సంక్రాంతి 'దిల్ రాజు'.. సౌండ్ గట్టిగానే..
సినీ సంక్రాంతి సందడి జోరుగా కొనసాగుతోంది. ఈసారి ఏకంగా ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి.;
సినీ సంక్రాంతి సందడి జోరుగా కొనసాగుతోంది. ఈసారి ఏకంగా ఐదు స్ట్రయిట్ తెలుగు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ అయ్యాయి. ప్రభాస్ ది రాజా సాబ్ సినిమాతో సంక్రాంతి సెలబ్రేషన్స్ స్టార్ట్ అవ్వగా.. ఆ తర్వాత చిరంజీవి మన శంకర వరప్రసాద్ గారు, రవితేజ భర్త మహాశయులకు విజ్ఞప్తి, శర్వానంద్ నారీ నారీ నడుమ మురారి, నవీన్ పోలిశెట్టి అనగనగా ఒక రాజు మూవీలు వరుసగా వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
అయితే ఐదు సినిమాల్లో మూడు చిత్రాల నైజాం, వైజాగ్ ఏరియా రైట్స్ ను ప్రముఖ నిర్మాత కమ్ డిస్ట్రిబ్యూటర్ దిల్ రాజు దక్కించుకున్నారు. ఆ రెండు ఏరియాల్లో మన శంకర వరప్రసాద్ గారు, అనగనగా ఒక రాజు, నారీ నారీ నడుమ మురారి చిత్రాలను గ్రాండ్ గా రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ మూడు సినిమాలు పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నాయి. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబడుతూ ఓ రేంజ్ లో సందడి చేస్తున్నాయి.
రిలీజ్ అయిన అన్ని సెంటర్స్ లో కూడా మంచి కలెక్షన్లు సాధిస్తున్నాయి. బ్రేక్ ఈవెన్ టార్గెట్ ను అందుకుని ప్రాఫిట్ జోన్ లోకి అడుగు పెట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా మన శంకర వరప్రసాద్ గారు మూవీ భారీ లాభాలు అందిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. మిగతా నారీ నారీ నడుమ మురారి, అనగనగా ఒక రాజు మూవీలు కూడా ప్రాఫిట్స్ తీసుకొస్తున్నాయని చెప్పాయి. దిల్ రాజుకు లాభాలే లాభాలు అని అంటున్నాయి.
మొత్తానికి సంక్రాంతికి ఐదు సినిమాలు రిలీజ్ అవ్వగా.. మూడు చిత్రాలను విడుదల చేసి దిల్ రాజు జాక్ పాట్ కొట్టారని చెప్పడంలో డౌట్ అక్కర్లేదు. ప్రస్తుతం ఆ విషయం సినీ వర్గాలతోపాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. నిర్మాతగా వ్యవహరించిన సినిమాలేం రిలీజ్ కాకపోయినా.. దిల్ రాజు సౌండ్ గట్టిగా వినిపిస్తుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. మంచి లాభాలు దక్కించుకున్నారని అంటున్నారు.
అదే సమయంలో ఇప్పటి వరకు వివిధ సినిమాలను నిర్మించిన దిల్ రాజు.. బాక్సాఫీస్ వద్ద అనేక సూపర్ హిట్స్ అందుకున్నారు. అగ్ర నిర్మాతల్లో ఒకరిగా గుర్తింపు సంపాదించుకున్నారు. ఆడియన్స్ పల్స్ విషయంలో మంచి పట్టు ఉన్న నిర్మాతగా పేరు సొంతం చేసుకున్నారు. కానీ రీసెంట్ గా ఆయనకు కలిసి రావడం లేదు. గత రెండేళ్లలో దిల్ రాజు నిర్మించిన పలు చిత్రాలు.. బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. దారుణంగా నిరాశపరిచాయి.
అందులో గేమ్ ఛేంజర్, ఫ్యామిలీ స్టార్, తమ్ముడు వంటి సినిమాలు ఉన్నాయి. కేవలం సంక్రాంతికి వస్తున్నాం మూవీతోనే బ్లాక్ బస్టర్ హిట్ సొంతం చేసుకున్నారు. ఆ సినిమాతో భారీ లాభాలు అందుకున్నా.. ఫ్లాఫులే ఎక్కువగా ఆయన మూటగట్టుకున్నారు. దీంతో చాలా విమర్శలు ఎదుర్కొన్నారు. కానీ ఇప్పుడు 2026 సంక్రాంతికి మూడు చిత్రాలను రిలీజ్ చేసి.. మంచి లాభాలు అందుకుంటున్నారు.