100ల కోట్ల ప్రాజెక్టులను రిజెక్ట్ చేసినవాడిని!
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఎంత గొప్ప పేరు సంపాదిం చాడో? అంతకు మించి వివాదాల్లోనూ అతడి పేరు తరుచూ వినిపిస్తుంటుంది.
బాలీవుడ్ సీనియర్ హీరో గోవిందా కెరీర్ జర్నీ గురించి చెప్పాల్సిన పనిలేదు. నటుడిగా ఎంత గొప్ప పేరు సంపాదిం చాడో? అంతకు మించి వివాదాల్లోనూ అతడి పేరు తరుచూ వినిపిస్తుంటుంది. తాజాగా తన కెరీర్ - వ్యక్తిగత జీవితంపై వస్తోన్నవిమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను నిర్లక్ష్యపు హీరోగా (లేటుగా రావడం వంటివి) చిత్రీకరించడం వెనుక ఒక వ్యవస్థీకృత కుట్ర ఉందని ఆరోపించారు. తనకు అవకాశాలు రాకుండా చేసేందుకు , తన ఇమేజ్‌ను దెబ్బతీసేందుకు కొంతమంది ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారాలు చేశారన్నారు. ఆ సమయంలో జరిగినవన్నీ ప్రణాళిక ప్రకారం జరిగాయని ఓ ఇంటర్వ్యూలో ఓపెన్ అయ్యారు.
అలాగే సోషల్ మీడియాలో తనపై జరుగుతోన్న ట్రోలింగ్ పైనా స్పందించారు. `పని మాట్లాడుతుంది. మాటలు కాదు` అంటూ గోవిందా ధీటుగా సమాధానమిచ్చారు. ఆన్‌లైన్ విమర్శలు ఏమాత్రం ప్రభావితం చేయవని తన జీవితంలో ఇంతకంటే క్లిష్టమైన పరిస్థితులను , అవమానాలను ఎదుర్కొన్నానని గుర్తుచేసుకున్నారు. సోషల్ మీడియాలో వచ్చే హెడ్ లైన్స్ ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించలేవన్నారు. తన నిజాయితీ , కష్టమే ఇక్కడి వరకు తీసుకొచ్చాయన్నారు. ఒకప్పుడు 100 కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను తిరస్కరించానని, ఆ నిర్ణయాలపై అప్పట్లో విమర్శలు వచ్చినా పట్టించుకోలేదన్నారు.
ఇప్పుడు ఎంతో ప్రశాంతంగా ఉన్నానని గోవిందా తెలిపారు. ప్రస్తుతం తాను ఎవరితోనూ పోటీ పడటం లేదని తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నానని చెప్పారు. చిన్నపాటి ఈవెంట్లలో పాల్గొనడంపై వస్తోన్న విమర్శలను కూడా గోవిందా తిప్పికొట్టారు. పని అనేది ఎప్పుడూ చిన్నది కాదని ప్రతి అవకాశాన్ని తాను గౌరవిస్తానని పేర్కొన్నారు. చిన్నపని అయితే తక్కువ వేతనం వస్తుందని..పెద్ద పని అయితే ఎక్కువ వేతనం వస్తుందని అంతకు మించి ఎలాంటి వ్యత్యాసం ఉండదన్నారు. గోవిందా చేసిన ఈ వ్యాఖ్యలు బాలీవుడ్ లోని అంతర్గత రాజకీయాలను, సోషల్ మీడియా పెత్తనాన్ని ఎత్తి చూపుతున్నాయి.
తనపై జరిగిన కుట్రలను దాటుకుని నేటికీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేయగలిగాననే ఆత్మవిశ్వాసం గోవిందా మాటల్లో కనిపిస్తోంది. `సమయం వచ్చినప్పుడు నా పనే సమాధానం చెబుతుంది` అన్న ఆయన ధీమా చూస్తుంటే? మున్ముందు మరిన్ని మంచి ప్రాజెక్టులతో ఆయన మళ్ళీ మెరవబోతున్నారని అర్థమవుతోంది. అయితే ఇలా ముక్కు సూటిగా మాట్లాడటం వల్ల గోవింద చాలా అవకాశాలు కూడా కోల్పోయారు. అతడు సరదాగా చేసిన వ్యాఖ్యలు కూడా కొన్నిసార్లు వివాదాలకు దారి తీసి వచ్చిన అవకాశాలు చేజారిన సందర్భాలెన్నో. గోవిందా నాలుగేళ్లగా ఎలాంటి సినిమాలు చేయలేదు. చివరిగా 2022లో ఓ డాక్యుమెంటరీలో నటించారు. అదే అతడి చివరి చిత్రం.