చిరంజీవి - బాలకృష్ణ ఎపిసోడ్ పై జగన్ ఘాటు వ్యాఖ్యలు!
అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై తాజాగా ఓ రిపోర్టర్ కోరగా స్పందించిన జగన్... 'అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి?.;
వైసీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గురువారం తాడేపల్లిలో మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా పలు కీలక విషయాలను ఆయన ప్రస్థావించారు. ఇందులో భాగంగా... నకిలీ మద్యం, విశాఖ డాటా సెంటర్, ఉద్యోగుల విషయంలో ప్రభుత్వ వైఖరితో పాటు ఇటీవల సంచలనంగా మారిన చిరంజీవి - బాలకృష్ణ వ్యవహారంపైనా స్పందించారు.
అవును... ఇటీవల ఏపీ అసెంబ్లీలోనూ, ఇటు బయటా తీవ్ర చర్చనీయాంశంగా మారిన చిరంజీవి - బాలకృష్ణ వ్యవహారంపై మాజీ సీఎం జగన్ స్పందించారు. ఇందులో భాగంగా... అసలు అసెంబ్లీలో పనీ పాటా లేని సంభాషణ చేశారని.. తాగి వచ్చిన బాలకృష్ణను అసెంబ్లీలోకి ఎలా అనుమతిచ్చారంటూ ఘాటైన వ్యాఖ్యలు చేశారు జగన్.
వివరాళ్లోకి వెళ్తే... వైసీపీ ప్రభుత్వంలో సినిమా వాళ్లను పిలిచి మరీ అవమానించారంటూ ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఇటీవల చర్చ జరిగిన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా... బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఈ అంశం మొదలుపెట్టగా.. ఆ వెంటనే హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ దానిని కొనసాగించారు.
ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి టాపిక్ వచ్చింది. ఈ వ్యవహారం అటు సినిమా ఇండస్ట్రీలోనూ, ఇటు రాజకీయాల్లోనూ తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యాఖ్యలపై స్పందించిన చిరంజీవి విదేశాల్లో ఉండి కూడా.. నాటి సంఘటనపై వివరణ ఇస్తూ లేఖ విడుదల చేశారు. ఆ లేఖపై వైసీపీ నుంచి హర్షం వ్యక్తం అయ్యింది.
స్పందించిన వైఎస్ జగన్!:
అసెంబ్లీలో బాలకృష్ణ కామెంట్లు.. పవన్ కల్యాణ్ మౌనంపై తాజాగా ఓ రిపోర్టర్ కోరగా స్పందించిన జగన్... 'అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి?.. ఆయన మాట్లాడింది ఏంటి?.. పనిపాట లేని సంభాషణ చేశారు. బాలకృష్ణ అసెంబ్లీలో తాగి మాట్లాడారు. తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీలోకి ఎలా అనుతించారు?' అంటూ జగన్ వరుస ప్రశ్నలు సంధించారు.
అనంతరం... 'అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్ కు బుద్ది లేదు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోంది. అలా మాట్లాడినందుకు సైకలాజికల్ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి' అని జగన్ అన్నారు. దీంతో.. ఇప్పుడు బాలయ్యపై జగన్ చేసిన వ్యాఖ్యలు మరింత హాట్ టాపిక్ గా మారుతున్నాయి!
బాలకృష్ణ ఏమన్నారు?:
వైఎస్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు చిరంజీవిని అవమానించారని, ఆయన్ను కలవడానికి వెళితే కలవకుండా సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారని కామినేని శ్రీనివాస్ చెప్పారు. దీనిపై జోక్యం చేసుకున్న బాలకృష్ణ.. కామినేని శ్రీనివాస్ చెప్పినదంతా అబద్ధమని కొట్టిపడేశారు. చిరంజీవి గట్టిగా అడిగితే సీఎం వచ్చాడనేది అబద్ధమని, అక్కడ గట్టిగా ఎవడూ అడగలేదని బాలకృష్ణ అన్నారు.
గట్టిగా అడిగితేనే ఆయన కలవడానికి వచ్చాడని, లేకపోతే సినిమాటోగ్రఫీ మంత్రిని కలవమన్నారనేది అసత్యమని, ఆయన గట్టిగా చెబితే దిగొచ్చాడంట.. అని వ్యంగ్యంగా అన్నారు. ఈ సందర్భంగా... గట్టిగా అడిగారా.. ఎవడు అడిగాడు గట్టిగా.. అడిగితే వచ్చాడా వీడు కలవడానికి.. అంటూ బాలకృష్ణ వ్యాఖ్యలు చేశారు.
స్పందించిన చిరంజీవి!:
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలపై చిరంజీవి స్పందించారు. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ని కలవడానికి దారితీసిన నిజమైన పరిణామాలను వివరిస్తూ, విదేశాల నుండి ఒక ప్రెస్ నోట్ విడుదల చేశారు. చిరంజీవి తన చొరవ వల్లే ప్రభుత్వం టికెట్ ధరల పెంపునకు ఆమోదం తెలిపిందని ఆయన హైలైట్ చేశారు.
ఈ నిర్ణయం నిర్మాతలు, పంపిణీదారులు, ప్రదర్శనకారులకు ప్రయోజనాలను చేకూర్చిందని.. తన సొంత సినిమా వాల్తేరు వీరయ్య, వీరసింహారెడ్డి వంటి ప్రధాన విడుదలలకు మెరుగైన కలెక్షన్లను సాధించడంలో కీలక పాత్ర పోషించిందని ఆయన స్పష్టం చేశారు!