మలేరియా వణికించినా వెన‌క్కి త‌గ్గ‌ని న‌టి!

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు.;

Update: 2026-04-30 10:30 GMT

బాలీవుడ్ నటి దీపికా పదుకొణె వృత్తి పట్ల ఆమెకున్న అంకితభావం గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎలాంటి స‌వాళ్లైనా అమ్మ‌డు స్వీక‌రించి ప‌ని చేయ‌గ‌ల‌దు. ప‌ని గంట‌ల విష‌యంలో అంద‌రికీ స‌మ‌న్యాయం జ‌ర‌గాల‌నే పోరాటం చేసింది తప్ప త‌న కోసం మాత్ర‌మే కాదు. ద‌శాబ్దాల బాలీవుడ్ ప్ర‌యాణంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కుని నిల‌బ‌డిన న‌టి. ఈ నేప‌థ్యంలో తాజాగా దీపిక గురించి లారా దత్తా పంచుకున్న విశేషాలు అభిమానులను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. 2010లో రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ మూవీ `హౌస్‌ఫుల్` చిత్రీకరణ సమయంలో దీపికా పదుకొణె తీవ్రమైన అనారోగ్యానికి గురైనట్లు లారా వెల్లడించారు. ఇటలీలో షూటింగ్ జరుగుతున్న సమయంలో దీపికా మలేరియా బారిన పడ్డారంది. కానీ సినిమా పనులు ఆగకూడదనే ఉద్దేశంతో దీపిక‌ తన కష్టాన్ని భరిస్తూ పనిచేశారని లారా గుర్తు చేసుకున్నారు.

షూటింగ్ సమయంలో దీపికకు విపరీతమైన జ్వరం ఉంది. ఒళ్లు వణికిపోతున్నా ఆమె సెట్స్‌కు వచ్చేదని లారా దత్తా తెలిపారు. మలేరియా వంటి వ్యాధి మనిషిని శారీరకంగా పూర్తిగా నీరసింపజేస్తుందని, అలాంటి స్థితిలో కూడా దీపికా ఎక్కడా అసహనం చూపించకుండా సీన్లను పూర్తి చేసిందన్నారు. ఆమె పడుతోన్న ఇబ్బందిని గమనించిన చిత్రబృందం వైద్య సదుపాయం కల్పించిందని అయినా కూడా ఆమె విశ్రాంతి తీసుకోకుండా షెడ్యూల్ ప్రకారం పని పూర్తి చేయడానికే ప్రాధాన్యత ఇచ్చిందని వెల్ల‌డించారు. `దీపికా అద్భుతమైన ప్రొఫెషనల్. జ్వరంతో నీరసించిపోయి ఉన్నా కెమెరా ముందుకు వచ్చేసరికి ఆమె నటనలో ఎక్కడా మార్పు కనిపించేది కాదు. మేము ఆ సమయంలో కొన్ని ఎమోషనల్ సీన్లు షూట్ చేస్తున్నాం.

ఆమె తన శక్తిని కూడగట్టుకుని ఆ పాత్రలో ఒదిగిపోయేదని ప్రశంసించారు. ఆ సమయంలో మిగిలిన నటీనటులు అక్షయ్ కుమార్, రితేష్ దేశ్‌ముఖ్ వంటి వారంతా ఆమెకు మద్దతుగా నిలిచారని కానీ దీపిక‌ చూపిన పట్టుదల అందరినీ ఆకట్టుకుందన్నారు. ఈ సినిమా సెట్స్‌పై ఉన్నప్పుడు ఒక ఫ్యామిలీ హాలిడేలా అనిపించేదని నిర్మాతలు అన్నీ దగ్గరుండి చూసుకునేవారని లారా తెలిపారు. అయితే దీపిక అనారోగ్యం గురించి బయట ప్రపంచానికి పెద్దగా తెలియదన్నారు. దీపిక‌ ఎంతటి ఇబ్బందిని ఎదుర్కొని ఆ సినిమా పూర్తి చేసిందో తానిప్పుడు గుర్తు చేసుకోవడం మ‌రిపోనిద‌న్నారు లారా . షూటింగ్ గ్యాప్‌లో మందులు వేసుకుని విశ్రాంతి తీసుకునేదని షాట్ అనగానే మళ్ళీ రెడీ అయిపోయేదని వెల్లడించారు.

దీపికా పదుకొణె అందంతోనే కాదు. క్రమశిక్షణ , పని పట్ల చూపే ఏకాగ్రత వల్లే ఈ రోజు గ్లోబల్ స్టార్‌గా ఎదిగిందని లారా విశ్లేషించారు. ఏదైనా ఒక పనిని ఒప్పుకున్నాక ఎన్ని ఆటంకాలు ఎదురైనా దానిని పూర్తి చేయడమే లక్ష్యంగా పెట్టుకోవడం ఆమెలోని గొప్ప లక్షణమని కొనియాడారు. 16 ఏళ్ల క్రితం నాటి ఈ సంఘటన నేటి యువ నటులకు ఓ స్ఫూర్తిదాయకమైన పాఠం లాంటిదని చెప్పొచ్చు. వెండితెరపై కనిపించే గ్లామర్ వెనుక నటీనటులు పడే కష్టం సామాన్యులకు అంత సుల‌భంగా అర్దం కాదు. సెల‌బ్రిటీలు వాళ్ల‌కేంటి? ఏసీల్లో కారుల్లో తిరుగుతారు. ల‌గ్జ‌రీ గ‌దుల్లో ఉంటారంటారు. కానీ తీవ్ర‌మైన ఎండ‌, వాన‌, చ‌లిలో షూటింగ్ చేస్తారన్న‌ది అంతే వాస్త‌వం. పాత్ర‌కు త‌గ్గ‌ట్టు మౌల్డ్ అవ్వ‌డం కోసం ప‌గ‌లు, రాత్రి న‌లిగిపోతారన్నది అంత‌కు మించిన ప‌చ్చి నిజం.

Tags:    

Similar News