పబ్ నిర్వాహకులతో గొడవ.. నటి కల్పికకు షాక్!

టాలీవుడ్ నటి కల్పిక గణేష్, హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌ నిర్వాహకులకు మధ్య కొద్ది రోజుల క్రితం గొడవ జరిగిన విషయం తెలిసిందే.;

Update: 2025-06-12 06:36 GMT

టాలీవుడ్ నటి కల్పిక గణేష్, హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ప్రిజం పబ్‌ నిర్వాహకులకు మధ్య కొద్ది రోజుల క్రితం గొడవ జరిగిన విషయం తెలిసిందే. ఏం జరిగిందో స్పష్టంగా తెలియకపోయినప్పటికీ.. రకరకాల వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. స్వయంగా ఆమెనే ఇన్ స్టాలో గొడవకు చెందిన వీడియో పోస్ట్ చేసింది.

పబ్ సిబ్బంది తనతో దురుసుగా ప్రవర్తించారని, బూతులు తిట్టారని ఆరోపించిన కల్పిక గణేష్.. డ్రగ్గిస్ట్ అంటూ అవమానించారని ఆరోపణలు చేసింది. తన గౌరవం దెబ్బతిందని, మానసికంగా సైతం వేదన చెందినట్టు పేర్కొంది. కాగా, తమతో కల్పిక అసభ్యంగా ప్రవర్తించారని, దాడి కూడా చేశారని పబ్ నిర్వాహకులు అప్పుడు చెప్పారు.

ఇప్పుడు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రిజం క్లబ్ యజమాని దీపక్ బజాజ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కల్పిక గణేష్ పై కేసు నమోదు చేశామని పోలీసులు వెల్లడించారు. అసభ్యంగా ప్రవర్తించారంటూ సోషల్‌ మీడియాలో కల్పిక.. తప్పుడు ప్రచారం చేశారని ప్రిజం క్లబ్ ఓనర్ తాజాగా తన ఫిర్యాదులో పేర్కొన్నారు.

అంతే కాదు.. పోలీసుల ముందు కూడా కల్పిక గణేష్ తప్పుడు ఆరోపణలు చేశారని అన్నారు. తమ క్లబ్‌ లోని సామాగ్రిని కల్పికతోపాటు ఆమె స్నేహితులు ధ్వంసం చేశారని ఫిర్యాదులో తెలిపారు. మే 29వ తేదీన క్లబ్‌ కు వారు వచ్చారని చెప్పారు. రూ.2,200 బిల్‌ చేసి కాంప్లిమెంటరీగా కేక్‌ ఇవ్వమని తమను అడిగారని దీపక్ తెలిపారు.

అలా కుదరదని మేనేజర్‌ చెప్పిన వెంటనే అప్పుడు గొడవకు దిగారని ఫిర్యాదులో తెలిపారు క్లబ్ యజమాని. బాడీ షేమింగ్ కూడా చేశారని చెప్పారు. ప్లేట్స్ విసిరేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఇప్పుడు 324(4), 352, 351(2) BNS యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు తెలిపారు.

కాగా కల్పిక కెరీర్ విషయానికొస్తే.. ఆరెంజ్ సినిమాలో జెనీలియా స్నేహితురాలిగా నటించి ఒక్కసారిగా లైమ్ లైట్ లోకి వచ్చిన ఆమె.. ఆ తర్వాత వరుస మూవీ ఛాన్సులు అందుకుంది. జులాయి, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, సారొచ్చారు, పడి పడి లేచే మనసు, హిట్ ఫస్ట్ కేస్, యశోద వంటి వివిధ చిత్రాల్లో నటించి మెప్పించింది. ఇప్పుడు పబ్ వివాదంతో వార్తల్లో నిలిచింది.

Tags:    

Similar News