SPY విశ్వంలో కబీర్- టైగర్‌లకు సిసలైన పోటీ
ఇటీవలి కాలంలో స్పై యూనివర్శ్ లు, మల్టీవర్శ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. సహజంగానే యూనివర్శ్ కాన్సెప్టుల్లోకి కొత్త పాత్రలు వచ్చి చేరుతుంటాయి.;
ఇటీవలి కాలంలో స్పై యూనివర్శ్ లు, మల్టీవర్శ్ ల ట్రెండ్ కొనసాగుతోంది. సహజంగానే యూనివర్శ్ కాన్సెప్టుల్లోకి కొత్త పాత్రలు వచ్చి చేరుతుంటాయి. అలా వైఆర్ఎఫ్ ప్రతిష్ఠాత్మక స్పై యూనివర్శ్ లోకి వచ్చి చేరాడు యంగ్ టైగర్ ఎన్టీఆర్. వార్ 2లో హృతిక్ తో కలిసి నటించడం చారిత్రాత్మకం. దక్షిణ భారతదేశం నుంచి ఇలాంటి అవకాశం అందుకున్న మొట్టమొదటి హీరోగా ఎన్టీఆర్ చరిత్ర సృష్టిస్తున్నాడు. తారక్ ఎనర్జీ, డ్యాన్సింగ్ ఎబిలిటీ, గ్రేస్ ప్రతిదీ రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో ప్రపంచం తెలుసుకుంది. అప్పటి నుంచి తారక్ దశ దిశ తిరిగిపోయింది.
ఒక దక్షిణాది హీరోని ఎంపిక చేయడం ద్వారా ప్రఖ్యాత యష్ రాజ్ ఫిలింస్ అధినేత ఆదిత్య చోప్రా బిగ్ బెట్టింగ్ కి ప్లాన్ చేసారు. దక్షిణాదిన క్రేజ్ ఉన్న హీరో కారణంగా ఈ బ్యానర్ తన ఇమేజ్ ని పెంచుకోబోతోంది. తారక్ ని విశ్వంలో భాగం చేయడం అనేది వ్యూహాత్మక నిర్ణయం. ఇది కేవలం ఏదో ఒక సినిమా వరకూ కొనసగే అనుబంధం అని భావించకూడదు. ఇందులో చాలా సినిమాలు తెరకెక్కనున్నాయి. స్పై వర్శ్ లో కీలక పాత్రలైన కబీర్, టైగర్ వంటి వాటికి ధీటుగా ఇప్పుడు తారక్ పాత్రను కూడా పరిచయం చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠను పెంచుతోంది. కబీర్ పాత్రలో హృతిక్ రోషన్, టైగర్ పాత్రలో సల్మాన్ ఖాన్ వంటి వారు బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించారు. ఇప్పుడు దక్షిణాది నుంచి సుమారు 100 కోట్లు కొల్లగొట్టేందుకు యంగ్ టైగర్ సహాయపడతాడని వైఆర్ఎఫ్ స్కెచ్ వేసింది. ఈ వ్యూహం ఫలిస్తే స్పై వర్స్ ల పేరుతో వరుసగా తారక్ తో సినిమాలు తీసేందుకు ఆదిత్య చోప్రా హిడెన్ ప్లాన్ సిద్ధం చేసారని కూడా గుసగుస వినిపిస్తోంది.
కొత్త ప్రతిభను పరిచయం చేయడం అంటే డబ్బును స్పిన్ చేయడం... నచ్చినట్టు దండుకోవడం అని వైఆర్ఎఫ్ నిరూపించబోతోంది. సల్మాన్ తో టైగర్ ఫ్రాంఛైజీ, హృతిక్ తో వార్ ఫ్రాంఛైజీని నడిపిస్తూ దీనిని యూనివర్శ్ గా మలిచి ఇందులో కొత్త హీరోలను పరిచయం చేస్తూ వైఆర్ ఎఫ్ బిగ్ గేమ్ నడిపిస్తోంది. సమీప భవిష్యత్తులో ఈ విశ్వంలో స్వతంత్ర చిత్రాలు, స్పిన్-ఆఫ్‌లు, ప్రధాన క్రాస్ఓవర్ లు ఉంటాయని అంచనా. స్పై వర్శ్ లో మహిళా పాత్రలు జోయా (కత్రినా కైఫ్), రుబాయి (దీపికా పదుకొనే) తో పాటు ఆల్ఫా గా ఆలియా భట్ కూడా ఎంట్రీ ఇస్తోంది. వార్ 2తో ఎన్టీఆర్ బాలీవుడ్ కి పరిచయం అవుతున్నాడు. ఇది అతడికి గ్రాండ్ ఎంట్రీ కాబోతోంది. టాలీవుడ్ లో వేరొక హీరోకి సాధ్యపడని విధంగా తారక్ డెబ్యూ చేస్తుండడం సర్వత్రా ఉత్కంఠ పెంచుతోంది. వైఆర్ఎఫ్ అతడిపై ఉంచిన నమ్మకాన్ని నిలబెడతాడని అభిమానులు బలంగా నమ్ముతున్నారు.