తెలుగు సినిమా రిలీజైతే కన్నడ పోస్టర్లు వేయాలా?
నేడు ప్రాంతీయ సరిహద్దులను దాటుకుని దక్షిణాది సినిమా పాన్ వరల్డ్ కి రీచ్ అయింది.;
నేడు ప్రాంతీయ సరిహద్దులను దాటుకుని దక్షిణాది సినిమా పాన్ వరల్డ్ కి రీచ్ అయింది. పాన్ ఇండియాలోనే కాదు, ఇకపై హాలీవుడ్ కి ధీటుగా పాన్ వరల్డ్ లో సంచలనాలు సృష్టించే దిశగా మన సినిమా ఎదుగుతోంది. ఇలాంటి సమయంలో ఇంకా విస్తరించని ఆలోచనలతో ఇరుకు మెంటాలిటీని ప్రదర్శించడానికి కొందరు మిగిలి ఉన్నారు. ఇరుగు పొరుగు భాషల నుంచి వచ్చే సినిమాల పోస్టర్లు, ప్రచార సామాగ్రిని కేవలం కన్నడలో మాత్రమే ప్రదర్శించాలని డిమాండ్ చేస్తున్న కన్నడిగ కార్యకర్తలు లాజిక్ లేకుండా మాట్లాడటం ఇటీవల చర్చగా మారింది.
బెంగళూరు సహా పలు నగరాలలో తెలుగు ప్రజల కోసం తెలుగు సినిమాలను విడుదల చేస్తుండగా, వాటికి సంబంధించిన పోస్టర్లు, ప్రచార సామాగ్రి కన్నడలో మాత్రమే ఉండాలని పట్టుబడట్టడం అవివేకం అన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒక తెలుగు సినిమాని తెలుగు వారి కోసం ప్రదర్శిస్తుండగా, కన్నడ భాషలో పోస్టర్ ఉండాలని స్థానికులు రభస చేయడం సరైనదేనా? కన్నడ పోస్టర్ చూసి తెలుగు సినిమా చూడటానికి ప్రజలు ఎలా థియేటర్లకు వెళ్లాలి?
అయితే ఇదే ప్రశ్న కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్రను ప్రశ్నిస్తే.. ఆయన లాజిక్ లేని సమాధానం ఆశ్చర్యపరిచింది. పొరుగు సినిమాల కన్నడ అనువాదాలను ప్రోత్సహించేందుకే స్థానిక ప్రజలు అలా కోరుకోవడంలో తప్పు లేదని అన్నారు. అందుకే పోస్టర్లు, ప్రచార సామాగ్రి కూడా కన్నడలో అచ్చు వేయాలని కోరుకుంటున్నారని వాదించారు.
అయితే కన్నడలో డబ్ చేయకుండా నేరుగా తెలుగు సినిమాలను విడుదల చేస్తున్నప్పుడు వాటి పోస్టర్లు, ప్రచార సామాగ్రిని కన్నడ భాషలో ప్రదర్శించడం సరైనదేనా? అది తెలుగు సినిమా అయినప్పుడు అలా ఎలా కుదురుతుంది. ఒకవేళ కన్నడలోకి డబ్ అయినప్పుడు పోస్టర్లు, ప్రచార సామాగ్రి కన్నడలోనే ఉండటం సబబు. పుష్ప, పుష్ప 2 చిత్రాలను కన్నడలో డబ్ చేసి రిలీజ్ చేసారు గనుక పోస్టర్లు ఇతర సామాగ్రిపై కన్నడ భాషనే ముద్రించారు. అలా కాకుండా తెలుగు సినిమాలను నేరుగా రిలీజ్ చేస్తున్నప్పుడు కన్నడ భాషా పోస్టర్లు కావాలని కోరడం సరైనదేనా? సీనియర్ నటుడు ఉపేంద్ర ఇప్పుడు ఇలా తమ ప్రజలను సమర్థించేందుకు మాట్లాడాల్సి వచ్చిందని సరిపెట్టుకోవాలి. అయినా భాషా అభిమానం కారణంగా, గేమ్ ఛేంజర్, హరి హర వీర మల్లు, ఓజీ చిత్రాలు భాషా వివాదంలో టార్గెట్ గా మారాయి. నష్టపోయాయి.
రామ్ పోతినేని నటించిన ఆంధ్రా కింగ్ తాలూకాలో ఉపేంద్ర కీలక పాత్రను పోషించారు. ఈ చిత్రం ఈ నెల 27న విడుదల కానుంది. ఇందులో ఒక సూపర్ స్టార్ గా తన రియల్ లైఫ్ పాత్రనే పోషిస్తుండగా, ఆయన అభిమానిగా రామ్ నటిస్తున్నారు. సినిమా ప్రచారంలో భాగంగా హైదరాబాద్ లో జరిగిన ఇంటర్వ్యూలో ఉపేంద్రకు కన్నడ భాషాభిమానంపై ప్రశ్నలు ఎదురయ్యాయి. ఆయన వాటికి అతుకుల బొంత సమాధానాలిచ్చారు. ఉపేంద్ర కన్నడ భాషా పరిరక్షక కార్యకర్తల డిమాండ్లను సమర్థించారు. ప్రతి ఒక్కరూ తమ సొంత భాషను ఇష్టపడతారు.. గౌరవిస్తారు కాబట్టి తెలుగులో కాకుండా కన్నడలో పోస్టర్లు, ఇతర ప్రచార సామగ్రి ఉండాలని పట్టుబట్టడంలో తప్పు లేదని ఉప్పీ అన్నారు. కర్ణాటకలోని ప్రజలు ఇతర భాషల సినిమాలను కన్నడలోకి డబ్ చేయాలని ఆశిస్తున్నారని, తద్వారా పొరుగు వారిని ప్రోత్సహిస్తున్నారని అన్నారు. అయితే ఉపేంద్రకు అసలు తెలుగు జర్నలిస్టు అడిగిన ప్రశ్న అర్థం కాలేదని అంతా భావిస్తున్నారు.