భార‌తీయ సినిమా ప్ర‌యోగశాల అంత‌ర్థానం: లెజెండ‌రీ సింగీతం ఇక లేరు!

దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ద‌ర్శ‌కుడిగా ఎన్నో విభిన్న చిత్రాలను అందించిన ఆయన మృతి సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

Update: 2026-10-04 00:30 GMT

తెలుగు సినీ పరిశ్రమలో తనదైన ముద్ర వేసిన ప్రముఖ దర్శకుడు, ప్రయోగాత్మక చిత్రాలకు మారుపేరుగా నిలిచిన సింగీతం శ్రీనివాసరావు (94) కన్నుమూశారు. చెన్నైలోని కావేరి హాస్పిటల్‌లో వయోభారంతో ఆయన తుదిశ్వాస విడిచారు. దాదాపు ఆరు దశాబ్దాల సినీ ప్రస్థానంలో ద‌ర్శ‌కుడిగా ఎన్నో విభిన్న చిత్రాలను అందించిన ఆయన మృతి సినీ వర్గాలను, అభిమానులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది.

1931 సెప్టెంబర్ 21న జన్మించిన సింగీతం శ్రీనివాసరావు దర్శకుడిగానే కాకుండా రచయిత, నిర్మాత, సంగీత దర్శకుడిగానూ ప్రతిభను చాటుకున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో పలు చిత్రాలు తెరకెక్కించిన ఆయన సాధారణ కథలను సైతం వినూత్న ఆలోచనలతో ఆవిష్కరించడంలో దిట్టగా పేరుగాంచారు.

`పుష్పక విమానం`, `ఆదిత్య 369`, `భైరవ ద్వీపం` వంటి సినిమాలు ఆయన సృజనాత్మకతకు, ప్రతిభకు నిదర్శనంగా నిలిచాయి. కమల్ హాసన్, బాలకృష్ణ వంటి అగ్ర నటులతో ఆయన తెరకెక్కించిన చిత్రాలు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ పొందాయి. వినోదంతో పాటు టెక్నిక‌ల్ గా ప్రయోగాలు, కొత్తదనానికి ఆయన ఎప్పుడూ పెద్దపీట వేశారు.

వయసు పెరిగినా సినిమాపై ఆయనకున్న ఆసక్తి ఏమాత్రం తగ్గలేదు. 94 ఏళ్ల వయసులోనూ మరోసారి మెగాఫోన్ పట్టి `సింగ్ గీతం` అనే మ్యూజికల్ ఫాంటసీ చిత్రానికి దర్శకత్వం వహించారు. దర్శకుడు నాగ్ అశ్విన్ నిర్మించిన ఈ సినిమా 2026లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ప్రతి డైలాగ్ పాట రూపంలో సాగే ఈ చిత్రాన్ని కేవలం 77 రోజుల్లో పూర్తి చేసి ఆయన అందరినీ ఆశ్చర్యపరిచారు.

దశాబ్దాల పాటు దక్షిణ భారత సినిమాకు సేవలందించిన సింగీతం శ్రీనివాసరావు మరణం భారతీయ సినీ రంగానికి తీరని లోటు. భౌతికంగా దూరమైనా ఆయన తెరకెక్కించిన విలక్షణమైన సినిమాలు.. సృష్టించిన పాత్రలు ప్రేక్షకుల జ్ఞాపకాల్లో ఎప్పటికీ నిలిచిపోతాయి.

Tags:    

Similar News