మేడే రిలీజ్‌: మండే ఎండ‌ల్లో కూల్ విక్ట‌రీ ఎవ‌రి ఖాతాలో?

మే డే సుదీర్ఘ వారాంతాన్ని పురస్కరించుకుని భార‌త‌దేశంలోని ప‌లు భాష‌ల నుంచి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి.;

Update: 2026-04-30 04:05 GMT

మే డే సుదీర్ఘ వారాంతాన్ని పురస్కరించుకుని భార‌త‌దేశంలోని ప‌లు భాష‌ల నుంచి సినిమాలు థియేటర్లలో సందడి చేయబోతున్నాయి. అర‌డ‌జ‌ను పైగా సినిమాలు ఈ వారంతంలో ఎలాంటి ఫ‌లితాన్ని అందుకుంటాయో చూడాల‌నే ఉత్కంఠ ప‌రిశ్ర‌మ‌ల్లో నెల‌కొంది. వివ‌రాల్లోకి వెళితే...

గాయపడ్డ సింహం (తెలుగు):

యువ ప్ర‌తిభావంతుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ కామెడీ ఎంటర్‌టైనర్‌పై మంచి అంచనాలు ఉన్నాయి. నటుడిగా తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్న తరుణ్ భాస్కర్ దీనిపై చాలా హోప్స్ పెట్టుకున్నారు. ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు తన ఎస్‌వీసీ సినిమాస్ ప‌తాకంపై విడుదల చేస్తున్నారు. త‌రుణ్ భాస్క‌ర్ ద‌ర్శ‌కుడిగా రాణించారు.. ఇప్పుడు న‌టన‌లోను ప్ర‌తిభ‌ను క‌న‌బ‌రుస్తున్నారు. `గాయ‌ప‌డ్డ సింహం` టీజ‌ర్ ట్రైల‌ర్లు ఆక‌ట్టుకున్నాయి.. ఫ‌లితం ఎలా ఉంటుందో వేచి చూడాల్సి ఉంటుంది.

జెట్ లీ (తెలుగు):

ప్రముఖ కమెడియన్ సత్య తొలిసారి హీరోగా నటిస్తున్న `జెట్ లీ` చిత్రాన్ని `మత్తు వదలరా` ఫేమ్ రితేష్ రాణా తెరకెక్కించారు. మైత్రీ మూవీ మేకర్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థ మద్దతు ఉండటంతో ఈ కామెడీ రైడ్‌పై ఇండస్ట్రీలో ఆసక్తి నెలకొంది. ఇప్ప‌టికే టీజ‌ర్ ట్రైల‌ర్ ప్ర‌తిదీ క్యూరియాసిటీ పెంచాయి. క‌డుపుబ్బా న‌వ్వుకోవ‌డానికి కావాల్సినంత హాస్యం ఇందులో ఉంది. ముఖ్యంగా స‌త్యా ఇప్ప‌టికే విజ‌య‌వంత‌మైన హాస్య న‌టుడు. సుదీర్ఘ అనుభ‌వం అత‌డి సొంతం. అందువ‌ల్ల అత‌డు క‌థానాయ‌కుడిగాను మ్యాజిక్ చేస్తాడ‌ని అభిమానులు న‌మ్ముతున్నారు. ఒక హాలీవుడ్ యాక్ష‌న్ హీరో పేరును టైటిల్ గా పెట్ట‌డంతో ఇది వేగంగా యూత్ కి చేరువైంది. స‌త్య థియేట‌ర్ల‌లో ఎలాంటి మ్యాజిక్ చేస్తారో వేచి చూడాలి.

క‌ర‌ (తమిళం/తెలుగు):

కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన క‌ర క‌ల్ట్ జాన‌ర్ లో వ‌స్తోంది. ఈ చిత్రం మే 1వ తేదీన తమిళంతో పాటు తెలుగులోనూ భారీ స్థాయిలో విడుదలవుతోంది. బ్యాంక్ దోపిడీ నేప‌థ్యం ట్రైల‌ర్ లో హైలైట్ అయినా కానీ.. దీనివెన‌క ఒక సామాన్యుడి కుటుంబం ఈతిబాధ‌లు ఎమోష‌న్స్ దాగి ఉంటాయ‌ని నిర్మాత‌లు ప్ర‌చారం చేసారు. కంటెంట్ ఆక‌ర్ష‌ణీయంగా ఉంది. ఫ‌లితం ఎలా ఉండ‌నుందో వేచి చూడాలి.

ఏక్ దిన్ (హిందీ): బాలీవుడ్ స్టార్ ఆమిర్ ఖాన్ కుమారుడు జునైద్ ఖాన్ ఈ చిత్రంతో నిరూపించుకోవాల‌ని గ‌ట్టి ప్ర‌య‌త్నం చేస్తున్నారు. జునైద్ న‌టించిన ల‌వ్ యాపా చిత్రం ఫ్లాపైంది. అయినా ఈసారి అత‌డు ఒక రొమాంటిక్ డ్రామాతో నిరూపించే ప్ర‌య‌త్నం చేస్తున్నారు. అమీర్ ఖాన్ ఇప్ప‌టికే ఈ చిత్రానికి భారీ స్థాయిలో ప్ర‌చారం చేసారు. ముఖ్యంగా టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరోయిన్ సాయి పల్లవి జునైద్ స‌ర‌స‌న న‌టించ‌డం ప్ర‌ధాన ఆక‌ర్ష‌ణ‌గా మారింది. ఈ రొమాంటిక్ డ్రామా మే 1న ప్రేక్షకుల ముందుకు రానుంది.

పేట్రియాట్ (మలయాళం):

ఈ వీకెండ్ లో అత్యంత భారీ విజువ‌ల్స్ తో వ‌స్తున్న సినిమా పేట్రియాట్. మలయాళ చిత్ర పరిశ్రమకు చెందిన ముగ్గురు దిగ్గజాలు మమ్ముట్టి, మోహన్ లాల్, ఫహద్ ఫాసిల్ కలిసి నటించిన ఈ ప్రతిష్టాత్మక చిత్రం మే 1న విడుదలవుతోంది. అయితే దీని తెలుగు వెర్షన్ మాత్రం కొంత ఆలస్యంగా విడుదల కానుంది. ఇప్ప‌టికే ట్రైల‌ర్ వెబ్ లో దూసుకెళ్లింది. మాస్ క్లాస్ అంద‌రికీ న‌చ్చే సినిమా ఇద‌ని విజువ‌ల్స్ చెబుతున్నాయి.

రాజా శివాజీ:

రితేష్ దేశ్ ముఖ్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తున్న `రాజా శివాజీ` మ‌హారాష్ట్ర స‌హా ప‌లు మెట్రో న‌గ‌రాల‌లో మే1న‌ అత్యంత భారీగా విడుద‌ల కానుంది. ఈ సినిమా తెలుగు వెర్ష‌న్ గురించి స‌మాచారం లేదు కానీ.. హిందీ, మ‌రాఠా బెల్ట్ లో ఇది భారీగా విడుద‌ల కానుంది. జెనీలియా- రితేష్ స్వ‌యంగా నిర్మించిన ఈ చిత్రం ఛ‌త్ర‌ప‌తి శివాజీ మ‌హారాజ్ జీవిత‌క‌థ‌తో రూపొందింది.

ఇతర విడుదలలు:

కన్నడ చిత్రం `కేడీ: ది డెవిల్` కూడా తెలుగు రాష్ట్రాల్లో విడుదలవుతోంది. ఈ డబ్బింగ్ చిత్రాలన్నీ మల్టీప్లెక్స్‌లలో ప్రధానంగా ప్రదర్శితం కానున్నాయి.

Tags:    

Similar News