మీడియాను పొమ్మంటూ దణ్ణం పెట్టిన న‌టుడు

అయితే ధ‌ర్మేంద్ర‌ను ఇంటికి తీసుకొచ్చిన స‌మయంలో మీడియా వెంట‌ప‌డుతుంటే, ద‌య‌చేసి ఇక్క‌డి నుంచి వెళ్లండి.. మ‌మ్మ‌ల్ని ఇలా వ‌దిలేయండి!;

Update: 2025-11-12 17:28 GMT

లెజెండ‌రీ న‌టుడు ధ‌ర్మేంద్ర ముంబైలోని ఓ ప్ర‌యివేట్ ఆస్ప‌త్రి ఐసియులో చికిత్స పొందుతున్నార‌ని క‌థ‌నాలొచ్చిన సంగ‌తి తెలిసిందే. అయితే కొన్ని మీడియాలు అత్యుత్సాహంగా ఆయ‌న చ‌నిపోయార‌ని ప్ర‌చారం సాగించాయి. దీంతో మీడియా భోగోతంపై ధ‌ర్మేంద్ర కుమారులు స‌న్నీడియోల్, బాబి డియోల్ తీవ్ర అస‌హ‌నం వ్య‌క్తం చేసారు.

ఈరోజు ముంబై బ్రీచ్ కాండీ హాస్పిటల్ నుంచి ప్రముఖ నటుడు ధర్మేంద్ర డిశ్చార్జ్ అయ్యారని, ఇంట్లోనే కోలుకుంటున్నారని సన్నీ డియోల్ టీమ్ ప్ర‌క‌టించింది. అభిమానుల ప్రేమ ప్రార్థనలకు ధన్యవాదాలు తెలిపింది.

అయితే ధ‌ర్మేంద్ర‌ను ఇంటికి తీసుకొచ్చిన స‌మయంలో మీడియా వెంట‌ప‌డుతుంటే, ద‌య‌చేసి ఇక్క‌డి నుంచి వెళ్లండి.. మ‌మ్మ‌ల్ని ఇలా వ‌దిలేయండి! అని వేడుకుంటూ స‌న్నీడియోల్ మీడియాకు దండం పెడుతున్న వీడియో జోరుగా వైర‌ల్ అయింది.

మీడియా అన‌వ‌స‌ర ఊహాగానాలు చేయ‌డం స‌రికాదు. దయచేసి ఆయనను గౌరవించండి .. ఎందుకంటే ఆయన మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు అని స‌న్నీడియోల్ మీడియాకు విజ్ఞప్తి చేసారు. ఆస్ప‌త్రిలో 10 రోజులు గ‌డిపిన అనంత‌రం ధ‌ర్మేంద్ర తిరిగి కోలుకున్నారు. ప్ర‌స్తుతం ఆయ‌న జుహూలోని సొంత ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ ప్ర‌క‌ట‌న‌తో అభిమానులు చాలా ఉత్సాహంగా మారారు.

ఇక ధ‌ర్మేంద్ర‌కు తీవ్ర అనారోగ్యం తిర‌గ‌బెట్టింద‌ని పుకార్లు రావ‌డంతో అభిమానులు, శ్రేయోభిలాషులు సోష‌ల్ మీడియాల్లో దేవుడికి ప్రార్థ‌న‌లు చేస్తూ, ఆయ‌న త్వ‌ర‌గా కోలుకుని తిరిగి రావాల‌ని ఆకాంక్షించారు. చివ‌రికి అభిమానుల పూజ‌లు ప్రార్థ‌న‌లు ఫిలించి ధ‌ర్మేంద్ర క్షేమంగా ఇంటికి చేరుకున్నారు. ఆయ‌న రాక స‌మ‌యంలో స‌న్నీడియోల్, బాబి డియోల్ త‌మ తండ్రి వెంటే ఉన్నారు.

డియోల్ ఫ్యామిలీ అనుబంధం:

ధ‌ర్మేంద్ర‌తో స‌న్నీడియోల్ ఎంతో అటాచ్ అయి ఉన్నారు. సన్నీ డియోల్ జననం తనకు చాలా అదృష్టమని ధర్మేంద్ర గ‌తంలో చెప్పారు. ఓ రియాలిటీ షోలో త‌న పెద్ద కుమారుడు స‌న్నీడియోల్ పుట్టుక త‌మ‌కు క‌లిసొచ్చింద‌ని ధ‌ర్మేంద్ర తెలిపారు. అత‌డు చాలా చిన్నవాడు.. దాదాపు ఆరు నుండి ఎనిమిది నెలల వయస్సు ఉంటుంది.. అత‌డు అందంగా ఉంటాడు! అంటూ ధ‌ర్మేంద్ర ఉబ్బిత‌బ్బిబ్బ‌య్యారు. నేను అతనికి సన్నీ అని పేరు పెట్టాను.. అతను మనకు సూర్యుడిలాంటివాడు అని దీని అర్థం.. అని తెలిపారు.

Tags:    

Similar News