• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మూవీ రివ్యూ : ఛావా

మూవీ రివ్యూ : ఛావా

By - Tupaki Desk
Update: 2025-03-07 08:16 GMT

'ఛావా' మూవీ రివ్యూ

నటీనటులు: విక్కీ కౌశల్-రష్మిక మందన్నా-అక్షయ్ ఖన్నా-డయానా పెంటీ- ప్రదీప్ రావత్-నీల్ భూపాలం-అశుతోష్ రాణా-దివ్య దత్తా తదితరులు

సంగీతం: ఏఆర్ రెహమాన్

ఛాయాగ్రహణం: సౌరభ్ గోస్వామి

నిర్మాత: దినేశ్ విజాన్

రచన: లక్ష్మణ్ ఉటేకర్-రిషి విర్మాని-కౌశబ్ సవార్కర్-ఉన్మన్ బాంకర్-ఓంకార్ మహాజన్

దర్శకత్వం: లక్ష్మణ్ ఉటేకర్

ఛావా.. గత మూడు వారాలుగా ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర ప్రభంజనం సృష్టిస్తున్న హిందీ చిత్రం. ఛత్రపతి శివాజీ తనయుడు శంబాజీ మహరాజ్ జీవిత కథ ఆధారంగా విక్కీ కౌశల్ ప్రధాన పాత్రలో లక్ష్మణ్ ఉటేకర్ రూపొందించిన చిత్రమిది. ఇప్పుడీ సినిమాను గీతా ఆర్ట్స్ సంస్థ తెలుగులోకి తీసుకొచ్చింది. దీని విశేషాలేంటో చూద్దాం పదండి.

కథ:

ఛత్రపతి శివాజీ మరణంతో ఈ కథ ఆరంభమవుతుంది. శివాజీ చనిపోవడంతో మరాఠా సామ్రాజ్యం కుప్పకూలిపోతుందని మొఘల్ రాజు భావించి ఔరంగజేబు (అక్షయ్ ఖన్నా) సంబరాలకు సిద్ధమవుతాడు. కానీ శివాజీ వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆయన తనయుడు శంభాజీ (విక్కీ కౌశల్).. మొఘలులకు అడ్డుగోడగా నిలుస్తాడు. మొఘల్ సామ్రాజ్యం మీద తన సైన్యంతో దాడి కూడా చేస్తాడు. ఐతే శంభాజీని ఎలాగైనా పడగొట్టాలని పంతం పట్టిన ఔరంగజేబు.. అది అంత తేలిక కాదని అర్థం చేసుకుంటాడు. దీంతో కుట్రపూరితంగా శంభాజీని పడగొట్టడానికి ఎత్తుగడ వేస్తాడు. మరి ఆ ప్రయత్నంలో అతను విజయవంతం అయ్యాడా.. శంభాజీ ఔరంగజేబు చేతికి చిక్కాడా.. చివరికి అతడి కథకు ముగింపేంటి అన్నదే 'ఛావా'.

కథనం-విశ్లేషణ:

ఛావా.. దేశవ్యాప్తంగా మూడు వారాలుగా మార్మోగిపోతున్న పేరిది. ఉత్తరాది జనాలు ఈ సినిమా చూసి థియేటర్లలో ఉద్వేగానికి గురవుతున్న తీరు చూసి.. నిజంగా అంత గొప్పగా ఏముందీ సినిమాలో అని మన వాళ్లలో కూడా కుతూహలం కలిగింది. కొంచెం ఆలస్యం అయినా దీన్ని ఇప్పుడు గీతా సంస్థ తెలుగులోకి తీసుకొచ్చింది. అయితే రాజులు.. రాజ్యాల కథలు మనకు కొత్తవి కావు. అందులోనూ 'బాహుబలి' ఇచ్చిన హై తర్వాత.. ఇలాంటి ఓ కథతో మనవాళ్లను మెప్పించడం సవాలుగా మారింది. వివిధ భాషల నుంచి భారీ ప్రయత్నాలు కొన్ని బెడిసికొట్టాయి కూడా. బాలీవుడ్ నుంచి కూడా 'బాజీరావు మస్తానీ' లాంటి సినిమాలు వచ్చాయి. వెళ్లాయి. కానీ పెద్దగా స్పందన లేకపోయింది. ఐతే 'ఛావా' వాటన్నింటికీ భిన్నం. 'బాహుబలి'లా ఇందులో భారీతనం ఉండదు. ఇదేమీ విజువల్ వండర్ అనిపించదు. సంభ్రమాశ్చర్యాలకు గురి చేసే సన్నివేశాలుండవు. కానీ భావోద్వేగాలను పతాక స్థాయికి తీసుకెళ్లి ప్రేక్షుకులను కదిలించడంలో మాత్రం 'ఛావా' ఏ గొప్ప సినిమాకూ తీసిపోదు. ఎక్కడా కథ నుంచి పక్కకు వెళ్లకుండానే హీరో పాత్రకు అదిరిపోయే ఎలివేషన్ ఇవ్వడంలో దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ విజయవంతం అయ్యాడు. ఇక ఎమోషనల్ హై గురించి చెప్పాల్సిన పనే లేదు. ఈ కథతో కనెక్ట్ అయిన వాళ్లకు సినిమా చివరికొచ్చేసరికి గుండె బరువెక్కి.. కళ్లు తడి అవ్వడం ఖాయం.

చరిత్రను ఎవరికి నచ్చినట్లు వాళ్లు రాసుకున్నట్లే.. సినిమా కథలను సైతం ఎవరికి నచ్చిన శైలిలో వాళ్లు చెబుతారు. 'ఛావా' కూడా ఒక కోణంలో సాగే కథ. మొఘల్ రాజుల గురించి మనం పుస్తకాల్లో చదువుకున్నది ఒకటైతే వాస్తవంగా జరిగింది వేరనే కోణంలో ఈ కథను నరేట్ చేశారు. వాళ్ల దురాగతాలకు అడ్డుగా నిలిచిన ఛత్రపతి శివాజీ తనయుడు శంభాజీ మహారాజ్ కథను వీరోచితంగా చూపించాడు దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్. భారత దేశం మొత్తాన్ని ఇస్లాం రాజ్యంగా మార్చడం కోసం ఇక్కడి రాజ్యాల మీద ఔరంగజేబు పాశవికంగా దాడి చేస్తున్న దశలో అతడికి ఎదురు నిలిచిన శివాజీ హఠాత్తుగా మరణించిన దగ్గర ఈ కథ మొదలవుతుంది. శివాజీ మరణంతో ఇక తనకు ఎదురు లేదనుకున్న దశలో ఔరంగజేబుకు శంభాజీ ఎలా ఎదురు నిలిచి పోరాడాడన్నది చాలా ఎగ్జైటింగ్ గా చూపించారు 'ఛావా'లో. శివాజీ గురించి చెప్పడానికి చాలా చరిత్ర ఉంది కానీ.. ఆయన తనయుడు శంభాజీ గురించి సామాన్య జనానికి తెలిసింది తక్కువ. చరిత్రలో ఏముందో కానీ.. ఈ సినిమాలో అతడి పాత్రను చూస్తుంటే మాత్రం ఉద్వేగం కలుగుతుంది. తన వీరత్వాన్ని చాటే తొలి ఎపిసోడే ఒక క్లైమాక్స్ చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. శత్రువుల మీద సింహంలా పడిపోవడమే కాదు.. నిజంగా ఓ సింహంతోనే పోరాడే సన్నివేశం హీరో పాత్రకు అదిరిపోయే ఎలివేషన్ ఇస్తుంది.

ఐతే హీరో ఇంట్రో ఎపిసోడ్ తర్వాత కథనం కొంచెం నెమ్మదిగానే నడుస్తుంది. కోట లోపలి వ్యవహారాలు.. సన్నివేశాలు కొంచెం మామూలుగానే సాగిపోతాయి. ఔరంగజేబు పాత్ర అప్పుడప్పుడూ మెరుపులు మెరిపిస్తుంటుంది. ప్రథమార్ధం అయ్యేసరికి 'ఛావా' ఓ మోస్తరుగానే అనిపిస్తుంది. హిందీ ఆడియన్స్ అంతగా ఉద్వేగానికి గురయ్యేంతగా ఏముంది ఇందులో అనిపిస్తుంది. కానీ అసలు కథ తర్వాతే మొదలవుతుంది. ఔరంగజేబు మీద శంభాజీ తన సైన్యంతో మెరుపు దాడులు చేసే సీన్లతో 'ఛావా' ఊపందుకుంటుంది. ఇక ఆ తర్వాత తనకు వ్యతిరేకంగా కుట్ర జరిగి శత్రు సైన్యం శంభాజీ మీదికి దాడికి వచ్చినపుడు అతను ఎదురు తిరిగి పోరాడే సన్నివేశం అద్భుతమే. ఆ పాత్ర తాలూకు విశ్వరూపం అప్పుడే చూస్తాం. విక్కీ నటన అయితే పతాక స్థాయికి చేరుకుందక్కడ. శంభాజీ శత్రువుల చేతికి చిక్కగానే.. ఇంకేముందు కథ ముగిసింది కదా అనుకుంటాం. కానీ అక్కడ్నుంచి ఓ అరగంట పాటు కథను నడిపించి ప్రేక్షకుల గుండెల్ని మెలిపెట్టేశాడు దర్శకుడు. ఆ సన్నివేశాల గురించి చెప్పడం కాదు.. నేరుగా చూడాల్సిందే. 'ఛావా' ఎందుకు అంతమందిని కదిలించేసిందో చివరి అరగంటలోనే తెలుస్తుంది. ద్వితీయార్ధం 'ఛావా' స్థాయిని అమాంతం పెంచేస్తుంది. ఈ కథను చెప్పడంలో ఎంచుకున్న కోణం కొందరికి అభ్యంతరకంగా అనిపించొచ్చు. ఇందులో చూపించిందంతా నిజమా కాదా అనేది చర్చనీయాంశం. కానీ చెప్పాలనుకున్న కథను మాత్రం 'ఛావా' బృందం చాలా పకడ్బందీగా చెప్పింది. ఇలాంటి ఎమోషనల్ హై అందించే సినిమాలు అరుదే.

నటీనటులు:

విక్కీ కౌశల్ తన కెరీర్లోనే కాదు.. ఇండియన్ ఫిలిం హిస్టరీలోనే ప్రత్యేకంగా నిలిచిపోయే పెర్ఫామెన్స్ ఇచ్చాడు శంభాజీ పాత్రలో. మరాఠా యోధుల పౌరుషానికి ప్రతీకగా నిలిచే పాత్రలో విక్కీ నటన గురించి ఎంత చెప్పినా తక్కువ. ఆ పాత్రలో జీవించేశాడతను. తన ఆహార్యం.. నడక.. తన చూపు.. అన్నీ ఒక పరాక్రముడైన రాజును చూస్తున్న ఫీలింగ్ కలిగిస్తుంది. చివరి గంటలో విక్కీ నటన వేరే స్థాయిలో సాగింది. తనపై శత్రువులు దాడి చేసినప్పటి నుంచి చివరి వరకు విక్కీ నటనకు అలా కళ్లప్పగించి చూస్తుంటాం. విక్కీకి జోడీగా మహారాణి పాత్రలో నటించిన రష్మిక మందన్నా కొత్తగా కనిపిస్తుంది. ఇప్పటిదాకా ఆమె చేయని తరహా పాత్ర అది. తన పాత్ర నిడివి.. పరిధి తక్కువే అయినా.. కనిపించిన ప్రతి సన్నివేశంలోనూ కళ్లతో చక్కటి హావభావాలు పలికించి రష్మిక మెప్పించింది. ఇక ఔరంగజేబు పాత్రలో అక్షయ్ ఖన్నా నటన అద్భుతమే. ఎక్కువ మాట్లాడకుండా హావభావాలతోనే క్రూరత్వాన్ని పలికించడంలో అక్షయ్ తన నైపుణ్యాన్ని చాటాడు. సహాయ పాత్రల్లో అశుతోష్ రాణా.. ప్రదీప్ రావత్.. నీల్ భూపాలం.. మిగతా ఆర్టిస్టులందరూ కూడా బాగా చేశారు.

సాంకేతిక వర్గం:

టెక్నికల్ గా 'ఛావా'లో హై స్టాండర్డ్స్ కనిపిస్తాయి. ఆర్ట్ వర్క్.. స్టైలింగ్ చాలా గొప్పగా చేశారు. సౌరభ్ గోస్వామి ఛాయాగ్రహణం కూడా కంటికి ఇంపుగా చాలా బాగుంది. ఏఆర్ రెహమాన్ సంగీతం కొంచెం మిశ్రమానుభూతిని కలిగిస్తుంది. ఇలాంటి చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాల్లో మనకు అలవాటైన నేపథ్య సంగీతంతో పోలిస్తే రెహమాన్ కొంచెం భిన్నమైన శైలిలో మ్యూజిక్ చేయడం వల్లే ఈ మిశ్రమానుభూతి. కొన్ని చోట్ల ఆర్ఆర్ ఎమోషనల్ హై ఇస్తుంది కానీ.. కొన్ని చోట్ల మాత్రం సరిగా కుదరలేదనిపిస్తుంది. 'ఛావా' స్క్రిప్టును పకడ్డందీగా తీర్చిదిద్దింది లక్ష్మణ్ ఉటేకర్ అండ్ టీం. చరిత్రను వాళ్లు ఒక కోణంలో చూపించాలనుకున్నారు. అందుకు అనుగుణంగానే కథ.. పాత్రలు కనిపిస్తాయి. చూపించినదాంట్లో నిజాలెన్ని అబద్ధాలెన్ని అన్నది పక్కన పెడితే.. తాము ఎంచుకున్న కోణంలో కథను చాలా పకడ్బందీగా తీర్చిదిద్దారు. లక్ష్మణ్ టేకింగ్ అదిరిపోయింది. ముఖ్యంగా చివరి గంటలో అతను సన్నివేశాలను తీర్చిదిద్దిన తీరు గొప్పగా అనిపిస్తుంది.

చివరగా: ఛావా.. ఒక యోధుడి కథ-ఉద్వేగభరితంగా

రేటింగ్- 3/5

Tags:    
  • Chhaava 
  • Chhaavamoviereview 
  • Chhaavareview 
  • Chhaavarating 
  • Chhaavamovierating 
  • Moviereview 
  • Movierating 
  • publictalk 
  • Telugureview 
  • Tollywood 
  • Dubbedmovie 

Similar News

చాక్లెట్ బాయ్ ట్యాగ్ చెరిపేసి.. క్రూరమైన విలన్‌గా!

2026-11-06 17:30 GMT

శ్ర‌ద్ధాక‌పూర్ కొత్త‌ లుక్: న‌ట్టింట ల‌క్ష్మీ దేవి ప్ర‌త్య‌క్ష‌మైన‌ట్టు

2026-11-06 16:30 GMT

టైసన్ నాయుడు ఫస్ట్ సింగిల్.. క్యాచీ ఫోక్ బీట్ తో 'మదరాసి రబ్బరు బొమ్మ'

2026-11-06 16:03 GMT

సగం షెడ్యూల్‌కే గుడ్‌బై.. న్యాయపోరాటాలు!

2026-11-06 15:30 GMT

ఆఫర్లు తెచ్చిన మైకం.. కానీ నన్ను కాపాడింది అతడే!

2026-11-06 14:30 GMT

బ్యానర్‌లో కాదు.. ఆయనతోనే సినిమా చేయాలనుంది: మౌళి

2026-11-06 13:18 GMT

కమల్ హాసన్ బర్త్‌డే ట్రీట్.. అదిరిపోయిన సండియర్ ఫస్ట్ లుక్!

2026-11-06 13:15 GMT

రామాయణం తీయడానికి ఇంత ఖర్చు అవసరమా..!

2026-11-06 13:11 GMT

దీపావళి స్పెషల్.. వీకెండ్స్ లో సందడి చేయనున్న సినిమాలు, సిరీస్ లు ఇవే!

2026-11-06 13:03 GMT

వైజాగ్ నుంచి హాలీవుడ్ వరకు శోభిత గ్రాండ్ జర్నీ!

2026-11-06 12:30 GMT

చదువు,ఉద్యోగాలు వదిలేసి యువత థియేటర్ల ముందుండాలా?

2026-11-06 11:40 GMT

ఫేమస్ నటీమణులపై లేడీ సూపర్‌స్టార్ శ్రీదేవి ఇంపాక్ట్!

2026-11-06 11:30 GMT

Copyright @2026

Powered by Blink CMS