మనీలాండరింగ్ కేసు.. జాక్వెలిన్ సంచలన నిర్ణయం..
బాలీవుడ్ లో సంచలనం రేపిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది.;
బాలీవుడ్ లో సంచలనం రేపిన రూ.200 కోట్ల మనీలాండరింగ్ కేసులో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఆ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. తాను అప్రూవర్ గా మారేందుకు సిద్ధమని చెబుతూ ఢిల్లీ కోర్టును తాజాగా ఆశ్రయించారు. దీంతో ఆ పరిణామం కేసు విచారణలో మరింత కీలక మలుపుగా మారనుండగా.. ప్రస్తుతం ఆ విషయం చర్చనీయాంశంగా మారింది.
ఆ కేసుకు సంబంధించిన ప్రధాన నిందితుడు సుకేశ్ చంద్రశేఖర్ ప్రస్తుతం జైలులో ఉన్నారు. ఆయనపై భారీ స్థాయిలో మోసాలు, మనీలాండరింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో తనపై ఉన్న ఆరోపణల నుంచి బయటపడేందుకు.. దర్యాప్తునకు సహకరించేందుకు జాక్వెలిన్ అప్రూవర్ గా మారాలని నిర్ణయించుకోవడం గమనార్హం. అయితే జాక్వెలిన్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ చేపట్టిన ఢిల్లీ కోర్టు, నిబంధనల ప్రకారం ముందుగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ED)ను సంప్రదించాలని సూచించింది.
ఆమె తన అభ్యర్థనను అధికారికంగా ఈడీ ముందు ఉంచాలి. అనంతరం ఈడీ అధికారులు ఆమె వాంగ్మూలాన్ని నమోదు చేస్తారు. ఆ వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత, ఆమెను అప్రూవర్ గా మార్చాలా వద్దా అన్న దానిపై నిర్ణయం తీసుకుని కోర్టులో నివేదిక సమర్పిస్తారు. ఇదిలా ఉండగా ఆ కేసులో తనపై నమోదైన క్రిమినల్ విచారణ రద్దు చేయాలంటూ జాక్వెలిన్ గతంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
అయితే ఆమె పిటిషన్ ను అప్పట్లో సుప్రీంకోర్టు తిరస్కరించింది. ఈ నేపథ్యంలోనే ఆమె అప్రూవర్ గా మారే దిశగా అడుగులు వేయడం ప్రాధాన్యం సంతరించుకుంది. కేసు వివరాల ప్రకారం.. సుకేశ్ చంద్రశేఖర్ తనను ఒక పెద్ద వ్యాపారవేత్తగా, ప్రభావవంతుడిగా పరిచయం చేసుకుని పలువురిని మోసం చేశారని ఆరోపణలు ఉన్నాయి. ముఖ్యంగా, ప్రముఖ వ్యాపారవేత్త కుటుంబానికి చెందిన వ్యక్తికి బెయిల్ ఇప్పిస్తానని నమ్మించి, ఆయన భార్య నుంచి సుమారు రూ.215 కోట్లు వసూలు చేసినట్లు దర్యాప్తులో బయటపడింది.
ఆ వ్యవహారం వెలుగులోకి రావడంతో దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇక జాక్వెలిన్‌తో తనకు సన్నిహిత సంబంధం ఉందని సుకేశ్ పదేపదే చెబుతూ వస్తున్నారు. జైలు నుంచి ఆమెకు ప్రేమ లేఖలు రాయడం కూడా వార్తల్లో నిలిచింది. వీరిద్దరి మధ్య సన్నిహిత సంబంధాన్ని సూచించే ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఆ ఆరోపణలను జాక్వెలిన్ ఖండించారు. తాను సుకేశ్ చేతిలో మోసపోయానని, అతను తనను ఒక వ్యాపారవేత్తగా నమ్మించి దగ్గరయ్యారని కోర్టులో వాదించారు.
ప్రస్తుతం ఆ కేసు విచారణ కీలక దశలో ఉంది. జాక్వెలిన్ అప్రూవర్ గా మారితే, కేసులో మరిన్ని కీలక విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యంగా సుకేశ్ చంద్రశేఖర్ నిర్వహించిన మోసాల వెనుక ఉన్న నెట్ వర్క్, డబ్బు లావాదేవీలకు సంబంధించిన మరిన్ని వివరాలు బయటపడే అవకాశం ఉంది. ఇకపై ఈడీ చర్యలు, కోర్టు నిర్ణయాలు.. ఆ కేసు భవిష్యత్తును నిర్ణయించనున్నాయి. మరేం జరుగుతుందో అంతా వేచి చూడాలి.