ఆరు భాషల్లో ఆస్కార్ ఎంట్రీ చిత్రం!
99వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్స్) ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ `గోంధళ్` ప్రపంచవ్యాప్త విడుదలకు సమాయత్తమవుతోంది.
99వ అకాడమీ అవార్డుల్లో (ఆస్కార్స్) ఉత్తమ అంతర్జాతీయ చిత్రం విభాగంలో భారతదేశం తరఫున అధికారిక ఎంట్రీగా ఎంపికైన మరాఠీ సైకలాజికల్ థ్రిల్లర్ `గోంధళ్` ప్రపంచవ్యాప్త విడుదలకు సమాయత్తమవుతోంది. సంతోష్ దవాఖర్ తెరకెక్కించిన ఈ జానపద నేపథ్య చిత్రం, థియేటర్లలో భారీ స్థాయిలో విడుదలకాకముందే ప్రేక్షకులలో ఉత్సాహాన్ని పెంచేందుకు ప్రత్యేక ప్రదర్శనలను సిద్ధం చేస్తోంది.
ఈ చిత్రం ఆరు విభిన్న భాషల్లో ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. అయితే అంతకంటే ముందే భారతదేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో అక్టోబర్ 9 నుంచి ప్రత్యేక పెయిడ్ ప్రివ్యూ షోలను నిర్వహిస్తున్నట్లు నిర్మాతలు ప్రకటించారు. ముంబై, పూణే, ఢిల్లీ, చెన్నై, హైదరాబాద్ , బెంగళూరు నగరాల్లో ప్రివ్యూ ప్రదర్శనలు అందుబాటులోకి రానున్నాయి. మరాఠీ మాతృకగా రూపొందినా? ఈ సినిమా నేపథ్యం , కథాంశం పాన్-ఇండియా ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉండటంతో ఆరు భాషల్లో డబ్బింగ్ చేసి విడుదల చేస్తున్నారు.
ప్రాంతీయ భాషా చిత్రాలకు దేశవ్యాప్తంగా పెరుగుతున్న ఆదరణను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో వివిధ ప్రాంతాల అభిమానులు తమ సొంత భాషలోనే ఈ థ్రిల్లింగ్ అనుభవాన్ని పొందే అవకాశం లభిస్తుంది. చిత్ర కథ విషయానికి వస్తే `గోంధళ్` గ్రామీణ జానపద ఆచారాలు, సాంస్కృతిక నమ్మకాలు, మానవ మనస్తత్వాల చుట్టూ తిరిగే విలక్షణమైన సైకలాజికల్ థ్రిల్లర్. గ్రామీణ ప్రాంతాలలో నివసించే ప్రజల నమ్మకాలు, సంస్కృతిని సంతోష్ దవాఖర్ ఎంతో సహజంగా తెరకెక్కించారు.
ఈ సినిమా గతంలో 2025 నవంబర్ 14న పరిమిత థియేటర్లలో విడుదలై విమర్శకుల నుంచి విశేష ప్రశంసలు అందుకుంది. భారతదేశం తరఫున ఆస్కార్ బరిలోకి దిగిన నాలుగో మరాఠీ చిత్రంగా `గోంధళ్` చారిత్రక రికార్డు సృష్టించింది. గతంలో `శ్వాస్` , `హరిశ్చంద్రాచి ఫ్యాక్టరీ`, `కోర్ట్` చిత్రాలు మాత్రమే ఆస్కార్ రేసులో భారత అధికారిక ఎంట్రీలుగా నిలిచాయి. ఇప్పుడు ఆ ప్రతిష్టాత్మక జాబితాలో `గోంధళ్` చేరడం మరాఠీ చిత్రసీమకు గర్వకారణంగా మారింది.
ఆస్కార్ వేదికపై భారతదేశ ప్రతిష్టను చాటేందుకు సిద్ధమవుతున్న ఈ చిత్రంపై సినీ వర్గాల్లోనూ, ప్రేక్షకుల్లోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. హైదరాబాద్, చెన్నై వంటి దక్షిణాది నగరాల్లోనూ ప్రివ్యూలు ఏర్పాటు చేస్తుండటంతో తెలుగు సినీ ప్రియులు కూడా ప్రదర్శనల కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అక్టోబర్ 9న ప్రారంభమయ్యే ప్రివ్యూల అనంతరం చిత్రం బహుభాషల్లో థియేటర్లలోకి రానుంది.