దుల్కర్ Vs కార్తికేయన్.. ఈసారి ఎవరు నెగ్గుతారో?
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ ప్రముఖ కథానాయకుడు శివ కార్తికేయన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే.;
మాలీవుడ్ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్, కోలీవుడ్ ప్రముఖ కథానాయకుడు శివ కార్తికేయన్ కు ఎలాంటి క్రేజ్ ఉందో అందరికీ తెలిసిందే. ఇప్పటికే వారిద్దరూ వివిధ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు తమ అప్ కమింగ్ మూవీస్ తో బిజీగా ఉన్నారు. పాన్ ఇండియా రేంజ్ లో సినిమాలతో సందడి చేయనున్నారు.
అయితే గత ఏడాది దీపావళి సందర్భంగా బాక్సాఫీస్ వద్ద పోటీ పడ్డ విషయం విదితమే. దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్, శివకార్తికేయన్ లీడ్ రోల్ యాక్ట్ చేసిన అమరన్ సినిమాలు ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. రెండు సినిమాలు కూడా ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్స్ గా నిలిచాయి.
కానీ తెలుగు రాష్ట్రాలతోపాటు తమిళనాడు విషయానికొస్తే.. బాక్సాఫీస్ వద్ద లక్కీ భాస్కర్ చిత్రాన్ని అమరన్ డామినేట్ చేసినట్లు అప్పట్లో టాక్ వచ్చింది. అయితే రిజల్ట్ పరంగా మాత్రం ఇద్దరూ హిట్స్ అందుకున్నారు. ఇప్పుడు మరోసారి తమ చిత్రాలతో బాక్సాఫీస్ వద్ద ఒకే రోజు సందడి చేయనున్నట్లు ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది.
దుల్కర్ సల్మాన్ ఇప్పుడు లీడ్ రోల్ లో కాంత మూవీ చేస్తున్నారు. భాగ్యశ్రీ బొర్సో హీరోయిన్ గా నటిస్తున్నారు. టాలీవుడ్ హల్క్ రానా కీలక పాత్ర పోషిస్తూ.. సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వం వహిస్తున్న ఆ చిత్రం.. పీరియాడిక్ జోనర్ లో డిఫరెంట్ థ్రిల్లర్ గా రూపొందుతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
ఇప్పుడు ఆ మూవీని సెప్టెంబర్ 5వ తేదీన రిలీజ్ చేయాలని మేకర్స్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. త్వరలో అధికారిక ప్రకటన ఇవ్వనున్నారట. అదే రోజు ప్రముఖ దర్శకుడు మురుగదాస్ దర్శకత్వంలో శివ కార్తికేయన్ లీడ్ రోల్ లో నటిస్తున్న మదరాసి చిత్రం రిలీజ్ అవ్వనుంది. ఇప్పటికే మేకర్స్ ఆ విషయాన్ని అధికారికంగా ప్రకటించారు.
దీంతో దుల్కర్ సల్మాన్ కాంత, శివకార్తికేయన్ మదరాసి సెప్టెంబర్ 5న పోటీ పడే అవకాశం ఉందని అర్ధమవుతుంది. ఇప్పటి వరకు చూసుకుంటే కాంతపై మంచి హైప్ నెలకొంది. ఇంకా మదరాసిపై బజ్ క్రియేట్ అవ్వలేదు. అయితే అదే రోజు టాలీవుడ్ యంగ్ హీరో తేజ సజ్జా నటిస్తున్న మిరాయ్ మూవీ కూడా సందడి చేయనుండడం గమనార్హం. మరి ఏ సినిమా ఎలా ఉంటుందో.. దుల్కర్, కార్తికేయన్ లో ఎవరు నెగ్గుతారో చూడాలి.