జాన్వీని ఇకపై విమర్శించరు... మొత్తం మారుతుంది!
తాజాగా జాన్వీ కపూర్ 'హోమ్ బౌండ్' సినిమాలో నటించింది. ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది;
అతిలోక సుందరి శ్రీదేవి నట వారసురాలిగా జాన్వీ కపూర్ బాలీవుడ్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా కాలం అయినా హిందీలో సరైన హిట్ పడలేదు. తెలుగులో దేవర సినిమాతో ఎంట్రీ ఇచ్చి పర్వాలేదు అనిపించుకుంది. అయితే జాన్వీ కపూర్ కేవలం వారసత్వం వల్ల, అందాల ఆరబోత వల్ల మాత్రమే కెరీర్‌లో కొనసాగుతుందని, నటన ప్రతిభ చూపించడంలో జాన్వీ కపూర్ ప్రతి సినిమాతోనూ విఫలం అయిందని విమర్శిస్తున్న వారు చాలా మంది ఉన్నారు. జాన్వీ కపూర్ నటన విషయంలో కెరీర్ ఆరంభం నుంచి విమర్శలు ఎదుర్కొంటుంది. కేవలం గ్లామర్ షో కారణంగా ఆఫర్లు సొంతం చేసుకుంటుంది అంటూ విమర్శిస్తూ వస్తున్నారు.
తాజాగా జాన్వీ కపూర్ 'హోమ్ బౌండ్' సినిమాలో నటించింది. ఇషాన్ ఖట్టర్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటించింది. వీరిద్దరు గతంలో ధడక్ సినిమాలో నటించాడు. ఆ సినిమా కమర్షియల్‌గా నిరాశ పరచినా కూడా ఇద్దరికీ మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత వీరి కాంబోలో సినిమా అనగానే అంచనాలు, ఆసక్తి పెరిగింది. అంచనాలు, ఆసక్తికి తగ్గట్లుగానే సినిమా ఉంటుందని మేకర్స్ మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. తాజాగా ఈ సినిమా కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శించగా స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. విమర్శకుల ప్రశంసలు దక్కించుకున్న ఈ సినిమా కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవడం ఖాయం అనే నమ్మకంతో మేకర్స్ ఉన్నారు.
సినిమా ప్రమోషన్‌లో భాగంగా దర్శకుడు నీరజ్ మాట్లాడుతూ... ఇప్పటి వరకు జాన్వీ కపూర్ ఎన్నో విమర్శలు ఎదుర్కొంది. అయితే ఈ సినిమా విడుదల అయ్యాక ఆమెను విమర్శించిన వారే ప్రశంసిస్తారు. సినిమా కోసం జాన్వీ కపూర్ పడ్డ కష్టం అంతా ఇంతా కాదు. ఆమె నటనను ఉద్దేశించి గతంలో విమర్శించిన వారు ఈ సినిమాను చూసిన తర్వాత కచ్చితంగా షాక్ అవుతారు. ఆమెలోని నిజమైన నటిని ఈ సినిమాతో గుర్తిస్తారు. ఈ సినిమాతో ఆమె సామర్థ్యం సైతం బయట పడుతుంది. హోమ్ బౌండ్ కథ చెప్పిన వెంటనే జాన్వీ కపూర్ చేసేందుకు ఒప్పుకుంది. ఒక సీరియస్ స్టోరీని ఆమె చేసేందుకు ఒప్పుకోవడంతోనే ఛాలెంజ్‌ను స్వీకరించినట్లు అయిందని అన్నాడు.
ఒక మారుమూల ప్రాంతానికి చెందిన కథ ఇది. ఆ ప్రాంతంకు చెందిన ఇద్దరు స్నేహితులు గుర్తింపు, గౌరవం దక్కించుకోవడం కోసం పోలీసు ఉద్యోగాన్ని సంపాదించాలని నిర్ణయించుకుంటారు. అందుకోసం వారు ఏం చేస్తారు, ఆ క్రమంలో ఇద్దరు ఎదుర్కొన్న మానసిక, శారీరక సంఘర్షణ ఏంటి అనేది ఈ సినిమాలో చూపించారు. జాన్వీ కపూర్‌తో పాటు ఇషాన్ ఖట్టర్ సైతం అద్భుతమైన ఎమోషన్స్‌ను కనబర్చి ప్రేక్షకులను సర్‌ప్రైజ్ చేయబోతున్నట్లు మేకర్స్ చెబుతున్నారు. ఈ సినిమా అంతర్జాతీయ స్థాయి ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శనకు అవకాశం దక్కించుకోవడంతో కమర్షియల్‌గానూ మంచి విజయాన్ని సొంతం చేసుకోవచ్చు అనే నమ్మకం వ్యక్తం అవుతోంది.