జురాసిక్ వరల్డ్ రీబర్త్ ట్రైలర్: సమ్మర్ స్పెషల్ ట్రీట్
ఫ్రాంఛైజీ గత చిత్రాల్ని మించి, చివరి సినిమా `జురాసిక్ వరల్డ్ డొమనియన్` కంటే డైనోసార్లు చాలా భయానకంగా, ప్రమాదకరంగా పరివర్తన చెంది కనిపిన్నాయి.;
`జురాసిక్ పార్క్` లేదా `జురాసిక్ వరల్డ్` సిరీస్ సినిమాలు వేసవి సెలవుల సమయంలో సందడి చేస్తూ పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా భారతదేశంలో అన్ని వర్గాల నుంచి గొప్ప ఆదరణ పొందాయి. ముఖ్యంగా డైనోసార్ ల కథలు ఫ్యామిలీ ఆడియెన్ ని థియేటర్లకు లాగగలవు. అందుకే ఇప్పుడు జురాసిక్ వరల్డ్ నుంచి కొత్త సినిమా వస్తోందని తెలియగానే ఉత్కంఠ పెరిగింది. తాజాగా జురాసిక్ వరల్డ్: రీబర్త్ రెండవ ట్రైలర్ విడుదలైంది. ఇది భూమ్మీద సముద్రంలో గాల్లో మూడు చోట్లా వెంటాడే డైనోసార్ ల కథతో రూపొందింది. ఫ్రాంఛైజీ గత చిత్రాల్ని మించి, చివరి సినిమా `జురాసిక్ వరల్డ్ డొమనియన్` కంటే డైనోసార్లు చాలా భయానకంగా, ప్రమాదకరంగా పరివర్తన చెంది కనిపిన్నాయి.
ఆసక్తికరంగా రీబర్త్ ట్రైలర్ ని చూడగానే పదేళ్ల క్రితం విడుదలైన `గాడ్జిల్లా(2014)తో పోలి కనిపించింది. సముద్రం నుంచి వచ్చి నగరంపై దాడులకు దిగే గాడ్జిల్లా భీభత్సాన్ని ప్రజలు ఇప్పటికీ మర్చిపోలేదు. ఇంచుమించు అదే తీరుగా ఇప్పుడు జురాసిక్ వరల్డ్ కొత్త కథ కూడా కనిపిస్తోంది. అయితే ఇది ఎత్తైన కొండలు, అరణ్యాల్లో సాగే కథాంశం. ఎత్తైన జీవులు, అందమైన ప్రకృతి, క్రూరమైన జీవరాశులను పరిచయం చేస్తూ, ఎగ్జయిట్ మెంట్ పెంచే సన్నివేశాలతో రక్తి కట్టించారు. దర్శకుడు గారెత్ ఎడ్వర్డ్స్ `గాడ్జిల్లా`తో పోలి ఉన్నా కానీ ఇక్కడ కొత్త విజువల్స్ కనిపిస్తున్నాయి. ఆ సినిమా నుంచి స్ఫూర్తి పొందినా, విజువల్ బ్రిలియన్సీని ఇక్కడ జోడించారు.
జురాసిక్ వరల్డ్: డొమినియన్ ఐదేళ్ల క్రితం విడుదలైంది. ఆ సినిమా తర్వాత భూమి, జీవావరణ శాస్త్రం డైనోసార్లకు ప్రతికూలంగా మారడాన్ని, మిగిలిన జాతులు వాటి చరిత్రపూర్వ గతం వంటి విషయాలను కొత్త సినిమాలో టచ్ చేసారు. ఈ చిత్రంలో స్కార్లెట్ జోరా బెన్నెట్ పాత్రను పోషించారు. భూమ్మీద మిగిలిన మూడు అతిపెద్ద డైనోసార్ జాతుల నుండి డిఎన్ఏను సంగ్రహించే మిషన్‌కు నాయకత్వం వహించే రహస్య ఆపరేషన్ నిపుణురాలిగా స్కార్లెట్ నటించారు. ఈ మిషన్‌లో ఆమెతో పాటు డంకన్ కిన్‌కైడ్ పాత్రలో మహర్షలా అలీ, పాలియోంటాలజిస్ట్ డాక్టర్ హెన్రీ లూమిస్‌గా జోనాథన్ బెయిలీ నటించారు. ఈ చిత్రంలో రూపర్ట్ ఫ్రెండ్ ఫార్మా ప్రతినిధిగా నటించగా.. ఫిలిప్పీన్ వెల్జ్, బెచిర్ సిల్వైన్, ఎడ్ స్క్రెయిన్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. జూలై 2న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది.