ఆ సినిమా టాక్‌తో హిట్, కలెక్షన్స్‌తో ఫ్లాప్..!
తాజాగా బాలీవుడ్ నుంచి 'హక్' అనే సినిమా వచ్చింది. ఈ కోర్ట్ రూం డ్రామా మూవీలో ప్రధాన పాత్రలో ఇమ్రాన్ హష్మీ, యామి గౌతమ్‌లు నటించారు.;
బాలీవుడ్‌లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయి. ముఖ్యంగా మీడియం రేంజ్ సినిమాలను ప్రేక్షకులు కనీసం పట్టించుకోవడం లేదు. ఓటీటీ ప్రభావం పెరిగిన తర్వాత థియేట్రికల్ రిలీజ్ చేయాలంటే నిర్మాతలు భయపడే పరిస్థితి నెలకొంది. సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు వస్తారా లేదా అనే టెన్షన్ కనిపిస్తోంది. గత ఐదు సంవత్సరాలుగా బాలీవుడ్ నుంచి వచ్చే సినిమాల్లో ఎక్కువ శాతం థియేటర్ల వద్ద తీవ్ర నిరాశ ను మిగిల్చిన విషయం తెల్సిందే. కొన్ని సినిమాలు ఆశ్చర్యకరంగా థియేట్రికల్ రిలీజ్ సమయంలో పాజిటివ్ టాక్ దక్కించుకున్నా వసూళ్ల విషయంలో తీవ్రంగా నిరాశ పరిచిన సందర్భాలు ఉన్నాయి. స్టార్ హీరోల సినిమాలు హిట్ టాక్ వస్తే వసూళ్లు నమోదు చేయడం కామన్, కానీ మీడియం రేంజ్ సినిమాలు పర్వాలేదు, హిట్ అనే టాక్ దక్కించుకున్నా కూడా కొన్ని సినిమాలు మినిమం వసూళ్లు రాబట్టలేక పోవడం జరిగింది.
ఇమ్రాన్ హస్మీ హక్ సినిమా టాక్..
తాజాగా బాలీవుడ్ నుంచి 'హక్' అనే సినిమా వచ్చింది. ఈ కోర్ట్ రూం డ్రామా మూవీలో ప్రధాన పాత్రలో ఇమ్రాన్ హష్మీ, యామి గౌతమ్‌లు నటించారు. సినిమా ప్రారంభం సమయంలోనే అందరి దృష్టిని ఆకర్షించింది. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఈ సినిమా గురించి చర్చ జరిగింది. విడుదల సమయంలో మీడియాలోనూ ఈ సినిమా గురించి మంచి పబ్లిసిటీ కనిపించింది. దాంతో సినిమాకు మినిమం ఓపెనింగ్ దక్కుతుందని అంతా భావించారు. కానీ మొదటి రోజు రూ.2 కోట్లు రాబట్టేందుకు హక్ కిందా మీదా పడ్డట్లు అయింది. సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో వీకెండ్ వరకు పుంజుకుంటుందని అంతా భావించారు. కానీ అది కూడా జరగలేదు. సినిమా వీకెండ్ పూర్తి అయ్యేప్పటికి కనీసం రూ.10 కోట్లను కూడా రాబట్టలేకపోయింది. లాంగ్ రన్‌లో ఈ సినిమా కనీసం రూ.20 కోట్లు అయినా రాబడుతుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.
బాలీవుడ్‌లో మీడియం రేంజ్ మూవీస్ కలెక్షన్స్
ఒకప్పుడు హీరోగా వరుస విజయాలను సొంతం చేసుకున్న ఇమ్రాన్ హష్మీ నటించిన సినిమా కావడంతో పాటు, మంచి కంటెంట్ ఓరియంటెడ్ సినిమా అంటూ ప్రచారం చేయడంతో హక్ సినిమాపై ఆసక్తి పెరిగింది. కానీ సినిమాకు రావాల్సిన వసూళ్లు మాత్రం దక్కలేదు. సౌత్‌లో సినిమాలకు పాజిటివ్ టాక్ వస్తే మినిమం వసూళ్లు నమోదు అవుతాయి. కానీ హక్ సినిమాకు హిట్ టాక్ వచ్చినా కూడా మినిమం వసూళ్లు కాదు కదా, కనీసం ఫ్లాప్ మూవీకి వచ్చే వసూళ్లు కూడా నమోదు కావడం లేదు అనేది హిందీ బాక్సాఫీస్ వర్గాల అభిప్రాయం. ఈ మధ్య కాలంలో హిందీలో ఇలాంటి ఫలితాలు రెగ్యులర్‌గా పునరావృతం అవుతూనే ఉన్నాయి. వరుసగా వస్తున్న ఫ్లాప్స్ తో మీడియం రేంజ్ సినిమాలను విడుదల చేయడానికి నిర్మాతలు భయపడే పరిస్థితి వచ్చింది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మాట్లాడుతున్నారు.
ఇమ్రాన్ హస్మీ గత 15 ఏళ్లుగా...
1985లో జరిగిన యదార్థ సంఘటనల ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. మొహమ్మద్ అహ్మద్ ఖాన్ వర్సెస్ షా బానో బేగం కేసు నుంచి ప్రేరణ పొంది ఈ సినిమాను రూపొందించినట్లు చెబుతున్నారు. మహిళల హక్కులు హరించే విధంగా కొందరు ప్రవర్తిస్తున్నారు అని, వ్యక్తిగత చట్టాలకు సంబంధించిన కీలక విషయాలపై అప్పట్లో జరిగిన వివాదం నేపథ్యంలో హక్ సినిమా రూపొందింది. యదార్థ సంఘటనలకు కల్పిత పాత్రలు జోడించి, కల్పిత స్క్రీన్‌ప్లే జోడించి దర్శకుడు సుపర్ణ్ వర్మ తీసిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో పాజిటివ్ రెస్పాన్స్‌ను దక్కించుకుంది. కానీ వసూళ్ల పరంగా మాత్రం నిరాశ మిగల్చడంతో టాక్ పరంగా హిట్, వసూళ్ల పరంగా ఫ్లాప్ అంటూ హక్ సినిమాను గురించి కొందరు సోషల్ మీడియాలో విశ్లేషిస్తున్నారు. ఇక ఇమ్రాన్ హస్మీ గత 15 ఏళ్లలో ఒక్క హిట్ కూడా దక్కించుకోలేక పోయాడు. ఆయన ఫ్యాన్స్ మరో సినిమా కోసం వెయిట్ చేయాల్సిన పరిస్థితి నెలకొంది.