సూర్య హృతిక్.. కనెక్షన్ ఏంటీ?

కేజీఎఫ్, సలార్, కాంతార వంటి విజయాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది.

Update: 2026-06-30 04:57 GMT

కేజీఎఫ్, సలార్, కాంతార వంటి విజయాలతో భారీ గుర్తింపు తెచ్చుకున్న హోంబలే ఫిల్మ్స్ ప్రస్తుతం వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులతో బిజీగా ఉంది. ఇటీవల బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్‌ తో సినిమాను అధికారికంగా ప్రకటించిన ఆ బ్యానర్.. ఇప్పుడు కోలీవుడ్ స్టార్ హీరో సూర్యతో మరో బిగ్ బడ్జెట్ సినిమాను ప్రకటించింది. అయితే ఆ రెండు అనౌన్స్మెంట్ల మధ్య సంబంధం ఉందా? హృతిక్ సినిమా ఆగిపోయిందా? అనే ప్రశ్నలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

కొద్ది రోజుల క్రితం హోంబలే ఫిల్మ్స్.. హృతిక్ రోషన్‌ తో కలిసి ఓ భారీ పాన్ ఇండియా సినిమాను నిర్మిస్తున్నట్లు ప్రకటించింది. "అందరూ అతడిని గ్రీక్ గాడ్ అని పిలుస్తారు. అతడు హద్దులు చెరిపేశాడు" అంటూ స్పెషల్ పోస్టర్ విడుదల చేసి హృతిక్‌ కు గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. సినిమా అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతుందని నిర్మాత విజయ్ కిరగందూర్ తెలిపారు. వైవిధ్యమైన కథలతో ముందుకు సాగే హోంబలే సంస్థతో కలిసి పనిచేయడం ఆనందంగా ఉందని హృతిక్ కూడా స్పందించారు.

ఆ ప్రాజెక్టుకు దర్శకుడు ఎవరు అన్నది మాత్రం ఇప్పటివరకు వెల్లడించలేదు. అయితే మలయాళ నటుడు, డైరెక్టర్ పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వం వహించే అవకాశముందని అప్పట్లో ప్రచారం జరిగింది. అంతేకాదు, ఆ సినిమా కోసం హృతిక్ తన క్రిష్-4ను కూడా కొంతకాలం పక్కన పెట్టనున్నారని వార్తలు వినిపించాయి. ఇలాంటి సమయంలో హోంబలే ఫిల్మ్స్ సూర్యతో మరో భారీ చిత్రాన్ని అధికారికంగా ప్రకటించింది.

ఆ ప్రకటన వెలువడిన వెంటనే సోషల్ మీడియాలో కొత్త చర్చ మొదలైంది. హృతిక్-హోంబలే సినిమా దాదాపు నిలిచిపోయిందనే పోస్టులు కనిపించాయి. దీంతో సూర్య సినిమా ప్రకటించడంతో హృతిక్ ప్రాజెక్ట్ ఆగిపోయిందా? అనే సందేహాలు అభిమానుల్లో మొదలయ్యాయి. అయితే ప్రస్తుతం ఆ ప్రచారానికి హోంబలే ఫిల్మ్స్ నుంచి ఎలాంటి అఫీషియల్ కన్ఫర్మేషన్ లేదు.. అలాగే హృతిక్ రోషన్ టీమ్ కూడా ఆ విషయంపై స్పందించలేదు.

అందువల్ల సినిమా నిలిచిపోయిందని ఇప్పుడే చెప్పేందుకు ప్రూఫ్స్ లేవని సినీ ప్రియులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఆధారంగానే చర్చ సాగుతోందని అంటున్నారు మరోవైపు హోంబలే ఫిల్మ్స్ ఒకేసారి పలువురు స్టార్ హీరోలతో సినిమాలు రూపొందించే స్టామినా ఉన్న సంస్థ అనే విషయం తెలిసిందే. ఇప్పటికే పలు భాషల్లో అనేక ప్రాజెక్టులను ప్యారలెల్ గా నిర్మిస్తోంది.

అలాంటి సంస్థ ఒక కొత్త సినిమా ప్రకటించిందనే కారణంతో మరో ప్రాజెక్ట్ ఆగిపోయిందని తేల్చేయడం సరైంది కాదని కొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే సూర్య సినిమా ప్రకటన, హృతిక్ ప్రాజెక్టుపై వస్తున్న రూమర్లు ఒకేసారి రావడంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగింది. హృతిక్ రోషన్- హోంబలే ఫిల్మ్స్ సినిమా కొనసాగుతుందా? లేక నిజంగానే మార్పులు జరిగాయా? అన్న దానిపై క్లారిటీ రావాలంటే హోంబలే ఫిల్మ్స్ అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం పెద్ద ఎత్తున చర్చ సాగుతోంది.

Tags:    

Similar News