రీ-రిలీజ్‌తో ఈవీవీ మ్యాజిక్ మ‌ళ్లీ రిపీట్ అవుతుందా?

డైరెక్ట‌ర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్టైన్మెంట్ మూవీ ఆరుగురు పతివ్రతలు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది.

Update: 2026-07-01 09:40 GMT

టాలీవుడ్‌లో రీ రిలీజ్‌ల హవా రోజురోజుకూ మరింత బలపడుతోంది. ఒకప్పుడు బాక్సాఫీస్‌ను ఊపేసిన క్లాసిక్ సినిమాలు కొత్త టెక్నిక‌ల్ హంగులతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తుండగా, ఇప్పుడు ఆ లిస్ట్ లో మరో గుర్తుండిపోయే సినిమా చేరింది. డైరెక్ట‌ర్ ఈవీవీ సత్యనారాయణ తెరకెక్కించిన ఫ్యామిలీ ఎంట‌ర్టైన్మెంట్ మూవీ ఆరుగురు పతివ్రతలు మరోసారి వెండితెరపై సందడి చేసేందుకు సిద్ధమైంది. ఈ విషయాన్ని చిత్రబృందం స్పెష‌ల్ పోస్టర్‌తో రిలీజ్ చేయ‌గా, అఫీషియ‌ల్ రీరిలీజ్ డేట్ కూడా త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానుంది.

2004లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో తన భిన్నమైన కథనం, బోల్డ్ ట్రీట్‌మెంట్, కుటుంబ నేపథ్యంలో నడిచే వినోదంతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. పెళ్లి తర్వాత భార్యాభర్తల మధ్య ఏర్పడే అపార్థాలు, అనుమానాలు, అహంభావాలు, పరస్పర అవగాహన వంటి అంశాలను హాస్యంతో మేళవిస్తూ ఈవీవీ తనదైన శైలిలో కథను నడిపించారు. నవ్వులు పంచుతూనే కుటుంబ బంధాల విలువను గుర్తుచేసే విధంగా సినిమా సాగడం అప్పటి ప్రేక్షకులను ఆకట్టుకుంది. కథలో ప్రధానంగా ఆరుగురు మహిళల జీవితాలే కేంద్రబిందువుగా ఉంటాయి. చిన్ననాటి స్నేహితురాళ్లు సంవత్సరాల తర్వాత ఒక సందర్భంలో కలుసుకుని, తమ తమ వైవాహిక జీవితాల్లో ఎదురైన అనుభవాలను ఒకరితో ఒకరు పంచుకుంటారు. ప్రతి కుటుంబంలో ఉండే విభిన్న పరిస్థితులు, భర్తల వ్యక్తిత్వాల్లో కనిపించే తేడాలు, వాటి ప్రభావం భార్యల జీవితాలపై ఎలా పడుతుందనే అంశాలను వినోదాత్మకంగా చూపించడం ఈ సినిమాకు మెయిన్ ఎట్రాక్ష‌న్ గా నిలిచింది. ఒకే అంశాన్ని ఆరు కోణాల్లో చూపించిన కథనం ప్రేక్షకులను ఆలోచింపజేస్తూనే అలరించింది.

ఈ సినిమా మరో విశేషం ఏంటంటే, డైరెక్ట‌ర్ ఈవీవీ ఒకేసారి పలువురు కొత్త నటీనటులకు ఈ సినిమా ద్వారా అవకాశం కల్పించడం. దాదాపు 42 మంది కొత్త న‌టీన‌టుల‌ను పరిచయం చేస్తూ కథకు సహజత్వాన్ని తీసుకొచ్చారు. వీరితో పాటు ఎల్.బి. శ్రీరామ్, చలపతి రావు, శ్రీకృష్ణ కౌశిక్ తదితరులు తమ పాత్రలతో సినిమాకు మరింత బలం చేకూర్చారు. కమలాకర్ స్వరపరిచిన సంగీతం, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కథలోని ఎమోష‌న్స్ కు తగ్గట్టుగా నిలిచాయి.

ప్రస్తుత కాలంలో రీ రిలీజ్‌లకు మంచి రెస్పాన్స్ లభిస్తున్న నేపథ్యంలో ఆరుగురు పతివ్రతలు పై కూడా ఆసక్తి పెరుగుతోంది. ముఖ్యంగా అప్పట్లో ఈ సినిమాను థియేటర్లలో చూసిన ఆడియ‌న్స్ మరోసారి బిగ్ స్క్రీన్ పై చూడాలని ఎదురుచూస్తుండగా, నేటి యువత కూడా ఈవీవీ కామెడీ శైలిని ఆస్వాదించేందుకు ఆసక్తి చూపిస్తోంది. అల్లరి నరేష్ బ‌ర్త్ డే సంద‌ర్భంగా రిలీజైన రీ రిలీజ్ పోస్టర్ ఈ సినిమాపై డిస్క‌ష‌న్ ను మరింత వేగవంతం చేసింది. ఒక తరం ప్రేక్షకులను నవ్వించిన ఈ సినిమా, నేటి తరాన్ని కూడా అదే స్థాయిలో ఆకట్టుకుంటుందా? రీ రిలీజ్ ట్రెండ్‌లో ఈ మూవీ మ‌రో రికార్డును నమోదు చేస్తుందా? అనే ఆసక్తి ఇప్పుడు సినీ వర్గాల్లో నెలకొంది.

Tags:    

Similar News