కమెడియనా? హీరోనా?.. సత్య ఒపీనియన్ ఏంటి?

అక్కడే ఉన్న నిర్మాత మాత్రం సత్యపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సత్య ఒక హీరో ఇమేజ్ ఉన్న కమెడియన్ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు.;

Update: 2026-05-02 22:30 GMT

టాలీవుడ్‌ లో తనదైన కామెడీ స్టైల్‌ తో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న నటుడు సత్య గురించి మరోసారి ఆసక్తికరమైన చర్చ మొదలైంది. అసిస్టెంట్ డైరెక్టర్‌ గా కెరీర్‌ ను ప్రారంభించిన సత్య, నెమ్మదిగా కమెడియన్‌ గా ఎదిగి ఇప్పుడు స్టార్ కమెడియన్‌ గా మారారు. స్వామి రారా, ఛలో, మత్తు వదలరా, మత్తు వదలరా 2 వంటి సినిమాలు ఆయనకు మంచి క్రేజ్‌ ను తీసుకొచ్చాయి. తన స్పెషల్ డైలాగ్ డెలివరీ, ఎక్స్ప్రెషన్స్ తో ప్రేక్షకులను నవ్వించడం ఆయనకు వెన్నతో పెట్టిన విద్య.

ఇటీవల దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన జెట్లీ సినిమాలో సత్య లీడ్ రోల్ లో నటించారు. ఇప్పటికే వివాహ భోజనంబు సినిమాతో హీరోగా ప్రయత్నించిన ఆయన, జెట్లీతో మరోసారి లీడ్ రోల్‌లో కనిపించారు. మే 1వ తేదీన థియేటర్స్ లో ఆ సినిమా రిలీజ్ అవ్వగా.. ఇప్పుడు పోస్ట్ ప్రమోషన్స్‌ లో భాగంగా నిర్వహించిన ప్రెస్ మీట్‌ లో సత్య చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారాయి.

ప్రెస్ మీట్‌ లో ఓ మీడియా ప్రతినిధి సత్యను.. మిమ్మల్ని మీరు హీరోగా ఎందుకు అంగీకరించలేకపోతున్నారని ప్రశ్నించగా, ఆయన ఆసక్తికరంగా స్పందించారు. 'నేను కామెడీ చేస్తూ హీరో కానీ.. సెపరేట్ గా హీరో ఏం కాదు' అని స్పష్టంగా చెప్పారు. ఆ వ్యాఖ్యలతో సత్య తనను తాను హీరోగా కాకుండా కమెడియన్‌ గా చూడాలనే భావనను వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. అదే సమయంలో జెట్లీ సినిమా ఒక ఎక్స్పెరిమెంటల్ ప్రాజెక్ట్ అని కూడా ఆయన వివరించారు.

అక్కడే ఉన్న నిర్మాత మాత్రం సత్యపై పూర్తి నమ్మకాన్ని వ్యక్తం చేశారు. సత్య ఒక హీరో ఇమేజ్ ఉన్న కమెడియన్ అంటూ ఆయనకు మద్దతుగా నిలిచారు. అంటే సత్యకు హీరోగా నిలబడే స్టామినా ఉందని నిర్మాత అభిప్రాయపడ్డారు. ఇక జెట్లీ సినిమాలో సత్య నటనకు మంచి స్పందన వస్తోంది. ఆ చిత్రంలో ఆయన వన్ మ్యాన్ షో చూపించారని సినీ ప్రియులు అభిప్రాయపడుతున్నారు. సినిమా మొత్తం కథ, స్క్రీన్‌ ప్లే కంటే సత్య పెర్ఫార్మెన్స్‌ నే మోసుకెళ్లిందని చెబుతున్నారు.

ఆయన స్క్రీన్‌ పై కనిపించే ప్రతి సీన్ నవ్వుల పండుగలా మారిందని, సాధారణ సన్నివేశాలను కూడా తన కామెడీ టైమింగ్‌ తో హిలేరియస్‌గా మార్చేశారని అంటున్నారు. సత్యకు ఉన్న ప్రత్యేకత ఏంటంటే, చిన్న పాత్రైనా పెద్ద పాత్రైనా తనదైన స్టైల్‌ లో ముద్ర వేసే స్టామినా. అదే ఇప్పుడు జెట్లీలో కూడా కనిపించిందని ప్రేక్షకులు చెబుతున్నారు. డైలాగ్ డెలివరీ, ఫేస్ ఎక్స్ప్రెషన్స్, టైమింగ్.. అన్నీ కలిపి ఆయన కామెడీ మరో స్థాయికి తీసుకెళ్లాయని అభిప్రాయం వ్యక్తమవుతోంది.

ఇప్పటి వరకు కమెడియన్‌ గా సక్సెస్ సాధించిన సత్య, ఇకపై మరిన్ని లీడ్ రోల్స్ చేస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో ఉంది. అయితే ఆయన మాటలను బట్టి చూస్తే, హీరోగా కంటే కమెడియన్‌ గా కొనసాగడానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్టు అర్థమవుతోంది. అయినప్పటికీ జెట్లీ లాంటి ప్రయోగాత్మక చిత్రాలతో సత్య తన రేంజ్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా సత్య మరోసారి తన కామెడీతో ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యారని చెప్పొచ్చు. హీరో ట్యాగ్ అవసరం లేకుండా తన నటనతోనే సినిమాను మోసుకెళ్లగలనని ప్రూవ్ చేశారు.

Tags:    

Similar News