ట్రైలర్ తోనే వణుకు పుట్టిస్తున్న కేరళ స్టోరీ2
2023లో సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ సినిమా సక్సెస్ తర్వాత విపుల్ అమృత్‌లాల్ షా ఇప్పుడు ఆ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు.;
2023లో సంచలనం సృష్టించిన ది కేరళ స్టోరీ సినిమా సక్సెస్ తర్వాత విపుల్ అమృత్‌లాల్ షా ఇప్పుడు ఆ సీక్వెల్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సినిమాకు ది కేరళ స్టోరీ2 అనే టైటిల్ ను ఫిక్స్ చేయగా, తాజాగా సినిమాకు సంబంధించిన ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేయగా, అది చర్చనీయాంశంగా మారింది.
వచ్చే 25 ఏళ్లలో భారత్ సరియా చట్టాల ఆధారంగా నడిచే ఇస్లామిక్ ప్రాంతంగా మారే ప్రమాదం ఉందనే హెచ్చరికతో ట్రైలర్ ను మొదలుపెట్టగా, అనంతరం కథ రాజస్థాన్‌కు మలుపు తిరుగుతుంది. అక్కడ 16 ఏళ్ల బాలికను మతమార్పిడికి బలవంతం చేశారనే ఆరోపణలతో ఆమె కుటుంబం పోలీస్ స్టేషన్‌లో పోక్సో కేసు నమోదు చేయడానికి వచ్చిన సీన్స్ ను చూపించారు.
తర్వాత కథ మధ్యప్రదేశ్‌కు మారుతుంది. ఒక హిందూ యువతిని ప్రేమ పేరుతో మోసం చేసి వివాహం చేసుకున్న తర్వాత మత మార్పిడికి ఒత్తిడి తీసుకురావడాన్ని చూపించారు. మూడో కథ కేరళలో నడుస్తుంది. లివ్-ఇన్ రిలేషన్‌షిప్ పేరుతో ఒక యువతిని మతం మార్చుకునేలా ఒత్తిడి చేయడం, ఆమె నిరాకరించడంతో బలవంతంగా నిర్బంధించడం లాంటి సీన్స్ ను ట్రైలర్‌లో చూపించారు. మతమార్పిడి అనంతరం ఈ ముగ్గురు యువతులు ఎదుర్కొనే హింస, వారి కుటుంబాలు పడే వేదన కూడా ట్రైలర్‌లో స్పష్టంగా చూపించారు.
మేకర్స్ ఈ ట్రైలర్ ను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ, ఈ సారి మౌనం కాదు, పోరాటం, మా కూతుళ్లను టార్గెట్ గా చేసుకున్నారు. వారి ఫ్యూచర్‌ను దోచుకున్నారు. ఇక మేం మౌనంగా ఉండేది లేదంటూ పేర్కొన్నారు. కాగా ది కేరళ స్టోరీ2 సినిమా ఫిబ్రవరి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది. కామాఖ్య నారాయణ సింగ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఉల్కా గుప్తా, అదితి భాటియా, ఐశ్వర్య ఓజా ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాను సన్‌సైన్ పిక్చర్స్ బ్యానర్ పై విపుల్ అమృత్‌లాల్ షా నిర్మించగా, అశిన్ ఎ. షా కో ప్రొడ్యూసర్ గా వ్యవహరిస్తున్నారు. ట్రైలర్ తోనే ది కేరళ స్టోరీ2పై ఆడియన్స్ లో మంచి ఆసక్తి నెలకొనగా, ఈ ట్రైలర్ కు నెటిజన్ల నుంచి రకరకాల అభిప్రాయాలు వెలువడుతున్నాయి.