తొలి సినిమాకే మాటలు లేని పాత్ర.. అనీష్ ఎంత కష్టపడ్డారంటే!
| ‘ఇట్లు అర్జున’ కోసం ఆరు నెలల పాటు వర్క్‌షాప్స్ చేశానని హీరో అనీష్ తెలిపారు. మాటలు రాని యువకుడిగా నటించడం కొత్త అనుభవమని, హావభావాలు, బాడీ లాంగ్వేజ్‌పై ప్రత్యేకంగా వర్క్ చేసినట్లు చెప్పారు. సినిమాలోని అన్ని ఫైట్స్ డూప్ లేకుండా తానే చేశానని వెల్లడించారు. దినేష్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని తెలిపారు. ఈ సినిమా నవంబర్ 13న విడుదల కానుంది.
హీరోగా పరిచయమయ్యే తొలి సినిమాలోనే డైలాగులు లేకుండా నటించాల్సి వస్తే కాస్త కష్టమే. కానీ అనీష్ మాత్రం అలాంటి పాత్రనే ఎంచుకున్నారు. 'ఇట్లు అర్జున'లో మాటలు రాని యువకుడిగా నటించిన అతను ఈ సినిమా కోసం చేసిన హోమ్ వర్క్ గురించి ఓ ఇంటర్వ్యూలో వివరించారు. ముఖ్యంగా మాటలు రాని యువకుడు తన ప్రేమను ఎలా వ్యక్తపరుస్తాడనే అంశం తనకు బాగా నచ్చిందని, అందుకే ఈ కథను ఎంచుకున్నట్లు అనీష్ చెప్పారు.
ఈ పాత్ర కోసం దాదాపు ఆరు నెలల పాటు వర్క్‌షాప్స్ చేశామని అనీష్ చెప్పారు. దర్శకుడు మహేష్ ఉప్పలకు పాత్ర ఎలా ఉండాలనే విషయంలో పూర్తి క్లారిటీ ఉందన్నారు. ప్రతి సీన్‌ను ముందుగానే రిహార్సల్ చేసేవాళ్లమని, బాడీ లాంగ్వేజ్, ఎక్స్‌ప్రెషన్స్‌పై ఎక్కువగా వర్క్ చేసినట్లు వివరించారు. కొంత సైన్ లాంగ్వేజ్ కూడా ఉపయోగించామని, అది ప్రేక్షకులకు సులభంగా అర్థమయ్యేలా ఉంటుందని చెప్పారు.
ముఖ్యంగా ఎదుటివాళ్లు మాట్లాడుతున్నప్పుడు డైలాగ్‌తో సమాధానం చెప్పే అవకాశం లేకపోవడం తనకు పెద్ద ఛాలెంజ్‌గా అనిపించిందన్నారు. ముఖంలో ఎక్స్‌ప్రెషన్స్‌తోనే స్పందించాల్సి వచ్చేదని తెలిపారు. అలాగే పాటల్లో లిప్ సింక్ లేకుండా డ్యాన్స్ చేయడం కూడా కష్టంగా అనిపించిందని చెప్పారు. ఇలాంటి పాత్రతో తొలి సినిమా చేయడం తనకు కొత్త అనుభవమన్నారు.
ఇక డైలాగులు లేని పాత్ర అయినప్పటికీ అనీష్ డబ్బింగ్ కూడా చెప్పారు. యాక్షన్ సన్నివేశాల్లో వచ్చే సహజమైన సౌండ్స్, 'హమ్' వంటి ఎక్స్ప్రెషన్స్ కోసం స్వయంగా డబ్బింగ్ చెప్పినట్లు వివరించారు. మాటలు లేకుండా జస్ట్ శబ్దాలతో పాత్ర భావాలను పలికించడం కొత్తగా అనిపించిందన్నారు. సినిమాలో సంగీతానికి కూడా ఎక్కువ ప్రాధాన్యం ఉంటుందని చెప్పారు.
యాక్షన్ సన్నివేశాల గురించి మాట్లాడుతూ దాదాపు అన్ని ఫైట్స్ తానే చేసినట్లు అనీష్ తెలిపారు. ఎక్కడా డూప్ ఉపయోగించలేదన్నారు. దినేష్ మాస్టర్ యాక్షన్ కొరియోగ్రఫీ చేశారని, ఫైట్స్ చేస్తున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశానని చెప్పారు. అయితే ఇవి రెగ్యులర్ మాస్ సినిమాల్లో కనిపించే ఫైట్స్ మాదిరిగా ఉండవన్నారు. ఒక నార్మల్ వ్యక్తి తనకు ఎదురైన పరిస్థితుల్లో ఎలా పోరాడతాడో అలాగే ఉంటాయని వివరించారు.
అర్జున్ పాత్రకు మాటలు రాకపోయినా చాలా తెలివైన వ్యక్తి అని అనీష్ చెప్పారు. కథలో ఎదురయ్యే సమస్యలను ఆ పాత్ర ఎలా ఎదుర్కొంటుందనే అంశం తనను బాగా ఆకట్టుకుందన్నారు. ప్రేమకథతో పాటు యాక్షన్, ఎమోషన్స్ కూడా ఉంటాయని తెలిపారు. అనీష్ హీరోగా పరిచయమవుతున్న 'ఇట్లు అర్జున' నవంబర్ 13న థియేటర్లలో విడుదల కానుంది.