చిరు బర్త్‌డే... కొంచెం ఇష్టం, కొంచెం కష్టం!
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతుంది. ఆగస్టు 22న చిరు బర్త్‌డే వేడుకను జరుపుకునేందుకు మెగా ఫ్యాన్స్ రెండు నెలల నుంచే కౌంట్ డౌన్ షురూ చేశారు;
మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు రాబోతుంది. ఆగస్టు 22న చిరు బర్త్‌డే వేడుకను జరుపుకునేందుకు మెగా ఫ్యాన్స్ రెండు నెలల నుంచే కౌంట్ డౌన్ షురూ చేశారు. సాధారణంగా ప్రతి ఏడాది మెగాస్టార్ బర్త్‌డే అంటే ఫ్యాన్స్‌లో హడావిడి ఉంటుంది. ఎప్పటిలాగే ఈసారి కూడా మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా సందడి వాతావరణం నెలకొనబోతుంది. ఈ మధ్య కాలంలో స్టార్ హీరోల బర్త్‌డేలకు వారి పాత సినిమాలను రీ రిలీజ్ చేయడం ట్రెండ్‌గా వస్తుంది. మెగాస్టార్ గత ఏడాది, అంతకు ముందు ఏడాది బర్త్‌డేల సందర్భంగా సినిమాలను రీ రిలీజ్ చేయడం జరిగింది. ఈసారి కూడా చిరంజీవి ఫ్యాన్స్ కోసం రీ రిలీజ్ ప్లాన్ చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటన వచ్చింది.
చిరంజీవి పుట్టిన రోజు సందర్భంగా స్టాలిన్ సినిమాను రీ రిలీజ్ చేయబోతున్నారు. 2006లో వచ్చిన స్టాలిన్ సినిమా అప్పట్లో ఆశించిన స్థాయిలో కమర్షియల్‌గా విజయాన్ని సొంతం చేసుకోవడంలో విఫలం అయింది. మురుగదాస్ దర్శకత్వంలో వచ్చిన స్టాలిన్ పాజిటివ్ రెస్పాన్స్ దక్కించుకున్నప్పటికీ, ఆశించిన స్థాయిలో కలెక్షన్స్‌ను రాబట్టలేక పోయింది. ఆ సినిమా మెగా ఫ్యాన్స్‌కి మాత్రమే కాకుండా ఈతరం ప్రేక్షకులకు నచ్చే విధంగా మాస్ మసాలా ఎలిమెంట్స్‌ను కలిగి ఉంటుంది. త్రిష హీరోయిన్‌గా నటించిన స్టాలిన్ సినిమాలో అనుష్క ఐటెం సాంగ్‌లో నటించింది. స్టాలిన్ సినిమాలో మంచి మెసేజ్ ఉండటంతో పాటు, మాస్ ఎలిమెంట్స్ పీక్స్‌లో ఉంటాయి.
స్టాలిన్ సినిమా రీ రిలీజ్ అనేది కచ్చితంగా మెగా ఫ్యాన్స్‌కి కిక్ ఇచ్చే విషయం. చిరు బర్త్‌డే సందర్భంగా చాలా రోజులుగా ఎదురు చూస్తున్న విశ్వంభర సినిమా రిలీజ్ డేట్‌ను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని ఇన్ని రోజులు వార్తలు వచ్చాయి. కానీ తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం విశ్వంభర సినిమా విడుదల తేదీ విషయమై మెగాస్టార్ బర్త్‌డే సందర్భంగా క్లారిటీ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు. ఇప్పటి వరకు వీఎఫ్‌ఎక్స్ వర్క్ కొలిక్కి రావడం లేదు. అసలు ఈ ఏడాదిలో సినిమా ఉంటుందా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. వచ్చే ఏడాది సంక్రాంతికి అనిల్ రావిపూడి దర్శకత్వంలో చిరంజీవి చేస్తున్న సినిమా విడుదల కన్ఫర్మ్ అయింది.
2025 సంక్రాంతికి అంటూ ప్రకటన వచ్చిన చిరంజీవి విశ్వంభర సినిమాను వాయిదా మీద వాయిదాలు వేస్తున్నారు. విశ్వంభర సినిమాకు సంబంధించిన రిలీజ్ అప్‌డేట్‌ను మెగాస్టార్ పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే అవకాశాలు ఉన్నాయని అంతా భావించారు. కానీ విశ్వంభర విడుదల తేదీ విషయంలో ఇంకాస్త జాప్యం తప్పదని తెలుస్తోంది. చిరంజీవి బర్త్‌డేకి స్టాలిన్ సినిమా రీ రిలీజ్ కావడం ఫ్యాన్స్‌కి ఇష్టం కాగా, అదే రోజున విశ్వంభర సినిమా అప్‌డేట్ వస్తుందని ఎదురు చూస్తున్న వారికి నిరాశ మిగలడం అనేది కష్టం.
విశ్వంభర సినిమా విషయంలో ఇప్పటికే మెగా ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకుల్లో ఆసక్తి తగ్గుతూ వచ్చింది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా కోసం అంతా ఎదురు చూస్తున్నారు. ఇంకా ఆలస్యం చేస్తే విశ్వంభర ను ఆ తర్వాత ఎవరూ పట్టించుకోరు అంటూ విశ్లేషకులు మేకర్స్‌ను హెచ్చరిస్తున్నారు. భారీ సోషియో ఫాంటసీ సినిమాగా రూపొందిన ఈ సినిమాకు వశిష్ట దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మేకింగ్ విషయంలో తలెత్తిన గందరగోళం కారణంగా వీఎఫ్‌ఎక్స్ ఆలస్యం అవుతుందనే పుకార్లు సైతం ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతుంది.