టాలీవుడ్‌పై బిర్లా గ్రూప్ వార‌సురాలు దండయాత్ర‌

క‌ళారంగంలోకి పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌వేశించ‌డం అనేది ఇప్పుడే కొత్త కాదు. ఇది అనాదిగా వ‌స్తున్న సాంప్ర‌దాయం.;

Update: 2026-02-17 13:30 GMT

క‌ళారంగంలోకి పారిశ్రామిక వేత్త‌లు ప్ర‌వేశించ‌డం అనేది ఇప్పుడే కొత్త కాదు. ఇది అనాదిగా వ‌స్తున్న సాంప్ర‌దాయం. అయితే ఈ రంగంలో స‌క్సెస్ కేవ‌లం 5-10 శాతం మాత్ర‌మే ఉంటుంద‌న్న‌ది వ్యాపార‌వేత్త‌ల స‌ర్వే. దాని ప్ర‌కారం చాలా మంది త‌మ పెట్టుబ‌డుల‌ను ర‌క‌ర‌కాల కోణాల్లో ప్ర‌యోగాత్మ‌కంగా ఇన్వెస్ట్ చేసేందుకే ఈ రంగంలోకి వ‌స్తుంటారనేది నిర్వివాదాంశం. రిల‌య‌న్సె ఎంట‌ర్ టైన్ మెంట్స్, ఈరోస్ ఇంట‌ర్నేష‌న‌ల్, స‌న్ నెట్ వ‌ర్క్ వంటి కార్పొరెట్ దిగ్గ‌జాలు సినిమాల నిర్మాణాన్ని ఫ్యాష‌న్ గా భావించి ఈ రంగంలో ప్ర‌వేశించాయి. కానీ లాభాల కంటే న‌ష్టాల‌నే ఎక్కువ‌గా మూట‌గ‌ట్టుకున్నాయి.

అయితే ఇటీవ‌లి కాలంలో ఎంట‌ర్ టైన్ మెంట్ రంగంలో అపార అవ‌కాశాల‌ను, అభివృద్ధిని కార్పొరెట్ నిశితంగా గ‌మ‌నిస్తోంది. వినోద రంగంలో దిగ్గ‌జ సంస్థ‌లు పారామౌంట్ పిక్చ‌ర్స్, డిసి, డిస్నీ వంటి సంస్థ‌లు సాధిస్తున్న అఖండ విజ‌యాల‌ను దృష్టిలో పెట్టుకుని ఈ క‌ళారంగంలో సృజ‌నాత్మ‌క ప్ర‌పంచంలో రాణించాల‌ని త‌ప‌న ప‌డే పారిశ్రామిక దిగ్గ‌జాల సంఖ్య పెరుగుతోంది. ఇప్పుడు ప్ర‌ఖ్యాత బిర్లా గ్రూప్స్ కూడా సినిమా రంగంలోకి అడుగుపెడుతుండ‌టం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. పాపుల‌ర్ పారిశ్రామిక వేత్త‌ల కుటుంబం నుంచి మూడో త‌రం అమ్మాయి అన‌న్య బిర్లా వినోద‌రంగంలో రాణించేందుకు చాలా పెద్ద ప్ర‌య‌త్నాల్లో ఉన్నారు. ఇండియన్ ప్రో మ్యూజిక్ లీగ్ (IPML)లో బెంగాల్ టైగర్స్ అనే టీమ్‌కు యజమానిగా ఉన్న బిర్లా బ్యూటీ ఇటీవ‌ల టీవీక్ష‌కుల‌ను విప‌రీతంగా ఆక‌ర్షించారు. అయితే ఇది క్రికెట్ లీగ్ కాదు.. ఒక మ్యూజిక్ రియాలిటీ షో లీగ్ అనేది తెలిసిందే.

ప్రముఖ వ్యాపారవేత్త, గాయని అనన్య బిర్లా చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగుపెడుతూ `బిర్లా స్టూడియోస్` పేరుతో కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను ప్రారంభించారు. ఈ సంస్థ కమర్షియల్ సినిమాలు, కొత్తదనంతో కూడిన ప్ర‌యోగాత్మ‌క‌ చిత్రాలపైనా దృష్టి సారించనుంది.

తాజా స‌మాచారం మేర‌కు.. బిర్లా స్టూడియోస్ తమ తొలి ప్రాజెక్టుల కోసం బాలీవుడ్ దిగ్గజ దర్శకులతో చర్చలు జరుపుతోంది. కమర్షియల్ కామెడీ చిత్రాల స్పెష‌లిస్ట్ అనీస్ బ‌జ్మి, పింక్, సర్దార్ ఉదమ్ వంటి కంటెంట్ ఓరియెంటెడ్ చిత్రాల దర్శకుడు షూజిత్ సిర్కార్, ప్ర‌యోగాత్మ‌క చిత్రాలు ఏ వెడ్నెస్ డే, స్పెష‌ల్ చ‌బ్బీస్ లాంటి ప్ర‌యోగాత్మ‌క చిత్రాల‌కు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన‌ నీరజ్ పాండే తో బిర్లా స్టూడియోస్ చర్చ‌లు జ‌రుపుతోంది. వీరితో చర్చలు సఫలమైతే త్వరలోనే అధికారికంగా ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంద‌ని కూడా తెలుస్తోంది.

బిర్లా స్టూడియోస్ కేవలం హిందీకే పరిమితం కాకుండా ప్రాంతీయ‌ భాషల్లో సినిమాలు నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ముఖ్యంగా టాలీవుడ్ లో అడుగుపెట్టేందుకు స‌మగ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందిస్తున్నార‌ని తెలిసింది. అలాగే మ‌ల‌యాళం, గుజ‌రాతీలోను సినిమాలు నిర్మించేందుకు మొద‌టి ద‌శ‌లో ప్లాన్ చేస్తోంది. ఆంగ్లంలోను అంత‌ర్జాతీయ కాన్సెప్టులతో సినిమాలు తీయ‌నున్నారు. భారతీయ సినిమాను ప్రపంచ స్థాయికి తీసుకెళ్లడం, కొత్త ప్రతిభను ప్రోత్సహించడం బిర్లా గ్రూప్ ల‌క్ష్యం.

అయితే ప్ర‌స్తుతం షూజిత్ సిర్కార్ త‌న త‌దుప‌రి చిత్రం హైథో హార‌ర్ ప‌నిలో బిజీగా ఉన్నారు. నీర‌జ్ పాండే ఘోస్ ఖోర్ పండిట్ అనే సినిమా చేస్తుఉన్నారు. అనీస్ బ‌జ్మీ అక్ష‌య్- విద్యాబాల‌న్ తో త‌దుపరి సినిమా చేస్తున్నారు. వీరంద‌రితో బిర్లా స్టూడియోస్ సినిమాల‌కు ప్ర‌ణాళిక‌ల్ని సిద్ధం చేస్తోంది.

ఆదిత్య బిర్లా గ్రూప్ మొత్తం విలువ:

బిర్లా గ్రూప్ మొత్తం టర్నోవర్ సుమారు 67 బిలియన్ డాల‌ర్లు. భారతీయ కరెన్సీలో ఇది దాదాపు రూ.5,60,000 కోట్ల నుండి రూ.6,00,000 కోట్లు మ‌ధ్య ఉంటుంది. మార్కెట్ క్యాపిటలైజేషన్ పరిశీలిస్తే.. ఈ గ్రూప్‌కు చెందిన అన్ని లిస్టెడ్ కంపెనీల మొత్తం మార్కెట్ విలువ సుమారు 117 బిలియన్ డాల‌ర్లు. దాదాపు రూ.10,00,000 కోట్లు దాటింది. కేవ‌లం కుమార్ మంగ‌ళం బిర్లా నిక‌ర ఆస్తి విలువ 2,00,000 కోట్లు.

ఇంత పెద్ద సంస్థ సినిమా-వినోద రంగంలోకి ప్ర‌వేశించ‌డంతో ఈ రంగంలో ఉపాధి మ‌రింత విస్త్ర‌తంగా పెరుగుతుంద‌న‌డంలో సందేహం లేదు. రిల‌య‌న్స్ ఎంట‌ర్ టైన్ మెంట్స్ ని మించి ఈ దిగ్గ‌జ సంస్థ ఎద‌గాల‌ని ఆకాంక్షిద్దాం.

Tags:    

Similar News