నాలుగేళ్లకు కెప్టెన్ కుర్చీ ఎక్కుతోన్న అగ్ర నిర్మాత!
దర్శకుడిగా చివరిగా నాలుగేళ్ల క్రితం 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు.;
బాలీవుడ్ దర్శక, నిర్మాత కరణ్ జోహార్ కొంతకాలంగా నిర్మాతగానే బిజీ అయిన సంగతి తెలిసిందే. దర్శకుడిగా 'కుచ్ కుచ్ హోతా హై', 'స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్', 'బొంబాయి టాకీస్', ' మై నేమ్ ఈజ్ ఖాన్', ' ఏ దిల్ హై ముష్కిల్', 'లస్ట్ స్టోరీస్', 'ఘోస్ట్ స్టోరీస్' లాంటి హిట్ చిత్రాలు అందించిన తర్వాత నిర్మాతగానే బిజీ అయ్యారు. మధ్యలో చాలా సినిమాలు నిర్మాణం చేసారు. దర్శకుడిగా కంటే నిర్మాతగానే పరిశ్రమలో నిరంతరం బిజీగా ఉంటారు. దర్శకుడిగా చివరిగా నాలుగేళ్ల క్రితం 'రాకీ ఔర్ రాణీకి ప్రేమ్ కహానీ' లాంటి బ్లాక్ బస్టర్ అందించాడు.
ఆ తర్వాత మళ్లీ కరణ్ కెప్టెన్ కుర్చీ ఎక్కలేదు. కానీ తాను సంకల్పించాడంటే? ప్రేక్షకులకు హిట్ సినిమానే అందిస్తాడు. ఈ నేపథ్యంలో తాజాగా కరణ్ మళ్లీ కెప్టెన్ కుర్చీ ఎక్కుతున్నాడు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కి సంబంధించి స్టోరీ కూడా రెడీ చేసి పెట్టాడు. 'కభీ ఖుషీ కభీ ఘమ్' తరహాలో ఉండే బలమైన ప్రేమ, కుటుంబం, భావోద్వేగాల నేపథ్యంలో ఉంటుందట. ఇందులో ఇద్దరు హీరోలు, ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారట. అయితే ఈ వివరాలు ఇంకా బయటకు రాలేదు. ప్రస్తుతం కరణ్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో హీరో, హీరోయిన్లగా ఎవరు ఛాన్స్ అందుకుంటారు? అన్నది ఆసక్తికరంగా మారింది.
అలాగే ఈ చిత్రాన్ని తానే సొంతంగా ధర్మ ప్రొడక్షన్స్ లోనే నిర్మించనున్నారు. బయట బ్యానర్లు ముందుకొచ్చినా? ఆ ఛాన్స్ ఇవ్వలేదు. మరోసారి తానే దర్శక, నిర్మాత కావాలనుకుంటున్నాడు. అలాగే ఈ చిత్రాన్ని పాన్ ఇండి యాలోనూ రిలీజ్ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే కరణ్ టాలీవుడ్, కోలీవుడ్ లో కూడా సత్తా చాటే ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ క్రమంలో తాజా సినిమా కోసం ఈ రెండు పరిశ్రమల నటుల్ని భాగం చేస్తే మార్కెట్ పరంగా కలిసొస్తుంది. మరి ఈ అంశాన్ని కరణ్ పరిగణలోకి తీసుకుంటున్నాడా? లేక బాలీవుడ్ నటులతోనే పాన్ ఇండియా రిలీజ్ ప్లాన్ చేస్తాడా? అన్నది చూడాలి.
అయితే ఈ సినిమాలో భాగమవ్వడానికి బాలీవుడ్ నుంచి చాలా మంది హీరోలు పోటీ పడుతున్నారు. ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న కార్తీర్ ఆర్యన్, విక్రాంత్ మాస్సే, ఇషాన్ కట్టర్, ఆహాన్ పాండే, అనీత్ పడ్డా లాంటి వారు ఆసక్తి చూపిస్తున్నారు. అలాగే ఇతర కీలక పాత్రలకు పలువురు సీనియర్ నటులు కూడా క్యూలో ఉన్నారు. మరి కరణ్ ఛాన్స్ ఎవరెవరికిస్తారు? అన్నది చూడాలి. గత ఏడాది కరణ్ బ్యానర్ నుంచి తొమ్మిది సినిమాలు రిలీజ్ అయ్యాయి. కొత్త ఏడాదిలో మాత్రం ఎలాంటి సినిమాలు నిర్మిస్తున్నారు? అన్నది కూడా ఇంకా బయటకు రాలేదు.