జాట్ మొదటి ఛాయిస్ సన్నీ డియోల్ కాదట!
అయితే గోపీచంద్ జాట్ సినిమా కోసం ముందు అనుకున్న హీరో సన్నీ డియోల్ కాదనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు.;

ఇండస్ట్రీలో ఒకరు చేయాల్సిన సినిమాలు ఒకరికి వెళ్లడం చాలా మామూలుగా జరిగే విషయమే. ఇప్పుడు అలాంటి పరిస్థితి మరోసారి ఏర్పడింది. వీర సింహారెడ్డి సక్సెస్ తర్వాత గోపీచంద్ మలినేని బాలీవుడ్ కు వెళ్లి అక్కడి హీరో సన్నీ డియోల్ కు కథ చెప్పి, మెప్పించి, ఆ కథను ఓకే చేయించుకుని జాట్ అనే సినిమా తీసి మంచి హిట్ అందుకున్న విషయం తెలిసిందే.
జాట్ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి కలెక్షన్లనే రాబట్టింది. జాట్ లో సన్నీడియోల్ ను ఇంతకుముందెప్పుడూ చూపించని విధంగా సరికొత్త అవతారంలో ప్రెజెంట్ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు గోపీచంద్ మలినేని. గదర్2 తర్వాత సన్నీడియోల్ మరోసారి జాట్ సినిమాతో అందరినీ మెప్పించి మరో హిట్ ను తన అకౌంట్ లో వేసుకున్నాడు.
అయితే గోపీచంద్ జాట్ సినిమా కోసం ముందు అనుకున్న హీరో సన్నీ డియోల్ కాదనే విషయం చాలా తక్కువ మందికే తెలుసు. ముందుగా జాట్ సినిమాను గోపీచంద్, నందమూరి బాలయ్యతో చేయాలనుకున్నాడట. ఈ విషయాన్ని స్వయంగా గోపీచందే రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టాడు. క్రాక్ సినిమా తర్వాత బాలయ్యకు కథ చెప్పడానికి వెళ్లిన తాను, ఆయనకు జాట్ కథనే చెప్పానని చెప్పాడు.
బాలయ్యకు కూడా జాట్ కథ నచ్చిందని, కానీ అఖండ తర్వాత ఫ్యాన్స్ అంచనాలు విపరీతంగా పెరిగాయని, వాటిని రీచ్ అవాలంటే ఫ్యాక్షన్ బ్యాక్‌డ్రాప్ స్టోరీ అయితే బావుంటుందని బాలయ్య అనడంతో జాట్ ను పక్కన పెట్టి వీర సింహారెడ్డిని తీశానని చెప్పాడు. వీర సింహారెడ్డి సినిమా కూడా బాలయ్య కెరీర్లో మంచి హిట్ గానే నిలిచింది. ఇంకా చెప్పాలంటే వీర సింహారెడ్డిలో బాలయ్యను ప్రెజెంట్ చేసిన విధానం, ఆ సినిమాను తెరకెక్కించిన విధానం వల్లే మైత్రీ నిర్మాతలు గోపీచంద్ కు మరో ఛాన్స్ ఇచ్చి ఏకంగా బాలీవుడ్ హీరోని చేతిలో పెట్టారు.