తిరుమలలో ఘనంగా కిరణ్ అబ్బవరం కొడుకు నామకరణం.. ఏం పేరు పెట్టారంటే?

ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో సందడి చేసారు కిరణ్ అబ్బవరం ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్.;

Update: 2025-08-04 04:59 GMT

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ అండ్ టాలెంటెడ్ హీరోగా పేరు సొంతం చేసుకున్న కిరణ్ అబ్బవరం.. ఒకవైపు సినిమాలు మరొకవైపు వ్యక్తిగత జీవితాన్ని చాలా చక్కగా బ్యాలెన్స్ చేస్తున్నారు. అందులో భాగంగానే అభిమానుల కోసం వరుస సినిమాలు ప్రకటిస్తూనే.. ఇటు ఫ్యామిలీ లైఫ్ ని కూడా ఆయన ఎంజాయ్ చేస్తున్నారని చెప్పవచ్చు. ఈ క్రమంలోనే తాజాగా తిరుమలలో సందడి చేసారు కిరణ్ అబ్బవరం ఆయన సతీమణి ప్రముఖ హీరోయిన్ రహస్య గోరఖ్. స్వామివారి ఆశీస్సులతో తమ కొడుకుకి నామకరణం కూడా చేశారు. కొడుకు నామకరణం పూర్తయిన తర్వాత స్వామివారిని దర్శించుకున్న కిరణ్ అబ్బవరం దంపతులు మీడియాతో ముచ్చటించారు.


కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ.. ఇప్పుడే శ్రీవారిని దర్శించుకున్నాము. మా అబ్బాయి నామకరణం కోసమే తిరుమల వచ్చాము. బాబుకి హను అబ్బవరం అని పేరు పెట్టాము. శ్రీవారి దర్శనం చాలా బాగా జరిగింది అంటూ తెలిపారు కిరణ్ అబ్బవరం. ఇకపోతే తన తదుపరి చిత్రాలపై కూడా ఆయన ప్రస్తావించారు. ప్రస్తుతం కె ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలు చిత్రీకరణ సాగుతున్నాయి. ఈనెల మరో సినిమా షూటింగ్ ప్రారంభం కానుంది అంటూ స్పష్టం చేశారు. ఇకపోతే కిరణ్ అబ్బవరం తన కొడుకుకి నామకరణం చేశారని తెలిసి పలువురు అభిమానులు, సెలబ్రెటీలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. బాబు పేరు హనుమంతుడి పేరు వచ్చేలా పెట్టడంతో.. ఆ హనుమంతుడి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు.


రహస్య గోరఖ్ , కిరణ్ అబ్బవరం ప్రేమ, పెళ్లి విషయానికొస్తే.. రాజావారు రాణిగారు అనే సినిమా ద్వారా హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన కిరణ్.. అదే సినిమాలో కథానాయికగా నటించిన రహస్య గోరఖ్ తో ప్రేమలో పడ్డారు. దాదాపు ఐదేళ్లపాటు ప్రేమించుకున్న వీరు 2024 మార్చి 13న హైదరాబాదులో నిశ్చితార్థం చేసుకున్నారు. ఇక తర్వాత అదే ఏడాది కర్ణాటకలోని కూర్గ్ లో వీరి వివాహం జరిగింది. ఇక తన భార్య రహస్య గర్భవతి అయ్యింది అని, తల్లిదండ్రులుగా త్వరలో ప్రమోట్ కాబోతున్నామంటూ ఆ సంతోషాన్ని అభిమానులతో 2025 జనవరి 12వ తేదీన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు హీరో కిరణ్. అనంతరం ఈ దంపతులకు మే 22న కుమారుడు జన్మించారు.


కిరణ్ అబ్బవరం సినిమాల విషయానికి వస్తే.. రాజావారు రాణిగారు సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ఈయన.. ఆ తర్వాత ఎస్ఆర్ కళ్యాణమండపం, సెబాస్టియన్ పిసి 524, సమ్మతమే, వినరో భాగ్యము విష్ణు కథ, రూల్స్ రంజన్ , మీటర్ వంటి చిత్రాలలో నటించారు. ఇప్పుడు కే ర్యాంప్, చెన్నై లవ్ స్టోరీ సినిమాలలో నటిస్తున్నారు. సాయి రాజేష్ దర్శకత్వంలో ఎస్.కే.ఎన్ నిర్మాణంలో రాబోతున్న ఈ చిత్రంలో శ్రీ గౌరీ ప్రియ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే.

Tags:    

Similar News