పీఆర్ వల్లే దీపికా వివాదంలో ఇరుక్కుందా?
దీపికాకు పీఆర్ ఇచ్చిన సలహాలతోనే ఆమె జేఎన్‌యూకి వెళ్లి ఉంటుందని, కావాలని ఎవరూ వివాదాల్లోకి వెళ్లరు కదా అని ఆయన అన్నారు.;
ది కశ్మీర్ ఫైల్స్, బెంగాల్ ఫైల్స్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి, దీపికా పదుకొణె గతంలో జవహర్ లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వెళ్లిన విషయంపై మాట్లాడారు. ఛపాక్ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా దీపికా పదుకొణె 2000వ సంవత్సరంలో జేఎన్‌యూకి వెళ్లగా అప్పుడు అదొక పెద్ద కాంట్రవర్సీ అయిన సంగతి తెలిసిందే. ఈ విషయంపై తాజాగా వివేక్ అగ్నిహోత్రి మాట్లాడుతూ ఆయన అభిప్రాయాలను షేర్ చేసుకున్నారు.
దీపికాకు పీఆర్ ఇచ్చిన సలహాలతోనే ఆమె జేఎన్‌యూకి వెళ్లి ఉంటుందని, కావాలని ఎవరూ వివాదాల్లోకి వెళ్లరు కదా అని ఆయన అన్నారు. దీపికాకు పాలిటిక్స్ గురించి తెలియకపోవచ్చని, సినిమా ప్రమోషన్స్ లో భాగంగా జేఎన్‌యూలో జరిగే నిరసనలో పార్టిసిపేట్ చేయమని పీఆర్ టీమ్ ఆమెకు సలహా ఇచ్చి ఉండొచ్చని అందుకే ఆమె అక్కడికి వెళ్లి ఉండొచ్చని వివేక్ అగ్నిహోత్రి అన్నారు.
దీపికాకు అక్కడి సిట్యుయేషన్స్ గురించి ఏమీ తెలిసి ఉండదని తాను హామీ ఇవ్వగలనని, తాను నటించిన ఛపాక్ ను ప్రమోట్ చేయడానికి అదే కరెక్ట్ టైమ్ అని ఆమెకు చెప్పడం వల్లే ఆమె అలా వెళ్లిందని, యూనివర్సిటీ రాజకీయాలతో ముడిపడి ఉంటుందని దీపికాకు తెలిసి ఉండదని, ఒకవేళ తెలిస్తే కచ్ఛితంగా దీపికా అక్కడికి వచ్చి ఉండేది కాదని ఆయన అన్నారు.
నటీనటులు పాలిటిక్స్ లో భాగం కావడం చాలా డేంజరస్ అని, అది నిప్పుతో ఆడుకోవడం లాంటిదే అని, ఎప్పటికైనా డేంజరే అని చెప్పిన ఆయన, దీపికా చాలా తెలివైన నటి అని, అది రాజకీయపరంగా సెన్సిటివ్ ఇష్యూ అని, ఆ విషయం తన కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతుందని తనకు తెలిసి ఉంటే కచ్ఛితంగా దీపికా అక్కడికి వెళ్లేది కాదని వివేక్ చెప్పారు. కాగా దీపికా ఛపాక్ ప్రమోషన్స్ కోసం అక్కడికి వెళ్లినప్పుడు అక్కడ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా నిరసన జరుగుతోంది. ఆ నిరసనకు దీపికా విద్యార్థులకు మద్దుతు ఇవ్వగా అది అప్పట్లో చాలా పెద్ద వివాదంగా మారింది.