నెపోటిజం వర్సెస్ అదనపు ఒత్తిడి!

చలనచిత్ర పరిశ్రమలో నెపోటిజం అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్రమైన చర్చ సాగుతోంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చే నటీనటులకు అవకాశాలు సులువుగా ద‌క్కుతాయ‌ని సర్వసాధారణంగా వినిపించే మాట.

Update: 2026-06-06 06:46 GMT

చలనచిత్ర పరిశ్రమలో నెపోటిజం అనే అంశంపై గత కొన్నేళ్లుగా తీవ్రమైన చర్చ సాగుతోంది. సినీ నేపథ్యం ఉన్న కుటుంబాల నుండి వచ్చే నటీనటులకు అవకాశాలు సులువుగా ద‌క్కుతాయ‌ని సర్వసాధారణంగా వినిపించే మాట. ఇది నాణేనికి ఒక‌వైపు మాత్ర‌మే. దీనికి మ‌రో వైపు కూడా ఉందంటూ ప్రముఖ బాలీవుడ్ దర్శకుడు ఇంతియాజ్ అలీ చేసిన వ్యాఖ్యలు పరిశ్రమ వర్గాల్లో కొత్త చర్చకు దారితీశాయి. వారసత్వంగా పరిశ్రమలోకి అడుగుపెట్టే వారికి బయటి వ్యక్తుల కంటే అదనపు మానసిక ఒత్తిడి.. కఠినమైన సవాళ్లు ఎదురవుతాయని అభిప్రాయపడ్డారు.ఇంతియాజ్ అలీ కెరీర్‌లో పరిశ్రమకు సంబంధం లేని నటీనటులతో పాటు స్టార్ కిడ్స్‌తోనూ కలిసి పని చేశారు.

అదే అనుభ‌వంతో ఆయ‌న ఈ వ్యాఖ్య‌లు చేసారు. రణ్‌బీర్ కపూర్ .. ఆలియా భట్ వంటి ప్రతిభావంతులైన నటీనటులు కేవలం వారసత్వం వల్లే ఈ స్థాయికి రాలేదన్నారు. సినీ కుటుంబం నుండి రావడం వల్ల మొదటి అవకాశం సులభంగా దొరికినా? ఆ తర్వాత వారు తమను తాము నిరూపించుకోవడానికి .. ప్రేక్షకుల అంచనాలను అందుకోవడానికి నిరంతరం ఓ రకమైన అదృశ్య యుద్ధం చేయాల్సి వ‌చ్చింద‌న్నారు. సినీ నేపథ్యం లేని అవుట్‌సైడర్స్ పరిశ్రమలోకి వచ్చేటప్పుడు ఎదుర్కొనే ఇబ్బందులు పూర్తిగా భిన్నంగా ఉంటాయని ఇంతియాజ్ పేర్కొన్నారు.

వారికి అవకాశాలు దక్కడం, సరైన వ్యక్తుల పరిచయాలు ఏర్పడటం వంటి ప్రాథమిక దశలోనే ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. కానీ వారసత్వంతో వచ్చే నెపో కిడ్స్ కు చిన్నతనం నుంచే పరిశ్రమ వాతావరణం, ఇక్కడి ఒత్తిళ్లు, వైఫల్యాలు ఎలా ఉంటాయో? ప్రత్యక్షంగా చూసే అవకాశం లభిస్తుంది. అయినప్పటికీ వెండితెరపైకి వచ్చిన తర్వాత వారు మోయాల్సిన అంచనాల భారం వారి మానసిక దృఢత్వాన్ని మరింతగా పరీక్షిస్తుందన్నారు.

స్టార్ కిడ్స్ విషయంలో ప్రేక్షకులు .. విమర్శకులు చాలా త్వరగా ఒక నిర్ణయానికి వచ్చేస్తుంటారని వారిపై ఎప్పుడూ ప్రత్యేక నిఘా ఉంటుందని అలీ గుర్తుచేశారు. వారు చేసే చిన్న పొరపాటు కూడా పెద్దగా హైలైట్ అవుతుందని దీనివల్ల వారు తమ ప్రతిభను చాటుకోవడానికి మరింత కఠోరంగా శ్రమించాల్సి వస్తుందన్నారు. రణ్‌బీర్, ఆలియా వంటి వారు కేవలం తమ ఇంటిపేరు చూసి స్టార్స్ కాలేదని వారిలోని అంకితభావం, నటన పట్ల ఉన్న అపారమైన గౌరవమే వారిని ఈ రోజు అగ్రస్థానంలో నిలబెట్టాయని ప్రశంసించారు.

ఈ రకమైన విశ్లేషణ పరిశ్రమలోని అంతర్గత సత్యాలను ప్రతిబింబిస్తోంది. టాలెంట్ లేకపోతే ఎంతటి బ్యాక్‌గ్రౌండ్ ఉన్నా ? ప్రేక్షకులు ఆదరించరనేది బాక్సాఫీస్ చరిత్ర నిరూపించిన సత్యం. ఇంతియాజ్ అలీ మాటల ప్రకారం, బయటి వ్యక్తులకు పరిశ్రమలోకి ప్రవేశించడం ఒక ఎత్తయితే.. స్టార్ కిడ్స్‌కు ప్రవేశించిన తర్వాత తమ ఉనికిని కాపా డుకుంటూ నిరంతర విమర్శలను తట్టుకుని నిలబడటం మరొక సవాలుగా మారుతోంది. ఇలా ఇరువర్గాల ప్రయాణంలోనూ విభిన్నమైన కష్టాలు దాగి ఉన్నాయనేది అలీ అంతరార్థం.

Tags:    

Similar News