60 ఏజ్‌లో ఈ సాహసాలేంటి భాయ్?
ఇలాంటి సమయంలో అతడు ఒక యుద్ధ వీరుడిగా, సైనికుడిగా నటిస్తుండడం చర్చగా మారింది.;
60 ప్లస్‌లోను భారతీయ హీరోలు చేస్తున్న సాహసాలు ఆశ్చర్యపరుస్తున్నాయి. టాలీవుడ్ లో నలుగురు అగ్ర హీరోలు, బాలీవుడ్ లో అరడజను స్టార్ హీరోలు కూడా ఇప్పటికే 60 ఏజ్ కు చేరుకున్నారు. అయినా ఇప్పటికీ ఇండస్ట్రీలో హవా సాగించేందుకు వారు చేయని ప్రయత్నాలు లేవు. అమితాబ్, రజనీకాంత్ లాంటి వెటరన్లు ఏజ్ లెస్ స్టార్లుగా ఏల్తుంటే, ఆ ఇద్దరినీ అనుసరించేందుకు ఇతర స్టార్లు ప్రయత్నిస్తున్నారు.
అదంతా సరే కానీ 60 ఏజ్ లో కూడా ఖాన్‌ల త్రయం బాలీవుడ్ ని ఇంకా తమ కబంధ హస్తాల్లో బంధించాలని అనుకోవడం సరైనదేనా? ఇది ఇంకా ఎంత కాలం కొనసాగుతుంది? ఆ ముగ్గురు ఖాన్ లలో ఇప్పటికే ఫిట్ నెస్ పై శ్రద్ధ తగ్గింది. ఇటవలి వరుస విజయాల నేపథ్యంలో షారూఖ్ కొంతవరకూ ఫిట్ గా ఉండేందుకు జిమ్ముల్లో శ్రమిస్తున్నాడు కానీ, వరుస వైఫల్యాలతో ఉన్న సల్మాన్ ఖాన్, ఫ్యామిలీ ట్రామాలో ఉన్న అమీర్ ఖాన్ ఇప్పటికే తమ శరీరాకృతిపై పట్టు వదిలేసారు. వీళ్లు జిమ్ చేస్తున్నట్టు కనిపించడం లేదు. ఇక సల్మాన్ భాయ్ ఇటీవల పెద్ద బాన పొట్టతో కనిపించి నిజంగా అభిమానులకు షాకిచ్చాడు. గ్యాంగ్ స్టర్ లారెన్స్ బిష్ణోయ్ హత్యా బెదిరింపుల తర్వాత సల్మాన్ పూర్తిగా మారిపోయాడు. అతడి మారిన రూపం ఇప్పుడు భయపెడుతోంది.
ఇలాంటి సమయంలో అతడు ఒక యుద్ధ వీరుడిగా, సైనికుడిగా నటిస్తుండడం చర్చగా మారింది. మురుగదాస్ తో సికందర్ దారుణ వైఫల్యం తర్వాత విజయమే పరమావధిగా అతడు ఇప్పుడు ఒక దేశభక్తి కథను ఎంచుకున్నాడు. ఈ చిత్రం 2020 లో జరిగిన గాల్వన్ వ్యాలీ సంఘర్షణ , కల్నల్ బికుమల్లా సంతోష్ బాబు బలిదానం ఆధారంగా రూపొందుతోంది. అపూర్వ లఖియా దీనికి దర్శకత్వం వహిస్తున్నారు. అయితే . ఈ చిత్రం నిజ జీవిత హీరో, దేశభక్తుడి కథ ఆధారంగా రూపొందుతుండడంతో సల్మాన్ చాలా శ్రమించాల్సి ఉంటుంది. పైగా ఆక్సిజన్ అందని లేహ్ (హిమచల్ ప్రదేశ్) వంటి చోట్ల షూటింగుకు వెళ్లాలంటే అతడిలో ఇంకా ప్రిపరేషన్ చాలా అవసరం.
వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కే చిత్రమిది. గాల్వాన్ లోయలో సైనికుల పోరాటం చాలా భిన్నమైనది. కొందరు చైనీ సైనికులపై భారత సైనికులు విరుచుకుపడి మల్లయుద్ధం చేసారు. మారణాయుధాలతో కాకుండా పిక్కబలం చూపించి ప్రత్యర్థులను మట్టి కరిపించిన వీరుల కథ. ఘటనా స్థలిలో రాళ్లు రప్పలు, కర్రలతో బాదుకుని మరీ పోరాడారు. నిజానికి ఇది రెగ్యులర్ వార్ డ్రామాతో పోలిస్తే భిన్నమైనది. ఇది విరోచితంగా పోరాడే `సుల్తాన్`(సల్మాన్ నటించినదే) కథలాంటిది. ఇందులో సల్మాన్ భాయ్ రాణించేందుకు ఆస్కారం ఉంది. కానీ ఎత్తయిన పర్వతాల్లో ఆక్సిజన్ అందని చోట నిలబడి మల్ల యుద్ధం చేయాలంటే సల్మాన్ భాయ్ చాలా వరకూ ఆక్సిజన్ శిక్షణ తీసుకోవాలి. అలాగే తన బరువు తగ్గి పూర్తిగా ఫిట్ గా మారేందుకు చాలా శ్రమించాల్సి ఉంటుందని విశ్లేషిస్తున్నారు. మరి భాయ్ అలాంటి శ్రమకు సిద్ధంగా ఉన్నాడా? 60 వయసులో ధైర్యసాహసాలు ప్రదర్శించే దేశభక్తుడి పాత్రలో సల్మాన్ నటిస్తుండడం అభిమానులను నిజంగా ఎంతగానో ఎగ్జయిట్ చేస్తోంది. కానీ వారు ఆశించినది వందశాతం అందించేందుకు సల్మాన్ ఎలాంటి హార్డ్ వర్క్ చేస్తాడో చూడాలి.