మళ్లీ చిక్కుల్లో సీక్వెల్..అర్దంత‌రంగా త‌ప్పుకున్న డైరెక్ట‌ర్!

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `దోస్తానా 2` చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది.

Update: 2026-06-07 02:45 GMT

ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థ ధర్మా ప్రొడక్షన్స్ ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న `దోస్తానా 2` చిత్రం మరోసారి వార్తల్లో నిలిచింది. నిర్మాత కరణ్ జోహార్ ఎంతో కాలంగా ఈ ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాలని ప్రయత్నిస్తున్నప్పటికీ ఏదో ఒక అడ్డంకి ఎదురవుతూనే ఉంది. తాజాగా ఈ చిత్రానికి దర్శకత్వం వహించాల్సిన దర్శకుడు అద్వైత్ చందన్ ఈ ప్రాజెక్ట్ నుండి తప్పుకున్నారు. మేకర్స్‌తో ఏర్పడిన క్రియేటివ్ డిఫ‌రెన్సెస్ వల్లే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు బాలీవుడ్ వర్గాల్లో వినిపిస్తోంది. అద్వైత్ చందన్ కంటే ముందు ఈ సినిమా బాధ్యతలను కొలిన్ డికున్హా చూసు కోవాల్సింది. అయితే ఆయన ఇతర ప్రాజెక్ట్ కమిట్‌మెంట్ల వ‌ల్ల‌ తప్పుకోవడంతో అద్వైత్ చందన్‌ను రంగంలోకి దించారు. ఇప్పుడు అద్వైత్ కూడా ఈ ప్రాజెక్ట్ నుండి నిష్క్రమించడంతో చిత్ర భవిష్యత్తు మళ్లీ అయోమయంలో పడింది. అయితే ఈ నిర్ణయం ఇరువర్గాల మధ్య ఎలాంటి మనస్పర్థలు లేకుండా స్నేహ‌పూర్వకంగానే జరిగిందని సమాచారం. నిజానికి `దోస్తానా 2` సినిమా ప్రయాణం మొదటి నుండి తీవ్రమైన ఒడిదొడుకులతో సాగుతోంది.

2008లో ప్రియాంకా చోప్రా, అభిషేక్ బచ్చన్, జాన్ అబ్రహం ప్రధాన పాత్రల్లో తెర‌కెక్కిన‌ బ్లాక్‌బస్టర్ చిత్రం `దోస్తానా`కు సీక్వెల్‌గా కరణ్ జోహార్ ప్లాన్ చేశారు. 2019లోనే కార్తీక్ ఆర్యన్, జాన్వీ కపూర్, లక్ష్య లతో ఈ సినిమాను అధికారికంగా ప్రకటించి గోవాలో 20 రోజులకు పైగా షూటింగ్ కూడా జరిపారు. కానీ 2021లో కార్తీక్ ఆర్యన్ - కరణ్ జోహార్ మధ్య వచ్చిన విభేదాల కారణంగా కార్తీక్ ప్రాజెక్ట్ నుండి అకస్మాత్తుగా తప్పుకోవడంతో సినిమా పూర్తిగా నిలిచిపోయింది.

అనంత‌రం స్క్రిప్ట్‌ను పూర్తిగా మార్చి, థియేట్రికల్ రిలీజ్ కాకుండా అమెజాన్ ప్రైమ్ వీడియో ఒరిజినల్ ఫిల్మ్‌గా మార్చాలని ధర్మా ప్రొడక్షన్స్ నిర్ణయించింది. ఈ కొత్త వెర్షన్ కోసం టాలెంటెడ్ నటుడు విక్రాంత్ మాస్సే, యువ నటుడు లక్ష్యలతో పాటు 2022 మిస్ ఇండియా వరల్డ్ విజేత సినీ శెట్టిని కథానాయికగా ఎంపిక చేశారు. విక్రాంత్ మాస్సే కూడా తాను మొదటిసారి ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్‌లో స్టైలిష్ లుక్‌లో కనిపించబోతున్నానంటూ గతంలో ఆనందం వ్యక్తం చేశారు. కానీ షూటింగ్ ప్రారంభం కావడానికి ముందే దర్శకుడు మారడం ప్రాజెక్ట్‌కు గట్టి ఎదురుదెబ్బగా చెప్పొచ్చు.

మరో ఆసక్తికర విషయమేమిటంటే? గతంలో వివాదాల కారణంగా విడిపోయిన కరణ్ జోహార్- కార్తీక్ ఆర్యన్ కాలక్రమేణా విభేదాలను పక్కనబెట్టి మళ్లీ స్నేహితులయ్యారు. ప్రస్తుతం వారిద్దరి కాంబినేషన్‌లో `నాగ్‌జిల్లా` తో పాటు మరో సినిమా కూడా చర్చల దశలో ఉంది. పాత మిత్రులు కలిసినప్పటికీ వారు వదిలేసిన `దోస్తానా 2` ప్రాజెక్ట్ మాత్రం కొత్త నటీనటులు, సాంకేతిక నిపుణులతో ముందుకు వెళ్లడానికి ఇప్పటికీ ఇబ్బందులను ఎదుర్కొంటూనే ఉంది. అద్వైత్ చందన్ నిష్క్రమణతో ఈ క్రేజీ సీక్వెల్‌ను ముందుకు నడిపించే సమర్థుడైన కొత్త దర్శకుడి కోసం కరణ్ జోహార్ అన్వేషణ మొదలుపెట్టారు. దశాబ్ద కాలం నాటి విజయవంతమైన ఫ్రాంచైజీని ఎలాగైనా బ్రతికించాలనే పట్టుదలతో ధర్మా ప్రొడక్షన్స్ ఉన్నప్పటికీ పదే పదే మారుతున్న తారాగణం సాంకేతిక నిపుణుల మార్పులు సినిమాపై అంచనాలను ఏ మేరకు ప్రభావితం చేస్తాయో వేచి చూడాలి.

Tags:    

Similar News