N-కన్వెన్షన్ని కూల్చివేసినా కానీ కింగ్ నాగార్జున ఏంటి ఇలా?!
| తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ పనులను నటుడు నాగార్జున ప్రశంసించారు. సీఎం రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కృషిని అభినందించారు. హైదరాబాద్లోని 2 వేల చెరువులను ఇలాగే పునరుద్ధరిస్తే భూగర్భ జలాలు పెరుగుతాయని అన్నారు. చెరువు పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాక అక్కడ షూటింగ్ చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు.
కింగ్ నాగార్జునకు చెందిన ఎన్.కన్వెషన్ వివాదం గురించి తెలిసిందే. రెండేళ్ల క్రితం రేవంత్ రెడ్డి ప్రభుత్వం `తమ్మిడి కుంట చెరువు`బఫర్ జోన్లో ఈ కమర్షియల్ నిర్మాణాన్ని చేపట్టారని ఆరోపిస్తూ హైడ్రాకు కూల్చి వేతకు అనుమతులిచ్చింది. దాంతో ఎన్.కన్వెన్షన్ నేలమట్టమైంది.
ఇదే ఎన్.కన్వెన్షన్లో నగరంలో ఫేజ్ 3 ప్రజలకు చెందిన పెళ్లిళ్లు, కుటుంబ సెలబ్రేషన్స్ తో పాటు, ఎన్నో సినిమా ఫంక్షన్లు కూడా జరిగాయి. వాటన్నిటికీ అక్కడ చెక్ పడిపోయింది. అయితే ఎక్కడైతే ఎన్.కన్వెన్షన్ ని కూల్చివేసారో ఇప్పుడు అక్కడ అత్యంత సుందరమైన తటాకం దర్శనమిస్తోంది.
తాజాగా తమ్మిడికుంట చెరువు పునరుద్ధరణ ప్రాజెక్ట్ ప్రారంభోత్సవ వేదికపై కింగ్ ప్రత్యక్షం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, హైడ్రా కమిషనర్ రంగనాథ్ తో కలిసి ఈ వేదికపై కనిపించారు. అంతే కాదు.. తనకు ఎంతో గొప్ప ఆదాయాన్ని అందించిన ఎన్ .కన్వెన్షన్ ని కూల్చేసారనే ఆవేదనే ఆయనలో కనిపించలేదు. పైగా రేవంత్ ని, రంగనాథ్ ని నాగార్జున ఎంతగానో ప్రశంసించారు.
ఇక్కడ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను నాగ్ గొప్పగా ప్రశంసించారు. గతంలో డ్రైనేజీ వ్యర్థాలు, బయోవేస్ట్తో నిండిపోయి దుర్వాసన వెదజల్లిన తమ్మిడికుంట నేడు సుందరంగా మారుతుండటంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. విదేశాల్లో మాదిరిగా మన నగరాల్లోనూ అద్భుతమైన జలవనరులు ఉండాలనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం చాలా గొప్పదని.. ఈ బృహత్తర కార్యానికి అడుగులు వేయడంలో `హైడ్రా` కమిషనర్ రంగనాథ్ పాత్ర ఎంతో కీలకమని కొనియాడారు.
ఈ ప్రాజెక్ట్ పూర్తయ్యే క్రమంలో ఎదురైన సవాళ్లు, విమర్శలను ప్రస్తావిస్తూ.. మనం ఎవరూ శాశ్వతం కాదని.. నగర భవిష్యత్తు కోసం.. ప్రజల మంచి కోసం ఇలాంటి సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకోవడం ఎంతో అవసరమని నాగార్జున అభిప్రాయపడ్డారు. హైదరాబాద్ చుట్టూ ఉన్న దాదాపు 2000 చెరువులను ఇదేరీతిలో పునరుద్ధరిస్తే భవిష్యత్తులో తాగునీటి సమస్యే తలెత్తదని... భూగర్భ జలాలు గణనీయంగా పెరుగుతాయని నాగ్ పేర్కొన్నారు. వాతావరణ మార్పులు, క్లౌడ్ బరస్ట్స్ వంటి విపత్తుల నుండి నగరాన్ని రక్షించడానికి ప్రభుత్వాలు తీసుకునే ఇటువంటి చర్యలు భవిష్యత్ తరాలకు రక్షణగా నిలుస్తాయని అన్నారు.
ప్రకృతిని కాపాడుకుంటేనే మనమందరం ఆనందంగా ఉండగలం.. మనం పిల్లలకు ఇచ్చే అతిపెద్ద ఆస్తి పచ్చని ప్రకృతి మాత్రమేనని నాగార్జున ఉద్ఘాటించారు. త్వరలోనే తమ్మిడికుంట పూర్తిస్థాయిలో జలకళను సంతరించు కుంటుందని.. అక్కడ తాను కచ్చితంగా షూటింగ్లు చేస్తానని సరదాగా వ్యాఖ్యానించారు. అదేవిధంగా... ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న మూసీ నది ప్రక్షాళన.. సుందరీకరణ ప్రాజెక్ట్ కూడా విజయవంతం కావాలని ఆకాంక్షిస్తూ సీఎం రేవంత్ రెడ్డికి తన పూర్తి మద్దతును ప్రకటించారు. సీఎం రేవంత్, హైడ్రా కమిషనర్ రంగనాథ్ కొలువు దీరిన వేదికపై నాగార్జున ఎంతో సరదాగా మాట్లాడటం ఆసక్తిని కలిగించింది.