ఒకే దెబ్బకు రెండు పిట్టలు.. దురంధరుడి మాస్టర్ ప్లాన్
ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ దురంధర్ గ్రాండ్ సక్సెస్ ని ఆస్వాధిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 450 కోట్లు వసూలు చేసి 500 కోట్ల క్లబ్ లో చేరబోతోంది.;
ప్రస్తుతం రణ్ వీర్ సింగ్ దురంధర్ గ్రాండ్ సక్సెస్ ని ఆస్వాధిస్తున్నాడు. ఈ సినిమా ఇప్పటికే 450 కోట్లు వసూలు చేసి 500కోట్ల క్లబ్ లో చేరబోతోంది. టికెట్ విండో వద్ద దూకుడు చూస్తుంటే ఇది మరో 200కోట్లు అదనంగా వసూలు చేసి 700కోట్ల క్లబ్ వరకూ వెళుతుందని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం అవతార్ 3డి రాకతో దురంధర్ స్క్రీన్లు చాలా చోట్ల తగ్గాయి.
ఇకపోతే రణ్ వీర్ సింగ్ తాజాగా ఓ ఆన్ లైన్ డిబేట్ కారణంగా మారోసారి హెడ్ లైన్స్ లోకి వచ్చాడు. అతడు హిందూత్వ అజెండాతో పని చేసే ఆర్.ఎస్.ఎస్ కి అనుకూలంగా చేసిన కామెంట్ అభిమానులను ఆశ్చర్యపరిచింది. అతడు తన భార్య తల నరికి తెస్తే లక్షలు చెల్లిస్తానని బెదిరించిన ఒక మతతత్వ సేవా సంఘానికి అతడు బాసటగా నిలుస్తూ చేసిన వ్యాఖ్యలు చర్చగా మారాయి. ఆన్ లైన్ లో విస్త్రతంగా షేర్ అవుతున్న ఈ వీడియోలో రణ్‌వీర్ సింగ్ ఆర్‌ఎస్‌ఎస్ 100 సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు అభినందిస్తూ కనిపించారు. దేశానికి ఈ సంస్థ చేసిన కృషికి థాంక్స్ చెప్పడమే గాక, భవిష్యత్తులో గౌరవాన్ని ప్రేరేపిస్తూనే ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేసాడు.
అయితే అతడు ఒక మత సంఘానికి ఇలా బహిరంగంగా మద్ధతు పలకడం తీవ్ర దుమారం రేపింది. ఇది చాలా మంది అభిమానులను ఆశ్చర్యపోయేలా చేసింది. గతంలో `పద్మావత్` సినిమా రిలీజ్ సమయంలో దీపిక పదుకొనేను చంపేస్తామంటూ బెదిరింపులకు పాల్పడ్డారు కొందరు ఆర్ఎస్ఎస్ కార్యకర్తలు. అప్పట్లో పద్మావత్ దర్శకుడు భన్సాలీపైనా సెట్లో దాడి జరిగింది. రాజ్ పుత్‌లను కించపరుస్తూ, అల్లాఉద్దీన్ ఖిల్జీని హైలైట్ చేస్తున్నారని పద్మావత్ బృందంపై ఎటాక్ లు జరిగాయి. అయితే అందుకు కారకులైన వారిని ఉపేక్షిస్తూ, వారిని సమర్థిస్తూ ఇప్పుడు రణ్ వీర్ మద్ధతుగా నిలవడాన్ని చాలా మంది నిరసించారు. దీపిక ముక్కు కోస్తామని, చంపుతామని బెదిరించిన వారికి బాసటగా నిలుస్తాడా? అసలు భార్య భద్రత గురించి పట్టించుకోడా? అంటూ రణ్ వీర్ ని చాలా మంది నిలదీశారు.
కొందరు ఆర్.ఎస్.ఎస్ పై రణ్ వీర్ కపట ప్రేమను కురిపిస్తున్నాడని ఇదంతా నాటకం అని అభివర్ణించారు. అతడు అసభ్యకరమైనవాడు.. పిరికి పంద! అంటూ కామెంట్లు చేసారు చాలా మంది. అయితే కొందరు మాత్రం రణ్ వీర్ చర్యలను సునిశితంగా పరిశీలించి అతడు చేసినది సరైనదేనని సమర్థించారు. అతడు ఒకే దెబ్బకు రెండు పిట్టలను పడగొట్టాడు. అతడు తన భార్యకు థ్రెట్ గా మారిన సంస్థతో పొత్తు పెట్టుకోవడం ద్వారా దాని నుంచి భార్యను కాపాడాడు. అలాగే తన బ్లాక్ బస్టర్ సినిమా దురంధర్ సీక్వెల్ పై హిందూ ప్రజలు ఆసక్తిగా ఎదురు చూసేలా చేసాడు! అంటూ విశ్లేషిస్తున్నారు. దురంధర్ చిత్రంలో దాయాది పాకిస్తాన్ ఉగ్ర మాఫియాలపై అరాచకం సృష్టించే భారతీయ వీరుడిగా నటించాడు. దురంధర్ అత్యంత భారీ విజయం సాధించిన నేపథ్యంలో సీక్వెల్ పైనా రణ్ వీర్ టీమ్ దృష్టి సారించింది.
అయితే అతడు ఇలా రాజీకి వచ్చి ఒక మతతత్వ సంస్థతో పొత్తు పెట్టుకోవడంపైనే చాలామంది విమర్శలు గుప్పిస్తున్నారు. వ్యక్తిగత భద్రత కోసం అతడు ఇలాంటి ఆలోచన చేయడాన్ని పలువురు తప్పు పట్టారు. భాజపా-ఎన్డీయే పాలనలో ఉన్న భారతదేశంలో ఎవరికి మద్ధతు పలకాలో వారికి మద్ధతు పలికాడు అంటూ కొందరు విశ్లేషించారు.