మూవీ రివ్యూ : 'యుఫోరియా'
టాలీవుడ్లో తన పంథాలో సినిమాలు తీసుకుంటూ పోయే దర్శకుడు గుణశేఖర్.;
'యుఫోరియా' మూవీ రివ్యూ
నటీనటులు: సారా అర్జున్- భూమిక- విఘ్నేష్ గవిరెడ్డి- గౌతమ్ మేనన్- ఆదర్శ్ బాలకృష్ణ- రోహిత్- లిఖిత యలమంచలి- అడ్డాల పృథ్విరాజ్ తదితరులు
సంగీతం: కాల భైరవ
ఛాయాగ్రహణం: ప్రవీణ్ పోతన్
మాటలు: నరేంద్ర కాశి- కృష్ణ హరి
నిర్మాతలు: నీలిమ గుణ, యుక్త గుణ
కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: గుణశేఖర్
టాలీవుడ్లో తన పంథాలో సినిమాలు తీసుకుంటూ పోయే దర్శకుడు గుణశేఖర్. ఒకప్పుడు చూడాలని ఉంది.. ఒక్కడు లాంటి చిత్రాలతో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ దర్శకుడు.. గత రెండు దశాబ్దాల్లో ‘రుద్రమదేవి’ మినహా సక్సెస్ ఫుల్ సినిమా ఏదీ తీయలేదు. ఇప్పుడాయన ఎక్కువగా కొత్త నటీనటులను పెట్టి ‘యుఫోరియా’ సినిమా తీశారు. ఈ చిత్ర విశేషాలేంటో.. ఇందులో గుణశేఖర్ వేసిన ముద్ర ఎలాంటిదో చూద్దాం పదండి.
కథ:
సివిల్స్ చేయాలనేది ఛైత్ర (సారా అర్జున్) కల. ఒక రోజు తన స్నేహితురాలితో కలిసి పబ్ లో పార్టీకి వెళ్లగా అక్కడ వికాస్ (విఘ్నేష్ గవిరెడ్డి)తో పాటు అతడి స్నేహితులు పరిచయం అవుతారు. వీళ్లందరూ మైనర్లే. చిన్న బర్త్ డే పార్టీ అని చెప్పి ఆమెను వికాస్ అండ్ కో కార్లో తీసుకెళ్లి రేప్ చేస్తారు. ఆ షాక్ తర్వాత ఛైత్ర తన తల్లిదండ్రులకు విషయం చెబుతుంది. తర్వాత పోలీసులకూ ఫిర్యాదు చేస్తారు. ఈ కేసును సీరియస్ గా తీసుకున్న కమిషనర్ జైదేవ్ (గౌతమ్ మీనన్).. వికాస్ తో పాటు తన మిత్రులను అరెస్ట్ చేస్తారు. పెద్ద పెద్ద వాళ్లు ఎంత ఒత్తిడి తెచ్చినా వెనుకంజ వేయకుండా వాళ్లకు శిక్ష వేయించే ప్రయత్నం చేస్తాడు జైదేవ్. మరి జైదేవ్ ప్రయత్నం ఫలించిందా? చేసిన తప్పుకు వికాస్ అండ్ గ్యాంగ్ కు శిక్ష పడిందా? కొడుకు చేసిన తప్పుకి ప్రాయశ్చిత్తంగా వికాస్ తల్లి వింద్య (భూమిక చావ్లా) ఏం చేసింది? ఈ ప్రశ్నలన్నిటికీ తెర మీదే సమాధానం తెలుసుకోవాలి.
కథనం - విశ్లేషణ:
స్టార్ ఉంటేనే సినిమాలు చూస్తారనో.. కమర్షియల్ హంగులు లేకపోతే కష్టం అనో.. వైరల్ కంటెంట్ ఉంటే తప్ప జనాలను ఆకర్షించలేమనో.. ఆలోచించకుండా.. లెక్కలేసుకోకుండా ఒక మంచి కథను చెప్పాలనుని గుణశేఖర్ లాంటి సీనియర్ దర్శకుడు సొంత బేనర్లో సిన్సియర్ ‘యుఫోరియా’ సినిమా తీయడం అభినందనీయం. కానీ మంచి ఉద్దేశాలతో సినిమా చేస్తే సరిపోదు. ఆ ఉద్దేశాలు బలంగా ప్రేక్షకులకు చేరేలా చూసుకోవాలి. ఒక గొప్ప సందేశం ఇవ్వాలనుకోవడం మంచిదే. కానీ ఆ సందేశాన్ని జనం తీసుకునేలా ఉండాలి. కథ ఎంత మంచిదైనా ఆసక్తికర కథనం లోపిస్తే.. ప్రేక్షకుల్లో అసహనం తప్పదు. అనవసర అంశాలతో పక్కదోవ పడితే అసలు విషయం అటకెక్కుతుంది. ‘యుఫోరియా’లో అలాగే జరిగింది. ఈ రోజుల్లో సమాజానికి చాలా అవసరమైన కథతో ఈ సినిమా చేసిన గుణశేఖర్.. ఎగ్జిక్యూషన్లో తడబడ్డాడు. కొన్ని మంచి ఆలోచనలు.. సన్నివేశాలున్నప్పటికీ.. రెండున్నర గంటలు ప్రేక్షకులను కుదురుగా కూర్చోబెట్టే కథనమే ఇందులో మిస్సయింది. ముఖ్యంగా కథ ఒకలా మొదలై.. ఒక మజిలీకి చేరాక.. ఇంకో రూపం తీసుకోవడంతో రెండు సినిమాలు చూస్తున్న ఫీలింగ్ కలిగి.. చివరికి సరైన అనుభూతి కగలదు.
నిర్భయ కేసు సహా చాలా ఏళ్లుగా మీడియాలో చూస్తున్న అనేక దారుణ ఘటనల ఆధారంగా గుణశేఖర్ ఒక బలమైన సందేశంతో కథను చెప్పే ప్రయత్నం చేశాడు ‘యుఫోరియా’లో. సివిల్ సర్వెంట్ కావాలనుకున్న ఒక మైనర్ అమ్మాయి.. ఐదుగురు మైనర్ అబ్బాయిల చేతుల్లో అత్యాచారానికి గురి కావడం.. సంచలనం రేపిన ఈ కేసులో ఆ అమ్మాయి ధైర్యంగా పోరాడడం.. ఆ ఐదుగురికీ శిక్ష పడేలా చేయడం.. ఈ నేపథ్యంలో ‘యుఫోరియా’ కథ నడుస్తుంది. అమ్మాయి పాత్రను హృద్యంగా తీర్చిదిద్ది.. ఆ పాత్ర మీద సానుభూతి కలిగేలా.. తనపై దారుణానికి ఒడిగట్టిన వారి మీద తీవ్రమైన కోపం వచ్చేలా కీలక సన్నివేశాలను బాగా తీర్చిదిద్దాడు గుణశేఖర్. పోలీసుల విచారణ.. కోర్టు ట్రయల్ కూడా ఆసక్తికరంగా అనిపిస్తాయి. కానీ కథనం బాగా నడుస్తున్న సమయంలో రేప్ సీన్ రీ కన్స్ట్రక్షన్ అని.. పొటెన్సీ టెస్ట్ అని.. అమ్మ-కొడుకుల మధ్య ఎమోషనల్ సాంగ్ అని.. అవసరం లేని విషయాలతో ఫీల్ ను చెడగొట్టాడు గుణశేఖర్. వాటిని మినహాయిస్తే ప్రథమార్ధంలో అంతా బాగా అనిపిస్తుంది.
ఐతే ఇంటర్వెల్ సమయానికే సినిమా ముగిసిన ఫీలింగ్ వస్తుంది. ద్వితీయార్ధంలో పూర్తిగా కొత్తగా అనిపించేలా డ్రగ్స్ వ్యవహారాన్ని నడిపించాడు గుణశేఖర్. దీంతో కథను ఎటెటో తీసుకెళ్లిపోయారు అనిపిస్తుంది. జైల్లో సీన్లను భరించడం చాలా కష్టం. దీనికి తోడు తల్లీ కొడుకుల ఎమోషన్ పెద్దగా వర్కవుట్ కాలేదు. విపరీతమైన సాగతీత.. రిపిటీటివ్ సీన్లతో ద్వితీయార్ధంలో సినిమాను చెడగొట్టేశాడు గుణశేఖర్. ఎంతకీ కొలిక్కి రాని కథతో అసహనం తప్పదు. ఒక దశ దాటాక ప్రేక్షకుడు నీరసించిపోతాడు. పిల్లల తప్పిదాలకు తల్లిదండ్రులదే బాధ్యత అనే పాయింట్ బాగున్నా.. దీన్ని మరింత ప్రభావవంతంగా చెప్పాల్సింది. సరైన సీన్లు పడలేదు. తల్లి పాత్రను ద్వితీయార్ధంలో చూపించిన తీరు బాగాలేదు. ఐతే ముగింపులో ఒక సన్నివేశం మాత్రం కదిలిస్తుంది. సినిమా మొత్తంలో దర్శకుడు బలమైన ముద్ర వేసింది ఈ సీన్లోనే. ఇలాంటి కొత్త ఆలోచనలు.. బలమైన సన్నివేశాలు సినిమాలో మరిన్ని ఉండుంటే.. ‘యుఫోరియా’ వేరే స్థాయి సినిమాలా ఉండేది. ఓవరాల్ గా చెప్పాలంటే ‘యుఫోరియా’లో కొన్ని ఆలోచనలు.. సన్నివేశాలు బాగున్నప్పటికీ.. ప్రేక్షకులకు సంతృప్తినివ్వలేకపోయింది. ఇది సమాజానికి అవసరమైన సినిమా అనడంలో మాత్రం సందేహం లేదు.
నటీనటులు:
భూమిక తల్లి పాత్రలో చక్కగా ఒదిగిపోయింది. రేప్ చేసిన కొడుకుని ఏం చేయాలి.. ఎలా మార్చాలి అని మనోవేదన పడే తల్లిగా భూమిక మెప్పిస్తుంది. ‘ధురంధర్’తో గుర్తింపు తెచ్చుకున్న సారా అర్జున్ ఈ సినిమాలో భిన్నమైన పాత్రలో కనిపించి ఆకట్టుకుంది. తన స్క్రీన్ టైం తక్కువే అయినా.. అత్యాచారనికి గురయ్యే మైనర్ అమ్మాయిగా తన పాత్ర ప్రేక్షకులను కదిలిస్తుంది. తన ఎమోషనల్ పెర్ఫామెన్స్ ఆకట్టుకుంటుంది. సినిమాలో అత్యంత కీలకమైన పాత్రలో విఘ్నేష్ రెడ్డి అదరగొట్టాడు. నెగిటివ్ షేడ్స్ ను బాగా చూపించాడు. సినిమాలో బెస్ట్ పెర్ఫామర్ అతనే. అతడికి మరిన్ని సినిమా అవకాశాలు రావొచ్చు. ఒకప్పటి హీరో రోహిత్.. విగ్నేష్ కి తండ్రి పాత్రలో కనిపించి ఆశ్చర్యపరిచాడు. గౌతమ్ మీనన్ కూడా పోలీస్ పాత్రలో మెప్పించాడు. ఆదర్శ్ బాలకృష్ణ.. పృథ్వీరాజ్ అడ్డాల.. ఆశ్రిత వేముగంటి.. రవి ప్రకాష్, లిఖిత యలమంచలి.. వీళ్లంతా పర్వాలేదనిపించారు.
సాంకేతిక వర్గం:
ప్రవీణ్ పోతన్ సినిమాటోగ్రఫీ బాగుంది. విజువల్స్ ఆకట్టుకుంటాయి. కాల భైరవ సంగీతం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. కొన్ని చోట్ల బీజీఎం బాగున్నా.. కొన్ని చోట్ల మరీ లౌడ్ అనిపిస్తుంది. పాటలకు సినిమాలో ప్రాధాన్యం లేదు. ఉన్న ఒకట్రెండు సాంగ్స్ కూడా ఆకట్టుకోవు. నిర్మాణ విలువలు సినిమాకు అవసరమైన స్థాయిలో ఉన్నాయి. ఇక కథకుడు.. దర్శకుడు గుణశేఖర్ ఎంచుకున్న పాయింట్ బాగుంది. రేప్ చేస్తే శిక్ష పడటం లాంటి పాత కథే అయినా దానికి తల్లి ఎమోషన్ జత చేసి భిన్నంగా ప్రెజెంట్ చేయాలని చూశాడు. కంటెంపరరీ అంశాలు చాలానే జోడించాడు. కానీ ప్రేక్షకులను ఆశ్చర్యపరిచేలా.. ట్రెండీగా కథనాన్ని ప్రెజెంట్ చేయలేకపోయాడు. పచ్చిగా విషయాలను చూపించాలనే ప్రయత్నంలో కొన్ని చోట్ల హద్దులు దాటేశాడు. కొన్ని సన్నివేశాల వరకు మెప్పించినా.. ఓవరాల్ ఇంపాక్ట్ అనుకున్నంతగా లేదు.
చివరగా: యుఫోరియా.. విషయం మంచిదే కానీ
రేటింగ్- 2.25/5