మాట్లాడుతూ ఒక మాట అన్నారు. 15 ఏళ్ల క్రితం రాజమౌళి ఎలా ఉన్నారో ఇప్పటికీ అలానే ఉన్నారు అని కితాబిచ్చారు. ఇప్పుడు పాన్ ఇండియా డైరెక్టర్ గా ఎదిగేసినా కానీ, ఆయన కమిట్ మెంట్ ప్రకారం తన కోసం సినిమా చేస్తున్నారనే ఆనందం వ్యక్తం చేసారు కె.ఎల్ నారాయణ.
``15 ఏళ్ల క్రితం మహేష్ గారిని రాజమౌళితో సినిమా చేయాలని కోరుకున్నాను. కానీ ఇంత టైమ్ పడుతుందని ఇద్దరం అనుకోలేదు. పదిహేనేళ్ల క్రితమే మహేష్ తో సినిమా చేయాలని రాజమౌళిని అడిగాను.. అయితే అప్పటికే ప్రాధాన్యత ఉన్న సినిమాలు పూర్తయిన తర్వాత చేస్తానని అన్నారు. ఈగ, ఆర్.ఆర్.ఆర్, బాహుబలి వంటి సినిమాలు తీసి ఆయన ఎంత ఎత్తుకు ఎదిగారో అందరికీ తెలుసు. ఈ పదిహేనేళ్లలో ఆయన ఏమీ మారలేదు. అంతే సింపుల్‌గా ఉన్నారు. అదే కమిట్ మెంట్ డెడికేషన్ తో ఉన్నారు`` అని కితాబిచ్చారు. తనను 15 ఏళ్ల పాటు వెయిట్ చేయించిన హీరో, దర్శకుడిపై కేఎల్ నారాయణ సాఫ్ట్ కార్నర్ నిజంగా ఆశ్చర్యపరుస్తోందని పరిశ్రమ వర్గాల్లో గుసగుస వినిపిస్తోంది. ఆయన జీవితకాలం వేచి చూసాక కూడా చాలా ఓపిగ్గా ఉన్నారని నెటిజనులు కామెంట్ చేస్తున్నారు. కొందరు ఎదురు చూడటం తప్ప ఇంకేమీ చేయలేరని కూడా వ్యాఖ్యానిస్తున్నారు.