దేవర-ఇండియన్-2.. తేడా క్లియర్

ఐతే జూనియర్ ఎన్టీఆర్ మూవీ 'దేవర'తో తెలుగులో అనిరుధ్ మార్కు ఏంటో చూస్తామని చాలామంది ఆశతో ఉన్నారు.

Update: 2024-05-23 23:30 GMT

తమిళంలో ఇప్పుడు అనిరుధ్ రవిచందర్‌ను కొట్టే సంగీత దర్శకుడు లేడు. 17 ఏళ్ల వయసులోనే ‘3’ సినిమాలో కొలవరి పాటతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సంగీత సంచలనం.. ఆ తర్వాత ఎన్నో బ్లాక్‌బస్టర్ ఆడియోలు ఇచ్చాడు. టాప్ హీరోలు చాలామందితో పని చేశాడు. తమిళంలో అతడి పాటలు, బ్యాగ్రౌండ్ స్కోర్లకు మన వాళ్లు కూడా ఊగిపోతుంటారు.

తెలుగులో టాప్ హీరోల సినిమాలకు కూడా అనిరుధ్ పని చేయాలని.. ఇదే రేంజిలో మ్యూజిక్‌తో ఉర్రూతలూగించాలని కోరుకుంటారు. కానీ అనిరుధ్ తెలుగులో ఇప్పటిదాకా పేలిపోయే ఆడియోలు అయితే ఇవ్వలేదు. తొలి చిత్రం ‘అజ్ఞాతవాసి’ నుంచి నిరాశపరుస్తూనే ఉన్నాడు. నానితో చేసిన గ్యాంగ్ లీడర్, జెర్సీ సినిమాలకు మంచి మ్యూజిక్కే ఇచ్చినా తమిళంలో అతను చేసిన సినిమాల రేంజ్ మాత్రం కనిపించలేదు.

ఐతే జూనియర్ ఎన్టీఆర్ మూవీ ‘దేవర’తో తెలుగులో అనిరుధ్ మార్కు ఏంటో చూస్తామని చాలామంది ఆశతో ఉన్నారు. కానీ ఈ సినిమా టీజర్లో, ఇటీవలే రిలీజ్ చేసిన ‘ఫియర్ సాంగ్’లో అనిరుధ్ మ్యాజిక్ అనుకున్న స్థాయిలో కనిపించలేదు. టీజర్ స్కోర్, ఫియర్ పాట బాలేదని అనలేం. కానీ ఆ మ్యూజిక్ ఎక్కడో ఉన్నట్లే అనిపించింది. ముఖ్యంగా ఫియర్ సాంగ్‌ వింటున్నపుడు అతను చేసిన ‘హుకుమ్’ సహా వేరే పాటల ఛాయలు కనిపించాయి.

పాటలో మంచి ఊపు ఉన్నా కొత్తదనం కరవైంది. దీని మీద చాలా కంప్లైంట్స్ వచ్చాయి. కాగా ఆ పాట రిలీజైన కొన్ని రోజులకే ఇప్పుడు అనిరుధ్ సంగీతం అందించిన తమిళ చిత్రం ‘ఇండియన్-2’ నుంచి సౌరా అనే పాట రిలీజైంది. అది వింటే వేరే లెవెల్ అనిపిస్తోంది. మామూలుగా శంకర్ సినిమాలకు రెహమాన్ అందించే రేంజిలో క్వాలిటీ కనిపించింది. ఈ పాటలో ఉన్న ఒరిజినాలిటీ ‘దేవర’ పాటలో మిస్ అయిందన్నది స్పష్టం. దీన్ని బట్టి చూస్తే తెలుగు దర్శకులు అనిరుధ్ నుంచి సరైన ఔట్ పుట్ రాబట్టుకోవడంలో ఫెయిలవుతున్నారని అయినా అనుకోవాలి.. లేదా అతనే తెలుగు చిత్రాలకు మొక్కుబడిగా పాటలు చేస్తున్నాడని అయినా భావించాలి.

Tags:    

Similar News