15 ఏళ్ల ప్రేమ 30 సెకండ్లలో కనిపించింది -కీర్తి సురేష్

మహానటి కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి..'నేను శైలజ' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది.;

Update: 2026-01-29 05:29 GMT

మహానటి కీర్తి సురేష్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరియర్ మొదలుపెట్టి..'నేను శైలజ' అనే సినిమాతో ఇండస్ట్రీకి పరిచయమైంది. మొదటి సినిమాతోనే అమాయకత్వంతో , నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది ఈ ముద్దుగుమ్మ. తర్వాత మహానటి సినిమాలో దివంగత నటీమణి సావిత్రి పాత్ర పోషించి, తన అద్భుతమైన నటనతో అందరి దృష్టిని ఆకట్టుకుంది. అంతేకాదు ఉత్తమ నటిగా ఏకంగా నేషనల్ అవార్డు అందుకొని సంచలనం సృష్టించింది. అంతేకాదు ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ సమయంలోనే నేషనల్ అవార్డు అందుకున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది ఈ ముద్దుగుమ్మ.

ఇండస్ట్రీలో చాలా సంవత్సరాలుగా కొనసాగుతున్న కీర్తి సురేష్ ఇప్పటివరకు ఎలాంటి ఎఫైర్ రూమర్స్ ఎదుర్కోలేదు

ఇక ఎట్టకేలకు గత 15 సంవత్సరాలుగా రహస్యంగా ప్రేమించిన తన చిన్ననాటి స్నేహితుడు ఆంటోనీ తట్టిల్ తో ఏడడుగులు వేసి అందరిని ఆశ్చర్యపరిచింది. ముఖ్యంగా ఈ విషయం తన తల్లిదండ్రులకు కూడా తెలియదని.. అయితే తన ప్రేమ విషయాన్ని మొదటగా జగపతిబాబుకు మాత్రమే చెప్పానని.. ఆ తర్వాత తన కుటుంబ సభ్యులకు చెప్పి ఒప్పించి వివాహం చేసుకున్నాను అంటూ గత ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తాజాగా మరో ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె తన వివాహ వేడుక గురించి మాట్లాడుతూనే.. తన 15 ఏళ్ల ప్రేమ కేవలం 30 సెకండ్లలో తన కళ్ళ ముందు కదలాడింది అంటూ చెప్పి ఎమోషనల్ అయింది.

ఇంటర్వ్యూలో భాగంగా కీర్తి సురేష్ మాట్లాడుతూ.. గత 15 సంవత్సరాలుగా నేను నా భర్త ఆంటోనీ తట్టిల్ తో ప్రేమలో ఉన్నాము. పెళ్లి చాలా వైభవంగా జరుగుతుందని నేనెప్పుడూ అనుకోలేదు. కారణం నేను ప్రేమించడం. అయితే కచ్చితంగా పారిపోయి పెళ్లి చేసుకుంటామని అనుకున్నాము. మా ఇంట్లో వాళ్ళు మా పెళ్లికి అంగీకరించడమే కాకుండా మా వివాహ వేడుకను చాలా ఘనంగా నిర్వహించారు. ఆ క్షణం కన్నీళ్ళతో మునిగిపోయాను. ఒక్క క్షణం నాకు నోట మాట రాలేదు. ఇక 15 ఏళ్ల ప్రేమ 30 సెకండ్లలో ఆంటోనీ నాకు తాళి కడుతుంటే కళ్ళ ముందు కదలాడింది. దీంతో ఆనంద భాష్పాలు ఆగలేదు. ఆంటోని కూడా ఈ ఘటనను నమ్మలేకపోయాడు. అప్పుడు నాతో పాటు ఆంటోనీ కళ్ళల్లో కూడా ఆనందభాష్పాలు నేల జారాయి. ఇద్దరం ఎమోషనల్ అయ్యాము. అయితే నేను మొదటిసారి ఆంటోనీ కళ్ళలో నీళ్లు చూశాను. మాదొక అందమైన ప్రయాణం" అంటూ కీర్తి సురేష్ తన ప్రేమ , పెళ్లి విషయాన్ని అభిమానులతో పంచుకుంది. ఇకపోతే 2024 డిసెంబర్ 12న హిందూ సాంప్రదాయం ప్రకారం, డిసెంబర్ 15న క్రైస్తవ సాంప్రదాయం ప్రకారం ఆంటోనీ తట్టిల్, కీర్తి సురేష్ రెండు సార్లు సాంప్రదాయంగా వివాహం చేసుకున్నారు.

కీర్తి సురేష్ ప్రస్తుత సినిమాల విషయానికొస్తే.. చివరిగా ఉప్పుకప్పురంబు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఇది అమెజాన్ ప్రైమ్ వీడియోలో స్ట్రీమింగ్ అయింది. సంచలన దర్శకుడు మిష్కిన్ తో కలిసి ఒక సినిమాలో నటిస్తున్న ఈమె.. బేబీ జాన్ తర్వాత మరో బాలీవుడ్ చిత్రంలో అవకాశం అందుకున్నట్లు సమాచారం. అలాగే కన్నేవిడి అనే తమిళ చిత్రంలో నటిస్తోంది

Tags:    

Similar News