కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ హైలెట్స్..!

ఈ సినిమా తీయమని మోహన్ బాబుకి శివుడే చెప్పాడని అన్నారు బ్రహ్మానందం. సినిమా నచ్చకపోతే విమర్శించినా పర్లేదు. కానీ భక్తి సినిమా కాబట్టి ట్రోల్ చేయకండని అన్నారు.;

Update: 2025-06-22 17:59 GMT

మంచు విష్ణు లీడ్ రోల్ చేస్తూ నిర్మించిన సినిమా కన్నప్ప. 50 ఏళ్ల క్రితం వచ్చిన కన్నప్ప కథను మరోసారి ఈ తరం ప్రేక్షకులకు చెప్పాలనే ఆలోచనతో మంచు విష్ణు కన్నప్ప సినిమా తెరకెక్కించారు. ఈ సినిమాను ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ చేయగా సినిమాలో పాన్ ఇండియా స్టార్స్ అంతా భాగం అయ్యారు. ఈ నెల 27న రిలీజ్ కాబోతున్న కన్నప్ప సినిమాను మరింత ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రమోషన్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో శనివారం హైదరాబాద్ జె.ఆర్.సీ కన్వెషన్ లో కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. చిత్రయూనిట్ సమక్షంలో జరిగిన ఈ ఈవెంట్ లో సినిమా అనుభవాలతో వారు ప్రేక్షకులను అలరించారు.

కన్నప్పగా తాను చేసిన ఈ ప్రయత్నం గురించి మంచు విష్ణు చాలా ఎమోషనల్ గా మాట్లాడారు. సినిమా వారం లో రిలీజ్ ఉంది ఇంకా కష్టాలు పడుతూనే ఉన్నామని అన్నారు. 2014 లో కన్నప్ప కథ తన దగ్గరకు రాగా హక్కులు పొందానని.. ఆ తర్వాత దాన్ని డెవలప్ చేశామని అన్నారు మంచు విష్ణు. శివుడి అనుగ్రహం వల్లే ఇంతమంది స్టార్స్ తో ఈ సినిమా చేశామని అన్నారు.

ఇది విష్ణు సినిమా కాదు.. ఇది కన్నప్ప సినిమా.. సినిమా చూశాక ఇలాంటి సినిమా నేను చేయగలిగానా అని షాక్ అయ్యానని అన్నారు మంచు విష్ణు. స్టీఫెన్ దేవస్సీ సంగీతం సినిమాకు ఎంతో సపోర్ట్ చేసిందని.. ఒక ఈవెంట్ లో ఆయన్ను కలిసి కన్నప్ప ఎప్పుడు మొదలు పెడతానో తెలియదు కానీ కచ్చితంగా ఆయన్నే తీసుకుంటా అని చెప్పా అలానే చేశామని అన్నారు మంచు విష్ణు.

ఈ సినిమా కోసం మోహన్ లాల్, అక్షయ్ కుమార్ పనిచేశారు. వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు విష్ణు. శరత్ కుమార్ గారు తండ్రి సమానులని అన్న విష్ణు తమిళ్ లో సినిమా భారీగా రిలీజ్ అవుతుంది అంటే అది ఆయన వల్లే అని అన్నారు. కన్నప్ప సినిమా గురించి శివరాజ్ కుమార్ గారు ఒక సందర్భంలో అడిగితే సినిమా తెలుగు తెర మీద కన్నప్ప వచ్చి 50 ఏళ్లు అయ్యింది. ఈ తరానికి వాయులింగం, శ్రీకాళహస్తి గురించి చెప్పమని శివుడే తనని ఆదేశించాడని చెప్పానని అన్నారు విష్ణు. ఇక సినిమాలో ప్రభాస్ నాన్న కోసం నటించారని. ఈతరం మనుషులు ప్రభాస్ ని చూసి చాలా నేర్చుకోవాలని. ప్రభాస్ తన జీవితంలో కృష్ణుడని.. అతనికి తాను కర్ణుడిగా ఉంటానని అన్నారు మంచు విష్ణు.

ఇదే ఈవెంట్ లో కన్నప్ప గురించి తన బిడ్డ మంచు విష్ణు పడిన కష్టం గురించి కలెక్షన్ కింగ్ మోహన్ బాబు మాట్లాడారు. ఈ సినిమా చేశామంటే అది భగవంతుడి ఆశీస్సుల వల్లే అని అన్నారు. మన ప్రతి కదలిక ఆయన నిర్ణయమే అని అన్నారు. సినిమా గురించి అందరు చెప్పారు తానేమి చెప్పనని.. మంచి సినిమా తీశాం.. మీ ఆశీస్సులు నా బిడ్డ విష్ణుకి ఉండాలని అన్నారు. ఈ సినిమాలో ప్రతి ఒక్కరు హీరోలే అని.. వారందరికీ రుణపడి ఉంటానని అన్నారు మోహన్ బాబు. ముఖేష్ తీసిన మహా భారతం సీరియల్ 10, 15 సార్లు చూశాను. అద్భుతంగా తీశాడు.. అది చూసే ఈ సినిమా అవకాశం ఇచ్చామని అన్నారు మోహన్ బాబు. ఇక ఈవెంట్ కి కొంతమంది అతిథులను పిలవడం జరిగిందని.. బోయవాడు అయిన తిన్నడు కన్నప్పగా ఎలా మారాడన్నది సినిమా కాబట్టి ఆదివాసీయులు పిలిచి సత్కరించామని అన్నారు మోహన్ బాబు.

కన్నప్ప ఈవెంట్ లో డైరెక్టర్ ముఖేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. కన్నప్ప సినిమా చేస్తూ రెండున్నరేళ్లుగా హైదరాబాద్ నా సొంత ఇల్లుగా అయ్యిందని.. మోహన్ బాబు గారి వల్లే ఈ సినిమా చేశానని.. ఆయన ధైర్య సాసహాలకు హ్యాట్సాఫ్ అన్నారు ముఖేష్ కుమార్ సింగ్. పైకి కఠినంగా కనిపించినా లోపల స్వచ్చమైన, మృదువైన వ్యక్తి అని అన్నారు. విష్ణు చాలా తక్కువ టేక్ లతో అద్భుతంగా చేశాడని.. అలాంటి నటుడితో తాను ఎప్పుడు చేయలేదని అన్నారు. ఇక సినిమాలో నటించిన వారంతా అతిథిలా వచ్చి వెళ్లే వారు కాదని కచ్చితంగా కథకు కనెక్ట్ అవుతారు అన్నారు. ప్రభాస్ కేవలం రెబల్ స్టార్ మాత్రమే కాదు హంబుల్ స్టార్ అని అన్నారు ముఖేష్ కుమార్ సింగ్.

మోహన్ బాబు అసలు నచ్చడు కానీ అంటూ హాస్య బ్రహ్మ బ్రహ్మానందం సరదా సంభాషణ.. కన్నప్ప ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బ్రహ్మానందం స్పీచ్ హైలెట్ గా నిలిచింది. అంతకుముందు సుమ బ్రహ్మానందంతో కొన్ని సరదా ప్రశ్నలు అడిగితే ఆయన కూడా అంతే సరదాగా ఆన్సర్ ఇచ్చారు. మోహన్ బాబు, విష్ణు ఇద్దరిలో ఎవరు అందగాడు అని సుమ అడగ్గా.. విష్ణు అందంగా ఉంటాడని అన్నారు బ్రహ్మానందం. ఇక మోహన్ బాబు గారి సినిమాలు రీమేక్ చేయాల్సి వస్తే ఏది చేస్తారని అడిగితే.. అసెంబ్లీ రౌడీ అని అన్నారు బ్రహ్మానందం. ఆ సినిమాకు ముందు నన్నే సంప్రదించారు.. మనకెందుకు అని వదిలేశా.. నాకు అవకాశం ఇవ్వండి అని మోహన్ బాబు మా ఇంటికొచ్చి అడిగాడు అందుకే ఇచ్చేశా అంటూ సరదాగా చెప్పారు బ్రహ్మానందం. యమదొంగలో యముడి పాత్ర కోసం మొదట మిమ్మల్ని అనుకున్నారట కదా అని సుమ అడిగితే. లేదు యముడి పాత్రకు మోహన్ బాబే సరిపోతాడని సినిమాల్లోనే కాదు బయట కూడా ఆయన అలానే ఉంటాడని చెప్పారు బ్రహ్మానందం. ఆ తర్వాత మోహన్ బాబులో మీకు నచ్చే విషయం, నచ్చని విషయం చెప్పమంటే.. అసలు మోహన్ బాబే నచ్చడు అని సరదాగా అన్నారు. ఐతే ఆ తర్వాత స్పీచ్ లో మోహన్ బాబుతో ఉన్న చనువు కొద్దీ అలా సరదాగా మాట్లాడానని ఆయన గొప్ప నటుడని అన్నారు బ్రహ్మానందం.

ఈ సినిమా తీయమని మోహన్ బాబుకి శివుడే చెప్పాడని అన్నారు బ్రహ్మానందం. సినిమా నచ్చకపోతే విమర్శించినా పర్లేదు. కానీ భక్తి సినిమా కాబట్టి ట్రోల్ చేయకండని అన్నారు. ఇదే క్రమంలో ఈవెంట్ లో మాట్లాడిన శరత్ కుమార్ కూడా బ్రహ్మానందం గారు చెప్పినట్టుగా శివుడి ఆజ్ఞతోనే ఇక్కడిదాకా వచ్చామని అన్నారు. నేటి యువతలో దేవుడి మీద విశ్వాసం తగ్గుతుంది. ఈ సినిమాతో మళ్లీ పెరుగుతుందని ఆశిస్తున్నా అన్నారు. ఈ సినిమా చూసి మీ అభిప్రాయం తెలపండి. సినిమాపై నెగెటివ్ ప్రచారం చేయొద్దని అన్నారు శరత్ కుమార్.

కన్నప్ప ప్రయాణంలో చిత్ర యూనిట్ చెబుతున్న మాటలను బట్టి చూస్తే వారు సినిమాగా కాకుండా ఇదో దైవకార్యం గానే కష్టపడినట్టు ఉన్నారు. కన్నప్ప రిలీజ్ కి వారం ఉందనగా జరిగిన ఈ ఈవెంట్ ప్రేక్షకుల్లో మరింత బజ్ పెంచింది. అంతేకాదు మంచు విష్ణు స్పీచ్ కూడా ప్రేక్షకులను టచ్ చేసింది. మరి మూవీ టీం అంతా పడిన కష్టానికి ఆడియన్స్ నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో రిలీజ్ నాడు తెలుస్తుంది.

Tags:    

Similar News