400 సినిమాల విలన్ కొడుకు హీరోగా
తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలలో దాదాపు 400 చిత్రాలలో నటించిన చరణ్ రాజ్ కేవలం విలన్ గా మాత్రమే కాదు.. ఎంపిక చేసుకున్న ప్రతి పాత్రలోనూ జీవిస్తాడు.;
90లలో విలన్ గా తనదైన అద్భుత నటనతో అలరించిన నటుడు చరణ్ రాజ్. తనదైన ట్రేడ్ మార్క్ విలనీతో తెలుగు ప్రజల మనసుల్లో చిరస్థాయిగా నిలిచిపోయాడు. అతడు దాదాపు 400 చిత్రాలలో నటించాడు. విలన్ పాత్రలతో పాటు, సహాయక పాత్రల్లోను రాణించాడు. ఇటీవల అతడు సినీరంగంలో అంతగా కనిపించడం లేదు. కానీ ఆయన నటవారసుడు వర్ధమాన టాలీవుడ్ నటుడిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నాడు.
తెలుగు, కన్నడ, మలయాళం, తమిళం, హిందీ భాషలలో దాదాపు 400 చిత్రాలలో నటించిన చరణ్ రాజ్ కేవలం విలన్ గా మాత్రమే కాదు.. ఎంపిక చేసుకున్న ప్రతి పాత్రలోనూ జీవిస్తాడు. చరణ్ రాజ్ మొదట కన్నడ నటుడు. తెలుగులో బ్లాక్‌బస్టర్ చిత్రం `ప్రతిఘటన`తో మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈ సినిమాలో విజయశాంతి ప్రధాన పాత్రలో నటించగా, చరణ్ రాజ్ సహాయక విలనీ పాత్ర రక్తి కట్టించింది. ఇది విజయవాడ గూండాయిజం, వంగవీటి రంగాకు వ్యతిరేకంగా రామోజీ రావు ఉషాకిరణ్ బ్యానర్ లో నిర్మించిన సినిమాగా అప్పట్లో చర్చల్లోకొచ్చింది. ఈ సినిమాతో పాటు, అరణ్యకాండ, దొంగ మొగుడు, స్వయంవరం, భలే దొంగ, స్టూవర్డ్‌పురం దొంగలు, సూర్య ఐపీఎస్ వంటి హిట్ చిత్రాలలో చరణ్ రాజ్ అద్భుత నటనతో అలరించాడు.
తొంబైలలో విలనీకి వన్నె తెచ్చిన నటుడిగా ఎదిగాడు. అటు తమిళం, కన్నడంలోను అతడు తన నటనను కొనసాగించాడు. ఇండస్ట్రీ దిగ్గజ హీరోలు రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ వంటి వారితో నటించడమే గాక, ఆ తర్వాతి జనరేషన్ లోని పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్ వంటి యువ తరం స్టార్లతోను నటించాడు.
నా అల్లుడు చిత్రంలో చరణ్ రాజ్ నటన మరోసారి విమర్శకుల దృష్టిని ఆకర్షించింది. అతడు, అసాధ్యుడు, కరెంట్, కొమరం పులి (పవన్), పరమవీర చక్ర, అధినాయకుడు, పైసా, నరకాసుర, ఆపరేషన్ రావణ్ లాంటి చిత్రాలలో కూడా ఆకట్టుకున్నాడు.
చరణ్ రాజ్ నటవారసుడిగా తేజ్ చరణ్ రాజ్ ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలలో నటిస్తున్నాడు. తేజ్ చరణ్ రాజ్ తమిళ చిత్రం లాలి (2017)తో నటనారంగంలోకి అడుగుపెట్టాడు. తరువాత 90MLలో కనిపించాడు. నరకాసుర (2023)తో తెలుగులోకి అడుగుపెట్టాడు. అయితే ఆ చిత్రం బాగా ఆడలేదు. జయాపజయాలతో సంబంధం లేకుండా అతడు అవకాశాలు అందుకుంటున్నాడు. అయితే అతడు తనను తాను నిరూపించుకునేందుకు చాలా పరిణతిని ప్రదర్శించాల్సి ఉంది.