కర్ర విరగకూడదు.. పాము చావాలి.. రాజు గారి చాణక్యం!
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక పెద్ద సమస్య లేదా వివాదం తలెత్తినప్పుడు అందులోకి నేరుగా దూరి చేతులు కాల్చుకోవడం అందరికీ ఇష్టం ఉండదు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఏదైనా ఒక పెద్ద సమస్య లేదా వివాదం తలెత్తినప్పుడు అందులోకి నేరుగా దూరి చేతులు కాల్చుకోవడం అందరికీ ఇష్టం ఉండదు. అనవసరమైన వివాదాల కారణంగా పరిశ్రమలో ఉన్న సత్సంబంధాలు దెబ్బతినడం ఏ అగ్ర వ్యాపారికి కూడా మంచిది కాదు. ముఖ్యంగా టాలీవుడ్‌ను శాసించే `మెగా కాంపౌండ్`తో ఎంతటి పెద్ద వ్యూహకర్త అయినా సరే అనుబంధాన్ని నిలబెట్టుకోవాల్సిందే. మెగా హీరోలతో వ్యాపారం అనేది ఇండస్ట్రీలో చాలా కీలకం. అరడజనుకు పైగా స్టార్ హీరోలు ఉన్న ఈ ఒక్క కాంపౌండ్ నుండే థియేటర్లకు అసలైన ఫీడింగ్ లభిస్తుంది. బాక్సాఫీస్ వద్ద థియేటర్లు నిండాలన్నా భారీగా రెవెన్యూ రావాలన్నా మెగా హీరోల చిత్రాలు అత్యంత అవసరం. అందుకే ఏ అగ్ర పంపిణీదారుడు లేదా ఎగ్జిబిటర్ అయినా అడుగు వేసే ముందు ఆచితూచి ఆలోచించుకోవాల్సి ఉంటుంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో నడుస్తున్న ఎగ్జిబిటర్స్ వర్సెస్ నిర్మాతల వివాదంలో టాప్ ఎగ్జిబిటర్ కం పంపిణీదారుడు అయిన దిల్ రాజు అనుసరిస్తున్న తీరు ఇండస్ట్రీలో ప్రధాన చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ (SVC) సంస్థ ద్వారా తెలుగు రాష్ట్రాలలో అనేక సింగిల్ స్క్రీన్ థియేటర్లను లీజుకు తీసుకుని ఎగ్జిబిషన్ రంగాన్ని శాసిస్తున్న దిల్ రాజు.. మరోవైపు తెలంగాణ ఎఫ్‌డీసీ చైర్మన్‌గా, ప్రొడ్యూసర్స్ గిల్డ్‌లో అత్యంత క్రియాశీలక సభ్యుడిగా చాలా బాధ్యాతాయుతమైన పొజిషన్లలో కొనసాగుతున్నారు.
అందుకే ఓవైపు ఎగ్జిబిటర్లతో నిర్మాతల గొడవ ముదురుతున్నా ఆయన ఎక్కడా మీడియా సమావేశాలలో కనిపించలేదు. ఆయన బదులుగా సోదరుడు శిరీష్ ఆ బాధ్యతలను చేపట్టారు. శిరీష్ తన గళాన్ని బలంగా వినిపించడంలో ఎక్కడా తగ్గలేదు. అయితే దిల్ రాజు మాత్రం డైరెక్టుగా మీటింగులకు రాలేదు.
అంతేకాదు.. ఎగ్జిబిటర్ల డిమాండ్ మేరకు పర్సంటేజీ షేరింగ్ విధానానికి నిర్మాతలను ఒప్పించామని అంతా సవ్యంగా జరుగుతోందని చిట్ట చివర్లో మీడియా ముందుకు వచ్చి ప్రకటించిన దిల్ రాజు.. చివరిగా మన సోదరుడు సతీష్ నిర్మించిన పెద్ది సినిమా ఎలాంటి డోఖా లేకుండా విడుదలవుతుందని ధైర్యం నింపారు. ఒకే ఒక్క ప్రకటనతో అటు మెగా కాంపౌండ్ మనసు దోచడమే గాక మెగాభిమానుల్లో హీరో అయ్యారు.
ఇక పవన్ కల్యాణ్ హరిహర వీరమల్లు, చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాల రిలీజ్ చిక్కుల సమయంలో దీనికి కారకుడు దిల్ రాజు అంటూ ఒక వర్గం ప్రచారం చేసింది. ఆ సమయం కూడా దిల్ రాజు తప్పేమీ లేకపోయినా నెగెటివ్ ప్రచారం హోరెత్తింది. అందుకే దిల్ రాజు ప్రస్తుత వివాద సమయంలో ఎంతో జాగ్రత్తగా ఉన్నారు. పరిశ్రమ వర్గాలతో రిలేషన్ షిప్స్ విషయంలో ఎంతో ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇటు నిర్మాతల వైపు కానీ, అటు ఎగ్జిబిటర్ల వైపు కానీ బహిరంగంగా నిలబడకుండా తటస్థ వైఖరిని అవలంబిస్తున్నారు. కర్ర విరగకూడదు.. పాము చావాలి అనే చందంగా ఇండస్ట్రీలోని ఏ ఒక్క పెద్ద కాంపౌండ్‌తోనూ బంధాన్ని పాడుచేసుకోకూడదనేది అతడి అసలు ప్లాన్.
బాధ్యతల విభజన.. పాన్-ఇండియా చిత్రాలపైనే దృష్టి!
దిల్ రాజు ఈ వివాదానికి దూరం జరగడానికి మరో ప్రధాన కారణం, తన సోదరుడు శిరీష్ రెడ్డితో కలిసి చేసుకున్న బాధ్యతల విభజన. ప్రస్తుతం సినిమా డిస్ట్రిబ్యూషన్, ఎగ్జిబిషన్ రంగానికి సంబంధించిన పూర్తి బాధ్యతలను, ఆయా సమస్యలను శిరీష్ రెడ్డి చూసుకుంటున్నారు. ఆయన ఎగ్జిబిటర్ల తరపున ఎంతో దూకుడుగా వ్యవహరిస్తున్నా.. దిల్ రాజు మాత్రం వ్యక్తిగతంగా ఆ వ్యవహారాలకు దూరంగా ఉంటూ కేవలం చిత్ర నిర్మాణాలపైనే పూర్తి దృష్టి కేంద్రీకరించారు. వరుసగా భారీ పాన్ ఇండియన్ చిత్రాలను నిర్మిస్తున్న దిల్ రాజు మరింత జాగ్రత్తగా వ్యవహరిస్తున్నారు.
అయితే వివాదాలకు ఎంత దూరంగా ఉన్నా.. పరిశ్రమ సంక్షేమం దృష్ట్యా కీలక నిర్ణయాల సమయంలో రాజు గారు తన ఉనికిని చాటుకుంటూనే ఉన్నారు. తాజాగా ఫిల్మ్ ఛాంబర్‌లో జరిగిన అత్యంత కీలకమైన సమావేశానికి దిల్ రాజు హాజరయ్యారు. ఇండస్ట్రీలో ఎంత హీట్ నడుస్తున్నా... జూన్ 4న విడుదల కాబోతున్న `పెద్ది` చిత్రానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా స్మూత్ రిలీజ్ ఉండేలా చూస్తానని ఆయన స్పష్టం చేశారు. ఈ విధంగా ఒకవైపు తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకుంటూ.. మరోవైపు పెద్ద ప్రాజెక్టుల విడుదలకు ఇబ్బంది కలగకుండా దిల్ రాజు ప్రదర్శిస్తున్న చాణక్యం నిజంగా స్మార్ట్ అంటూ ప్రశంసిస్తున్నారు సహచరులు. కర్ర విరగకూడదు.. పాము (సమస్య) చావాలి.. అదీ రాజు గారి స్ట్రాటజీ!