ఆ ఇద్దరి కోసం 300 కోట్ల క్లబ్ వెయిటింగ్!
పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ అయిందంటే? 1000 కోట్లపైనే వసూళ్లు సాధించాలి.;
పాన్ ఇండియాలో సినిమా రిలీజ్ అయిందంటే? 1000 కోట్లపైనే వసూళ్లు సాధించాలి. లేదంటే ఆ సినిమాకు పాన్ ఇండియా ట్యాగ్ ఇవ్వడం అసాధ్యం. ఏ పరిశ్రమ నుంచి పాన్ ఇండియా సినిమా రిలీజ్ అయినా 1000 కోట్ల క్లబ్ అన్నది తప్పనిసరిగా మారింది. తెలుగు సినిమా ఇప్పటికే అలాంటి రికార్డులు ఎప్పుడో చేధించేసింది. తదుపరి 2000 కోట్ల క్లబ్ అంతకు మించే టాలీవుడ్ టార్గెట్. మరి రీజనల్ గా తెలుగు సినిమా టార్గెట్ ఎంత అంటే? సరైన ఫిక్స్ డు టార్గెట్ లేదనే చెప్పాలి. ఒక్క రీజనల్ మార్కెట్ నుంచే 500 కోట్లు సాధించడం అంటే అంత సులభం కాదు.
ఎందు కంటే ఆ రేంజ్ లో థియేటర్ సిస్టమ్ రీజనల్ మార్కెట్ లో అందుబాటులో లేదు. ఎంత గొప్ప సినిమా తీసినా వారం లోనే ఎలాంటి టార్గెట్ అయినా రీచ్ అవ్వాల్సిన రోజులివి. భారీ ఎత్తున రిలీజ్ అయి బ్లాక్ బస్టర్ టాక్ వస్తే తప్ప 500 కోట్లు రీచ్ అవ్వడం కష్టం. కానీ ఉన్నంతలో రీజనల్ మార్కెట్ లో సత్తా చాటిన హీరోలు మాత్రం ఇద్దరు సీనియర్లగా చెప్పొచ్చు వారే. విక్టరీ వెంకటేష్..మెగాస్టార్ చిరంజీవి. వెంకటేష్ హీరోగా నటించిన `సంక్రాంతి వస్తున్నాం` బాక్సాఫీస్ వద్ద లాంగ్ రన్ లో 310-330 కోట్ల మధ్యలో వసూళ్లను సాధించింది.
సీనియర్ హీరోల్లో తొలిసారి 300 కోట్ల క్లబ్లో చేరింది వెంకటేష్ కావడం విశేషం. ఇప్పుడా రికార్డును మెగాస్టార్ చిరంజీవి `మన శంకర వరప్రసాద్ గారు`తో బ్రేక్ చేసారు. సంక్రాంతి కానుకగా భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన సినిమా 375-400 కోట్ల మధ్యలో వసూళ్లను సాధించింది. దీంతో రీజనల్ మార్కెట్ లో మెగాస్టార్ పేరిట బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డుగా నమోదైంది. ఇందులో వెంకటేష్ కు భాగస్వామ్యం ఉంది. సినిమాలో వెంకటేష్ ఓ గెస్ట్ రోల్ పోషించారు. వసూళ్ల పరంగా ఆయన ఇమేజ్ ఎంతో కీలకంగా మారింది. ఆ రకంగా `ఎమ్ ఎస్ జీ` క్రెడిట్ లో వెంకటేష్ కూడా భాగస్వాములే.
ఇక రీజనల్ మార్కెట్ లో 300 కోట్ల క్లబ్ లో చేరాల్సిన సీనియర్లు ఇద్దరు మిగిలారు. వారే నటసింహ బాలకృష్ణ, కింగ్ నాగార్జున. ఇటీవలే బాలయ్య `అఖండ 2` తో పాన్ ఇండియాలోనూ లాంచ్ అయ్యారు. కానీ ఆ సినిమా అంచనాలు అందుకోలేదు. బాక్సాఫీస్ వద్ద 160 కోట్లతో ముగించింది. ఇది పాన్ ఇండియా రిలీజ్ కాబట్టి రీజనల్ మార్కెట్ తో సంబంధం లేని చిత్రమే. ఆ రకంగా చూస్తే బాలయ్య-నాగార్జున ఒకే పోజిషన్ లో ఉన్నట్లు. కాకపోతే బాలయ్య ఇప్పటికే 100 కోట్ల క్లబ్లో చేరారు. నాగ్ మాత్రం ఇంకా ఆఫీట్ ను సాధించలేదు. ఇద్దరి ముందు కామన్ గా ఉన్న బాక్సాఫీస్ టార్గెట్ మాత్రం రీజనల్ మార్కెట్ లో 300 కోట్ల క్లబ్ లో చేరడం. మరి ఆ రికార్డు 2026 లో సాధిస్తారా? అన్నది చూడాలి.