ఫిలింఛాంబర్ సీటుపై వ్యామోహం దేనికో?
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎన్నికలు నేడు రసవత్తరంగా మారాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వేదికగా జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది.;
ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికలు ఎన్నికలు నేడు రసవత్తరంగా మారాయి. హైదరాబాద్‌లోని ఫిల్మ్ ఛాంబర్ వేదికగా జరుగుతున్న ఈ పోలింగ్ ప్రక్రియ మధ్యాహ్నం ఒంటిగంటతో ముగిసింది. ఈ ఎన్నికల ఫలితాలు ఈ రోజు సాయంత్రం వెలువడనున్నాయి. ఫిల్మ్ ఛాంబర్‌లో ప్రధానంగా నాలుగు సెక్టార్ల నుంచి ఈ పోటీ ఉంటుందన్నది తెలిసినదే. నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్, స్టూడియో సెక్టార్ విభాగాల నుంచి మొత్తం 3,355 మంది సభ్యులు ఓటింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ ఎన్నికల ద్వారా ఛాంబర్ అధ్యక్ష, కార్యదర్శులతో పాటు 32 మంది ఎగ్జిక్యూటివ్ కమిటీ (EC) మెంబర్స్‌ని ఎన్నుకుంటారు. నిబంధనల ప్రకారం, ఈసారి అధ్యక్ష పదవికి ఎగ్జిబిటర్స్ సెక్టార్ నుంచి అభ్యర్థిని ఎంపిక చేయనున్నారు.
ఈసారి పోటీ సరళిని పరిశీలిస్తే, రెండు వర్గాల మధ్య పోరు రసవత్తరంగా మారిందని ఛాంబర్ వర్గాలు చెబుతున్నాయి. ప్రధానంగా మన ప్యానెల్, ప్రోగ్రెసివ్ ప్యానెల్ మధ్య గట్టి వార్ నడిచింది. మన ప్యానెల్ తరపున నిర్మాతలు సి.కళ్యాణ్, చదలవాడ శ్రీనివాసరావు, ప్రసన్నకుమార్ వంటి సీనియర్లు ఉన్నారు. అయితే పని చేసే నిర్మాతలు అంతా ఒక వేదిక అంటూ, ప్రోగ్రెసివ్ ప్యానెల్ ఇప్పటికే ప్రచారం సాగించింది. టాలీవుడ్ అగ్ర నిర్మాతలు అంతా ఏకమై ఈ ప్యానెల్‌కు మద్దతు ఇచ్చారు. ఇందులో అల్లు అరవింద్, దిల్ రాజు, సురేష్ బాబు, దాము, రవిశంకర్ వంటి అగ్ర నిర్మాతలు కీలక పాత్రను పోషించారు.
చిన్న నిర్మాతల సమస్యల పరిష్కారమే అజెండాగా మన ప్యానెల్ ఓట్లు కావాలని సభ్యులను కోరగా, పరిశ్రమను అభివృద్ధి చేయడమే ధ్యేయంగా ప్రోగ్రెసివ్ ప్యానెల్ ప్రచారం సాగించింది. ఎన్నకలు ఇప్పటికే ముగిసాయి. సాయంత్రం ఫలితం వెలువడ నుండగా, ఫిలింఛాంబర్ రాజకీయాలపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
3355 ఓట్లు 4 యూనిట్లకు ఈ ఎన్నికలు జరగగా, ఈసారి పోటీలో మాజీ అధ్యక్షుడు భరత్ భూషణ్ కూడా ఉన్నారు.థియేటర్ల బంద్, ఎగ్జిబిటర్ల సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఆయన ప్రచారం సాగించారు. ఇక పోటీబరిలో ఉన్న అగ్ర నిర్మాతలు ఛాంబర్ పదవులపై కన్నేసారు. అయితే తెలుగు చిత్రసీమలో ఇంత ప్రతిష్టాత్మకంగా ఈ ఎన్నికలు జరగడానికి కారణమేమిటి? అంటే... నిజానికి అన్ని శాఖల్ని అదుపులో ఉంచేది ఫిలింఛాంబర్ గనుకనే. ఛాంబర్ నిర్ణయాలే అందరూ అమలు చేయాల్సి ఉంటుంది. అందుకే ఈసారి క్యాంప్ రాజకీయాలు భీకరంగా సాగాయి. ప్రోగ్రెస్సివ్ ప్యానెల్ తరపున పలువురు అగ్ర నిర్మాతల వెంట ఉండే చోటా నిర్మాతలు కూడా చాలా ఉద్వేగంగా ప్రచారం సాగించారు.