పవన్ ఫ్యాన్స్ ను అన్ బ్లాక్ చేసిన హరీష్ శంకర్.. అసలేం జరిగింది?

ఇప్పుడు తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌ ను ఉద్దేశించి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టాడు.;

Update: 2026-01-25 05:54 GMT

సోషల్ మీడియాలో అరుదైన పరిణామం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా అభిమానులు హీరోలు, దర్శకులను విమర్శించడం, ట్రోలింగ్ చేయడం తరచూ కనిపిస్తుంటుంది. కానీ తొలిసారి ఓ దర్శకుడిని మమ్మల్ని అన్‌ బ్లాక్ చేయండి అంటూ అభిమానులే రిక్వెస్ట్ చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఆ దర్శకుడు ఎవరంటే.. స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్.

ఇప్పటికే టాలీవుడ్ లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న హరీష్ షంకర్.. కమర్షియల్ సినిమాలకు పెట్టింది పేరు. సోషల్ మీడియాలో కూడా ఎప్పుడూ చురుగ్గా ఉంటారు. అయితే కొన్ని కారణాల వల్ల పవన్ కళ్యాణ్ అభిమానులతో ఆయనకు స్వల్ప విభేదాలు చోటుచేసుకున్నట్లు అప్పట్లో కనిపించింది. కొందరు అభిమానులు సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు చేశారు.

దీంతో అవి తన వర్క్ పై ప్రభావం చూపకూడదనే ఉద్దేశంతో హరీష్ శంకర్ అప్పుడు పలువురు అకౌంట్లను బ్లాక్ చేశారు. ఆ విషయం అప్పట్లో సోషల్ మీడియాలో పెద్ద దుమారమే రేపింది. కానీ కాలం మారింది.. పరిస్థితి కూడా మారింది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ హీరోగా హరీష్ శంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ పై అంచనాలు రోజు రోజుకీ పెరుగుతున్నాయి.

ఇప్పటికే సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్, పోస్టర్లు, మ్యూజిక్ అప్డేట్స్ సినిమాపై క్రేజ్‌ ను మరింత పెంచాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ స్టైలిష్ లుక్, పవర్‌ ఫుల్ యాక్షన్ సీన్లు అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఆ సినిమా కంటెంట్ చూసిన తర్వాత గతంలో విమర్శలు చేసిన అభిమానులే ఇప్పుడు దర్శకుడిపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు.

ఇప్పుడు తాజాగా ఓ అభిమాని సోషల్ మీడియాలో హరీష్ శంకర్‌ ను ఉద్దేశించి బహిరంగంగా క్షమాపణలు చెబుతూ ఒక పోస్ట్ పెట్టాడు. "మా అభిమానుల తరఫున క్షమించండి సార్. గతంలో జరిగిన తప్పులను మర్చిపోయి మమ్మల్ని అన్‌ బ్లాక్ చేయండి. ఇప్పుడు అందరూ కలిసి ఉస్తాద్ భగత్ సింగ్ మూవీని గ్రాండ్ గా సెలబ్రేట్ చేద్దాం" అంటూ ఆయనకు రిక్వెస్ట్ చేశాడు. ఆ పోస్ట్ క్షణాల్లోనే వైరల్‌ గా మారింది.

దానికి హరీష్ శంకర్ రెస్పాన్స్ అందరి మనసులు గెలుచుకుంది. "పాత విషయాలు మర్చిపోదాం, ఇప్పుడు సినిమా పండుగ జరుపుకుందాం" అంటూ ఆ అభిమాని అకౌంట్‌ తో పాటు గతంలో బ్లాక్ చేసిన పలువురు అకౌంట్లను అన్‌ బ్లాక్ చేసినట్టు సమాచారం. దర్శకుడి పెద్ద మనసుతో తీసుకున్న నిర్ణయం అభిమానులను మరింత ఆకట్టుకుంది. సోషల్ మీడియాలో ప్రశంసల వెల్లువ కొనసాగుతోంది. ఇదే నిజమైన పెద్దమనసని, సినిమా కోసం అందరం ఒక్కటవ్వాలని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. ఒకప్పుడు నెగెటివిటీతో మొదలైన వ్యవహారం ఇప్పుడు ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా చుట్టూ పండుగ వాతావరణాన్ని తీసుకురావడం విశేషంగా మారింది.

Tags:    

Similar News