ముస్లిమ్ యువతితో ప్రేమలో ఎవర్‌గ్రీన్ హీరో.. చంపేస్తామని బెదిరింపులు!
అతడు అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో.. కానీ అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఏల్తోంది ఆ నటి.;
అతడు అప్పుడే ఇండస్ట్రీలో అడుగుపెట్టిన హీరో.. కానీ అప్పటికే స్టార్ హీరోయిన్ గా ఏల్తోంది ఆ నటి. ఆ ఇద్దరి మధ్యా ప్రేమకథ ఒక సినిమా కథను తలపిస్తుంది.. ఈ ప్రేమకథ హిందూ వర్సెస్ ముస్లిమ్ వివాదంగా మారి చివరికి విషాదాంతమైంది. ముస్లిమ్ నటితో ప్రేమలో పడిన ఆ హిందూ హీరో ఎవరు? అన్నది పూర్తి వివరాల్లోకి వెళితే...
బాలీవుడ్ ఎవర్‌గ్రీన్ హీరో దేవ్ ఆనంద్ గురించే ఇదంతా! దేవానంద్ అలనాటి మేటి నటి సురయ్యల ప్రేమకథ సినిమా కథకు తక్కువేమీ కాదు! వీరిద్దరి బంధం 1948లో `విద్య` చిత్ర షూటింగ్ సమయంలో మొదలైంది. ఒక పాట చిత్రీకరణలో పడవ బోల్తా పడి సురయ్య నీటిలో మునిగిపోతుంటే దేవ్ ఆనంద్ తన ప్రాణాలకు తెగించి తనను కాపాడారు. ఈ ఘటనే వారి మధ్య ప్రేమ చిగురించడానికి కారణమైంది. అప్పట్లో సురయ్య దేశంలోనే అతిపెద్ద స్టార్ హీరోయిన్ కాగా దేవ్ ఆనంద్ అప్పుడప్పుడే హీరోగా నిలదొక్కుకుంటున్న తరుణం అది. అయినా వీరిద్దరి మధ్య ఉన్న గాఢమైన అనురాగం సినీ వర్గాల్లో చర్చనీయాంశమైంది.
వీరిద్దరూ కలిసి ఏడు విజయవంతమైన చిత్రాల్లో నటించారు. సురయ్య అమ్మమ్మ వీరి ప్రేమను తీవ్రంగా వ్యతిరేకించడంతో వారు సహ నటుల ద్వారా రహస్యంగా ప్రేమ లేఖలను మార్చుకునేవారు. 1949లో `జీత్` సినిమా షూటింగ్ సమయంలో ఈ జంట రహస్యంగా వివాహం చేసుకుని పారిపోవాలని ప్లాన్ చేశారు. కానీ చివరి నిమిషంలో సురయ్య అమ్మమ్మకు ఈ విషయం తెలియడంతో ఆ ప్రయత్నం విఫలమైంది. హిందూ-ముస్లిం మత విభేదాల కారణంగా సురయ్య కుటుంబం వీరి బంధాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించలేదు.
దేవ్ ఆనంద్ తన ప్రియురాలికి తన ప్రేమను తెలియజేయడానికి రూ.3000 విలువైన డైమండ్ ఉంగరాన్ని బహూకరించారు. ఆ రోజుల్లో అది చాలా పెద్ద మొత్తం కావడంతో ఆయన తన స్నేహితుల వద్ద అప్పు చేసి మరి ఆ ఉంగరాన్ని కొనుగోలు చేశారు. అయితే సురయ్య కుటుంబం తనను తీవ్రంగా ఒత్తిడి చేయడమే కాకుండా దేవ్ ఆనంద్‌ను చంపేస్తామని కూడా బెదిరించారు. సాంప్రదాయ ముస్లిం కుటుంబానికి చెందిన తన మనవరాలు ఒక హిందూ యువకుడిని పెళ్లాడటం తమకు ఇష్టం లేదని సురయ్య అమ్మమ్మ - మామ భీష్మించుకు కూర్చున్నారు.
ఈ ప్రేమకథ అత్యంత విషాదకరంగా ముగిసింది. దేవ్ ఆనంద్ ఇచ్చిన ఆ నిశ్చితార్థపు ఉంగరాన్ని సురయ్య అమ్మమ్మ అరేబియా సముద్రంలో విసిరివేసినట్లు కథనాలు ఉన్నాయి. కుటుంబం నుండి వచ్చిన తీవ్రమైన బెదిరింపులు, ఒత్తిళ్ల కారణంగా సురయ్య తన ప్రేమను వదులుకోవాల్సి వచ్చింది. దేవ్ ఆనంద్ ఆ తర్వాత కాలక్రమేణా తన జీవితంలో ముందుకు సాగి వేరే పెళ్లి చేసుకున్నా.. సురయ్య మాత్రం తన చివరి శ్వాస వరకు మరొకరిని పెళ్లాడలేదు. దేవ్ ఆనంద్ మీద ఉన్న అమర ప్రేమే తనను జీవితాంతం ఒంటరిగా ఉండేలా చేసింది.
భారతీయ సినీ చరిత్రలో దేవ్ ఆనంద్ - సురయ్యల కథ ఒక అసంపూర్ణ కావ్యంలా మిగిలిపోయింది. మతం అనే అడ్డుగోడలు ఇద్దరు మనసున్న వ్యక్తుల జీవితాలను ఎలా చిన్నాభిన్నం చేస్తాయో చెప్పడానికి ఈ జంట ఒక ఉదాహరణ. సురయ్య ఒక టాప్ స్టార్‌గా ఎంతటి కీర్తిని సంపాదించినా.. వ్యక్తిగత జీవితంలో మాత్రం తన మనసు మెచ్చిన వాడిని పొందలేకపోయిన వేదనతోనే కాలం వెళ్లదీశారు. వీరి ప్రేమకథ నేటికీ బాలీవుడ్ చరిత్రలో అత్యంత బాధాకరమైన అధ్యాయంగా నిలిచిపోయింది.