ప్ర‌పంచ సినిమాకి హైద‌రాబాద్ హ‌బ్‌.. రేవంత్‌పై మెగా ప్ర‌శంస‌లు!

హైదరాబాద్ నగరాన్ని కేవలం తెలుగు సినిమాలకే పరిమితం చేయకుండా భారతీయ, అంతర్జాతీయ స్థాయి సినిమా కేంద్రంగా మార్చాలనే సీఎం విజన్‌ను చిరంజీవి ప్ర‌శంసించారు.;

Update: 2026-03-20 04:02 GMT

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన `గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ 2025-26` వేడుకలో మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంతో అందరినీ ఆకట్టుకున్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వంటి ప్రముఖులతో పాటు సినీ దిగ్గజాలు కమల్ హాసన్, నాగార్జున కూడా హాజరయ్యారు. కార్య‌క్ర‌మ అతిథుల‌లో ఒక‌రైన మెగాస్టార్ చిరంజీవి తన ప్రసంగంలో అవార్డు గ్రహీతలైన జయసుధ, నాగచైతన్య, రష్మిక మందన్నలను ప్రత్యేకంగా అభినందిస్తూ.. సినిమా రంగానికి ప్రభుత్వం, సీఎం రేవంత్ రెడ్డి ఇస్తున్న ప్రాధాన్యతను కొనియాడారు.

చాలా కాలంగా నిలిచిపోయిన రాష్ట్ర స్థాయి చలనచిత్ర అవార్డులను `గద్దర్` పేరుతో తిరిగి ప్రారంభించడంపై చిరంజీవి హర్షం వ్యక్తం చేశారు. కళాకారులు గౌరవించబడే రాజ్యం ఎప్పుడూ సుభిక్షంగా ఉంటుందని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. సినిమా రంగం కేవలం వినోదమే కాకుండా, వేలమందికి ఉపాధి కల్పించే, ఆర్థిక సంప‌త్తిని పెంచుకునే శక్తివంతమైన సాధనమని, దానిని గుర్తించి పునరుద్ధరించినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

హైదరాబాద్ నగరాన్ని కేవలం తెలుగు సినిమాలకే పరిమితం చేయకుండా భారతీయ, అంతర్జాతీయ స్థాయి సినిమా కేంద్రంగా మార్చాలనే సీఎం విజన్‌ను చిరంజీవి ప్ర‌శంసించారు. ఇక్కడి వాతావరణం, మౌలిక సదుపాయాలు ప్రపంచ స్థాయి చిత్రాలను ఆకర్షించేలా ఉన్నాయని చిరు అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో హైదరాబాద్ గ్లోబల్ సినిమా హబ్‌గా ఎదగాలని, అందుకు చిత్ర పరిశ్రమ ప్రభుత్వం వైపు నుంచి పూర్తి సహకారం అందిస్తుందని అన్నారు.

సినిమా రంగం దేశ ఆర్థిక వ్యవస్థపై చూపే ప్రభావం గురించి వివరిస్తూ.. దక్షిణ కొరియాకు చెందిన `కే-పాప్` ఆ దేశ‌ జీడీపీని ఎలా ప్రభావితం చేశాయో చిరంజీవి ఉదాహరణగా పేర్కొన్నారు. సినిమా ద్వారా మన సంస్కృతిని ప్రపంచానికి చాటిచెప్పడంతో పాటు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను కూడా బలోపేతం చేయవచ్చని ఆయన వివరించారు. ఈ దిశగా తెలంగాణ ప్రభుత్వం వేస్తున్న అడుగులు అభినందనీయమని కొనియాడారు.

ఇదే వేదిక‌పై హైదరాబాద్‌ను గ్లోబల్ ఫిలిం హబ్‌గా తీర్చిదిద్దడంపై సీఎం రేవంత్ మాట్లాడారు. కొరియా- జపాన్ దేశాల్లో సినీ పరిశ్రమ ఏ విధంగా అయితే ప్రపంచ స్థాయి అభివృద్ధిని సాధించిందో, అదే తరహాలో హైదరాబాద్‌ను అంతర్జాతీయ సినీ హబ్గా తీర్చిదిద్దాలని రేవంత్ రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ కేవలం ప్రాంతీయ సినిమాలకే పరిమితం కాకుండా, గ్లోబల్ సినిమాకు కేరాఫ్ అడ్రస్‌గా మారాలని ఆయన ఆకాంక్షించారు. నెట్‌ఫ్లిక్స్ .. హాలీవుడ్ వంటి అంతర్జాతీయ దిగ్గజ సంస్థలు ఇప్పుడు హైదరాబాద్ వైపు చూస్తున్నాయని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.

Tags:    

Similar News