జియో పాలిటిక్స్ కింగ్ నరేంద్ర మోదీ జీవితంపై షాకింగ్ బడ్జెట్
ఈ బయోపిక్ కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాకుండా.. నరేంద్ర మోదీకి తన తల్లి హీరాబెన్ తో ఉన్న అనుబంధాన్ని ప్రధానంగా చూపించబోతున్నారు.;
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జీవితంపై ఇప్పటికే చాలా బయోపిక్ లు విడుదలయ్యాయి. వివేక్ ఒబెరాయ్ లాంటి స్టార్ తో భారతదేశంలోని అన్ని భాషల్లో మోదీ బయోపిక్ రూపొంది విడుదలైంది. అయితే ప్రపంచాన్ని శాసించే జియో పాలిటిక్స్ లో అగ్ర రాజ్యాలు అమెరికా, రష్యాలకు ధీటుగా నిలబడే సత్తాను భారతదేశానికి ఇచ్చిన నాయకుడిగా, ప్రధాని నరేంద్ర మోదీని ప్రపంచం చూస్తోంది. ఇలాంటి సమయంలో మరోసారి బయోపిక్ మోదీ జీవితంపై తెరకెక్కనుంది. `మా వందే` అనేది టైటిల్. దీనిని దాదాపు 400కోట్ల బడ్జెట్ తో అత్యంత భారీగా రూపొందిస్తున్నారని కథనాలొస్తున్నాయి. అయితే బడ్జెట్ విషయంలో చిత్రబృందం నుంచి ఎలాంటి స్పష్ఠత లేదు కానీ, ఈ సినిమా కోసం ఎంపిక చేసుకుంటున్న కాస్టింగ్ చాలా ఆసక్తిని రేకెత్తిస్తోంది.
ఈ బయోపిక్ కేవలం రాజకీయాల గురించి మాత్రమే కాకుండా.. నరేంద్ర మోదీకి తన తల్లి హీరాబెన్ తో ఉన్న అనుబంధాన్ని ప్రధానంగా చూపించబోతున్నారు. `ది యాంథమ్ ఆఫ్ ఏ మదర్` అనే ట్యాగ్‌లైన్ ని ఇవ్వడంతో మదర్ సెంటిమెంట్ విలువల గురించి ఈ సినిమాలో హైలైట్ చేస్తున్నారని అర్థం చేసుకోవచ్చు. అయితే ఒక నాయకుడిపై ఉండే ఒత్తిడి, సీరియస్ రాజకీయ కోణాలను వెలికి తీస్తూనే, మదర్ సెంటిమెంట్ ని వర్కవుట్ చేస్తారని అంచనా వేస్తున్నారు. ఈ సినిమాను ప్యాన్-ఇండియా స్థాయిలో అన్ని ప్రధాన భారతీయ భాషలతో పాటు ఇంగ్లీష్ లో కూడా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు. గతంలో వివేక్ ఒబెరాయ్ నటించిన బయోపిక్ కంటే ఇది మరింత భారీగా ఉండబోతోంది.
ఈ సినిమాలో నరేంద్ర మోదీ పాత్రను మలయాళ స్టార్ హీరో ఉన్ని ముకుందన్ నటిస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం.. హాలీవుడ్ యాక్షన్ స్టార్ జాసన్ మోమోవా (ఆక్వామన్ ఫేమ్) ను ఈ సినిమాలో ఒక కీలక పాత్ర కోసం సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఇది ఖరారైతే ఒక భారతీయ బయోపిక్‌లో అంతర్జాతీయ నటుడు నటించడం పెద్ద విశేషమే అవుతుంది.
ఇందులో సీనియర్ తారాగణం రవీనా టాండన్, జగపతి బాబు, శరత్ కుమార్ తదితరులు కూడా ఈ సినిమాలో నటిస్తున్నారు. దీనిని సుమారు రూ.400 కోట్ల భారీ బడ్జెట్‌తో అత్యున్నత ప్రమాణాలతో నిర్మించడం వెనక ఉన్న లాజిక్ అర్థం కాకపోయినా కానీ, ఇది సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. ప్రపంచ రాజకీయాలలో కీలక భూమిక పోషిస్తున్న నరేంద్ర మోదీ భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలకు కారకులు కాబోతున్నారో ఈ బయోపిక్ లో చూపిస్తారా? లేక నరేంద్ర మోదీ చిన్నప్పటి నుంచి నేటి రాజకీయ జీవితం వరకూ రొటీన్ కథనే తెరపై చూపిస్తారా? అలా కాకుండా కేవలం తల్లి సెంటిమెంట్‌పై ఫోకస్ చేస్తారా? అన్నది ఇంకా తేలాల్సి ఉంది. ఏది ఏమైనా ఎంపిక చేసుకుంటున్న కాస్టింగ్ ని బట్టి నరేంద్ర మోదీని అత్యంత పవర్‌ఫుల్ ప్రాధానమంత్రిగా ప్రపంచానికి ఆవిష్కరిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు.
ప్రస్తుతం ఇండియన్ సినిమాలోని దిగ్గజ టెక్నీషియన్లు ఈ బయోపిక్ కోసం పనిచేస్తున్నారు. బాహుబలి, ఆర్.ఆర్.ఆర్ చిత్రాలకు పని చేసిన కె.కె. సెంథిల్ కుమార్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా, కేజీఎఫ్ ఫేం రవి బస్రూర్ రీరికార్డింగ్ అందించనున్నారు. సాబు సిరిల్ ప్రొడక్షన్ డిజైనర్. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ వర్క్ అందిస్తారు. సాంకేతిక నిపుణులంతా జాతీయ అవార్డ్ గ్రహీతలు కావడంతో ఈ సినిమాని టెక్నికల్ గా ఒక మహదాద్భుతంగా ఆవిష్కరించే ప్లాన్ తో ఉన్నారని అర్థమవుతోంది. అయితే ఉన్నిముకుందన్ లాంటి ఒక అప్ కమ్ స్టార్ పై 400 కోట్ల బడ్జెట్ ని వెచ్చించడంలో లాజిక్ మిస్ అవుతోందని కొందరు కామెంట్ చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రాంతి కుమార్ సిహెచ్ దర్శకత్వం వహిస్తున్నారు.