సూర్యుడినే మింగిన అనకొండ.. వార్నర్ బ్రదర్స్ కథ ముగించిన నెట్ ఫ్లిక్స్!
ఇది ఇప్పటివరకూ హిస్టరీలో కనీవినీ ఎరుగని బిగ్ డీల్. ఏకంగా సూర్యుడినే మింగిన అనకొండ స్టోరి ఇది.;
ఇది ఇప్పటివరకూ హిస్టరీలో కనీవినీ ఎరుగని బిగ్ డీల్. ఏకంగా సూర్యుడినే మింగిన అనకొండ స్టోరి ఇది. ప్రపంచంలోని మెర్జర్ ఒప్పందాల్లోనే అసాధారణ పరిణామంపై ఇప్పుడు సర్వత్రా ఆసక్తికర చర్చ సాగుతోంది. దాదాపు వందేళ్లు పైగా చరిత్ర కలిగి ఉన్న ప్రఖ్యాత హాలీవుడ్ సినీనిర్మాణ సంస్థ వార్నర్ బ్రదర్స్‌ని, దాని అనుబంధ స్టూడియోలను ఓటీటీ దిగ్గజం నెట్ ఫ్లిక్స్ కొనుగోలు చేయడం సంచలనంగా మారింది.
ఇప్పటివరకూ డిజిటల్ రంగంలో మాత్రమే హవా సాగిస్తున్న నెట్ ఫ్లిక్స్ ఈ డీల్‌తో కార్పొరెట్ ప్రపంచంలో విస్మయం కలిగించింది. ఇప్పుడు అధికారికంగా నెట్ ఫ్లిక్స్ థియేటర్ రంగాన్ని గుప్పిట పట్టబోతోంది. డిజిటల్ నాదే... థియేటరూ నాదే! అనే ప్రాతిపాదికన పూర్తి సముపార్జన కోసం ఉన్న అతిపెద్ద దారిని కొనేసింది. వార్నర్ బ్రదర్స్ లాంటి దిగ్గజ సంస్థతో నెట్ ఫ్లిక్స్ కుదుర్చుకున్న ఈ ఒప్పందం విలువ సుమారు 7.8 లక్షలు కోట్లు. నెట్ ఫ్లిక్స్ అధికారికంగా $82.7 బిలియన్లకు ఈ సంస్థను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై వార్నర్ బ్రదర్స్ పేరుతో నిర్మించే సినిమాలు, HBO మ్యాక్స్ - హెచ్‌బివో సహా స్టూడియోలను తన గుప్పిట్లోకి తెచ్చుకుంది.
ఇది ప్రపంచ సినిమా చరిత్రలో ఇప్పటివరకు జరిగిన అతిపెద్ద ఒప్పందాలలో ఒకటి. నెట్‌ఫ్లిక్స్ ఈ కొనుగోలును ఎంతటి ప్రతిష్టాత్మకంగా భావించిందో దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న గొప్ప కథలను చెప్పే రెండు దిగ్గజ సంస్థలు కలిసి వస్తున్నాయని డబ్ల్యూబిడి సీఈవో డేవిడ్ జాస్లావ్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.
ఒక శతాబ్దానికి పైగా వార్నర్ బ్రదర్స్ ప్రేక్షకులకు అద్భుతమైన వినోదాన్ని అందించింది. ప్రపంచంలోని మారుమూల ప్రదేశాలలో సైతం వార్నర్ బ్రదర్స్ పేరు తెలియని వారు లేరంటే అతిశయోక్తి కాదు. ఈ సంస్థ ప్రపంచ సంస్కృతిని నిరంతరాయంగా వెండితెరపై ప్రదర్శిస్తుంది. ఇప్పుడు అలాంటి ప్రతిష్ఠాత్మక సంస్థను విలీనం చేయడం ద్వారా నెట్‌ఫ్లిక్స్ తన స్థాయిని అమాంతం పెంచుకుంది. ఇప్పుడు వార్నర్ బ్రదర్స్ సాంప్రదాయాన్ని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకెళతామని కూడా నెట్ ఫ్లిక్స్ ఆనందం వ్యక్తం చేసింది.
సినిమాల నిర్మాణం, పంపిణీ రంగంలో నెట్‌ఫ్లిక్స్ వేసిన మొదటి ప్రధాన అడుగు ఇది. భవిష్యత్తులో వార్నర్ బ్రదర్స్ నిర్మాణ కార్యకలాపాలలో కొన్ని మార్పు చేర్పులు ఉండేందుకు ఆస్కారం ఉంది. అయితే హద్దులు దాటకుండా వార్నర్ బ్రదర్స్ అద్భుతమైన అభిరుచిని నెట్ ఫ్లిక్స్ కూడా మునుముందు కొనసాగించి, చరిత్ర సృష్టించే సినిమాలను అందించాలని ప్రజలు కోరుకుంటున్నారు.