లెజెండ‌రీ ఎన్టీఆర్ లేదా చిరంజీవి.. భార‌త‌ర‌త్న ఎవ‌రికి?

కొన్ని సంవ‌త్స‌రాలుగా లెజెండ‌రీ న‌టుడు, విశ్వ‌విఖ్యాత న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని టాలీవుడ్ లో బ‌ల‌మైన‌ డిమాండ్ ఉంది.;

Update: 2025-11-04 17:33 GMT

కొన్ని సంవ‌త్స‌రాలుగా లెజెండ‌రీ న‌టుడు, విశ్వ‌విఖ్యాత న‌వ‌ర‌స‌న‌ట‌సార్వ‌భౌముడు, అన్న‌గారు ఎన్టీఆర్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌ని టాలీవుడ్ లో బ‌ల‌మైన‌ డిమాండ్ ఉంది. చాలా సందర్భాల‌లో తెలుగు న‌టుడు అయిన నంద‌మూరి తారక రామారావు, డా.అక్కినేని నాగేశ్వ‌ర‌రావు వంటి వారిని దిల్లీ ప్ర‌భుత్వాలు చిన్న చూపు చూసాయ‌ని వాదించిన దిగ్గ‌జాలలో మెగాస్టార్ చిరంజీవి ఒక‌రు. దిల్లీలో తెలుగు క‌ళాకారుడికి జ‌రిగే అన్యాయాల‌ను సూటిగా ప్ర‌శ్నించిన ప్ర‌థ‌ముడిగా చిరంజీవిని ప‌రిశ్ర‌మ అంత తేలిగ్గా మ‌ర్చిపోలేదు. ఆయ‌న తెలుగువారికి జ‌రిగే అన్యాయాన్ని సూటిగా ప్ర‌శ్నించిన తర‌వాత‌నే కేంద్రంలోని మోదీ ప్ర‌భుత్వం ఇటువైపు దృష్టి సారించింది. ఆ త‌ర‌వాతే చిరంజీవిని ప్ర‌తిష్ఠాత్మ‌క‌ ప‌ద్మ‌విభూష‌ణ్ వ‌రించింది. ప‌లువురు తెలుగు ప్రతిభావంతుల‌కు పుర‌స్కారాల వెల్లువ మొద‌లైంది.

అయితే మెగాస్టార్ చిరంజీవి చాలా కాలంగా అన్న‌గారు ఎన్టీఆర్‌కి భార‌త‌ర‌త్న‌ ఇవ్వాల‌ని బ‌లంగా డిమాండ్ చేస్తున్నారు. కానీ ఇది ఇప్ప‌ట్లో నెర‌వేరేట్టు క‌నిపించ‌లేదు. ఇంత‌లోనే ఇప్పుడు ఎన్టీఆర్ త‌ర్వాత టాలీవుడ్ లో లెజెండ‌రీ న‌టుడిగా కీర్తిని అందుకుంటున్న మెగాస్టార్ చిరంజీవికి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే డిమాండ్ మెగాభిమానుల్లో ఊపందుకుంటోంది. తాజాగా బండ్ల గ‌ణేష్ మెగాస్టార్ కి భార‌త‌ర‌త్న ఇవ్వాల‌నే కోరిక‌ను వ్య‌క్త‌ప‌రచ‌గా దానికి సోష‌ల్ మీడియాల్లో మెగాభిమానులు వంత పాడుతూ వైర‌ల్ గా విష‌యాన్ని కేంద్రం దృష్టికి తీసుకెళుతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో సత్సంబంధాల కారణంగా మెగాస్టార్ చిరంజీవి భార‌త‌ర‌త్న గౌర‌వం పొందే అవ‌కాశం ఉంద‌ని కూడా ఊహాగానాలు సాగుతున్నాయి. భాజ‌పా నేత కిష‌న్ రెడ్డి స‌హా ప‌లువురు కాంగ్రెస్ నాయ‌కుల‌తోను చిరుకు స‌త్సంబంధాలున్నాయి. కేంద్ర‌, రాష్ట్రాల స్థాయిలో ఆయ‌న క‌మ్యూనికేష‌న్ దీనికి స‌హ‌క‌రిస్తుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. అధికార ఎన్డీఏ కూటమిలో ఆయన సోదరుడు పవన్ కళ్యాణ్ చురుకైన పాత్ర‌, మోదీకి అభిమాన పాత్రులుగా ఉన్నందున చిరుకు ఈ అవ‌కాశం లేక‌పోలేద‌నే ఊహాగానాలు సాగుతున్నాయి. మోదీ సార‌థ్యంలోని ఎన్డీఏ ప్ర‌భుత్వం స‌ముచిత ప్రోద్భ‌లం కార‌ణంగానే చిరుకు భారతదేశపు రెండవ అత్యున్నత పౌర పురస్కారం అయిన పద్మ విభూషణ్ లభించింది. భార‌త‌ర‌త్న కూడా ఈ ప్ర‌భుత్వంతోనే సాధ్య‌మ‌ని అభిమానులు బ‌లంగా న‌మ్ముతున్నారు. అయితే అమితాబ్, ర‌జ‌నీకాంత్ వంటి ప్ర‌ముఖులు కూడా జాబితాలో ఉన్నారు. కేంద్రం ఎవ‌రికి ముందుగా భార‌త‌ర‌త్న ప్ర‌క‌టిస్తుందో వేచి చూడాలి. చిరంజీవికి దాదాసాహెబ్ ఫాల్కే పుర‌స్కారం కూడా క్యూలో ఉంద‌న్న చ‌ర్చా వేడెక్కిస్తోంది. చిరు ప్ర‌స్తుతం త‌న కెరీర్ లో అత్యంత బిజీ ఆర్టిస్టుగా కొన‌సాగుతున్నారు. ఆయ‌న న‌టించిన విశ్వంభ‌ర వ‌చ్చే సంక్రాంతికి విడుద‌ల కానుంది.

Tags:    

Similar News