శేఖ‌రుడు ఆ సీట్‌ని భ‌ర్తీ చేస్తే ఇక‌ తిరుగే ఉండ‌దు!

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ల‌కు ఇప్పుడు భారీ కొర‌త ఏర్ప‌డుతోందా?.. శ్రీ‌హ‌రి లాంటి ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ లేని లోటు అంద‌రి మ‌దిని తొలిచేస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది.;

Update: 2026-02-04 13:30 GMT

టాలీవుడ్‌లో ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ల‌కు ఇప్పుడు భారీ కొర‌త ఏర్ప‌డుతోందా?.. శ్రీ‌హ‌రి లాంటి ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ ఆర్టిస్ట్ లేని లోటు అంద‌రి మ‌దిని తొలిచేస్తోందా? అంటే అవున‌నే స‌మాధానం వినిపిస్తోంది. కార‌ణం అప్ప‌ట్లో ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన హీరో రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి. త‌న‌ని దృష్టిలో పెట్టుకుని ఆ రోజుల్లో డైరెక్ట‌ర్లు క‌థ‌లు రాసేవారు. త‌ను కుద‌ర‌దంటే ఆ సినిమానే ఉండేది కాదు. అంతగా శ్రీ‌హ‌రి ప‌వ‌ర్ ఫుల్ క్యారెక్ట‌ర్ల విష‌యంలో త‌న‌దైన ముద్ర వేశారు. ఇప్పుడు అలాంటి న‌టుడి అవ‌స‌రం ఇండ‌స్ట్రీకి క‌నిపిస్తోంది.

`మ‌గ‌ధీర‌` శ్రీ‌హ‌రి పోషించిన షేర్ ఖాన్ క్యారెక్ట‌ర్ లేకుండా పోల్చుకోలేం. అదే విధంగా `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`లో శివ‌రామ‌కృష్ణ క్యారెక్ట‌ర్‌లో త‌నని త‌ప్ప మ‌రొక‌రిని చూడ‌లేక‌పోయే వాళ్లం. `ఢీ` శంక‌ర్ గౌడ్‌, కింగ్ జ్ఞానేశ్వ‌ర్ భాయ్‌, డాన్ శీను నర్సింగ్‌, బృందావ‌నం `శివుడు`, తుఫాన్‌లో షేర్‌ఖాన్‌, ఆర్ రాజ్ కుమార్‌లో అజిత్ టాకా..ఇలా ఎన్నో సినిమాల‌కు రియ‌ల్ స్టార్ శ్రీ‌హ‌రి బ్యాగ్ బోన్‌గా నిలిచి ఆ సినిమాల స‌క్సెస్‌ల‌కు కార‌ణ‌మ‌య్యాడు. `ఆర్ రాజ్‌కుమార్‌` సినిమా షూటింగ్ స‌మ‌యంలో తీవ్ర అనారోగ్యానికి గురైన శ్రీ‌హ‌రి అక‌స్మాత్తుగా మృతి చెంద‌డంతో అప్ప‌టి నుంచి ఆ స్థానాన్ని టాలీవుడ్‌లో ఎవ‌రూ భ‌ర్తీ చేయ‌లేక‌పోతున్నారు.

ఇప్ప‌టికీ ఆ సీట్ అలాగే ఖాలీగా ఉంది. ఇప్పుడు అలాంటి ప‌వ‌ర్‌ఫుల్ స‌పోర్టింగ్ క్యారెక్ట‌ర్‌లు చేయ‌గ‌ల న‌టుడు కావాల‌ని రాజ‌మౌళి లాంటి డైరెక్ట‌ర్ నుంచి యంగ్ స్టార్స్‌, డైరెక్ట‌ర్స్ వ‌ర‌కు ఎదురు చూస్తున్నారు. వారంద‌రికి యాంగ్రీ యంగ్‌మెన్ డా. రాజ‌శేఖ‌ర్ గుడ్ న్యూస్ చెప్పేలా క‌నిపిస్తున్నాడు. వెండితెర‌పై యాంగ్రీ యంగ్ మెన్‌గా ప‌వ‌ర్‌ఫుల్ పోలీస్ క్యారెక్ట‌ర్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్‌గా నిలిచిన రాజ‌శేఖ‌ర్ `క‌ల్కి` త‌రువాత హీరోగా ప్ర‌భావం చూపించ‌లేక‌పోతున్నాడు. దీంతో కొంత విరామం తీసుకుని నితిన్ `ఎక్స్ ట్రార్డిన‌రీమెన్‌`లో ఐజీగా న‌టించినా ఫ‌లితం లేకుండా పోయింది.

క్యారెక్ట‌ర్‌ని బ‌లంగా రాయ‌క‌పోవ‌డం, క‌థ‌లో ద‌మ్ములేక‌పోవ‌డంతో రాజ‌శేఖ‌ర్ చేసిన ప్ర‌య‌త్నం ఫ‌లించ‌లేదు. అయితే తాజాగా శ‌ర్వానంద్ హీరోగా రూపొందుతున్న `బైక‌ర్‌`లో రాజ‌శేఖ‌ర్ కీ రోల్ పోషిస్తున్నాడు. బుల్లెట్ సునీల్ అనే ప‌వ‌ర్‌ఫుల్‌ క్యారెక్ట‌ర్‌లో త‌ను క‌నిపించ‌బోతున్నాడు. నేడు ఆయ‌న పుట్టిన రోజు సంద‌ర్భంగా మేక‌ర్స్ ఓ వీడియోని విడుద‌ల చేశారు. ఇందులో రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌ర్‌ని రివీల్ చేశారు. ఫార్మ‌ర్ మోటోక్రాస్ రేస‌ర్ అంటూ ఆయ‌న క్యారెక్ట‌ర్‌కిచ్చిన ఎలివేష‌న్స్ చూస్తుంటే శేఖ‌రుడికి ఇన్నాళ్ల‌కు క‌రెక్ట్ క్యారెక్టర్ ప‌డింద‌నిపిస్తోంది.

ఈ వీడియో చూసిన వారంతా ఇదే మాట అంటున్నారు. శ‌ర్వా బైక్ రేస‌ర్‌గా న‌టిస్తున్న ఈ మూవీలో త‌న‌కు మెంటార్‌గా రాజ‌శేఖ‌ర్ క‌నిపించ‌బోతున్నాడు. ఈ సినిమా వైబ్ చూస్తుంటే బాక్సాఫీస్ వ‌ద్ద బ్లాక్ బ‌స్ట‌ర్ ప‌క్కా అని అర్థ‌మ‌వుతోంది. అదే నిజ‌మై..రాజ‌శేఖ‌ర్ క్యారెక్ట‌ర్ క్లిక్క‌యితే రాజ‌శేఖ‌రుడు రియల్ స్టార్ శ్రీ‌హ‌రి సీటుని భ‌ర్తీ చేయ‌డం ఖాయం అనే టాక్ టాలీవుడ్ వ‌ర్గాల్లో వినిపిస్తోంది. శ‌ర్వాతో క‌లిసి రాజ‌శేఖ‌ర్ న‌టిస్తున్న `బైక‌ర్` ఏప్రిల్ 3న భారీ స్థాయిలో ప్రేక్ష‌కుల ముందుకు రాబోతోంది.

Tags:    

Similar News